తృణమూల్‌ అరాచక పర్వం

Mar 1,2024 07:20 #Editorial

ఒకప్పుడు సంఘ సంస్కరణకు, స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తికి, అభ్యుదయ ఆలోచనల వరవడికీ పేరెన్నిక గన్న పశ్చిమ బెంగాల్‌ – ఇప్పుడు తృణమూల్‌ కాంగ్రెస్‌ ఏలుబడిలో అరాచక పర్వానికి కేరాఫ్‌ అడ్రసుగా మారిపోయింది. రాజకీయ ప్రత్యర్థుల ఇళ్లపై దాడులు చేయడం, ఆస్తులు తగలబెట్టడం; హత్యలకు, అత్యాచారాలకూ పాల్పడడం తృణమూల్‌ గూండాలకు నిత్యకృత్యం అయిపోయింది! ఈ అమానుష కాండను అడ్డుకోవాల్సిన పోలీసు వ్యవస్థ నిర్లజ్జగా ఆ రౌడీల అడుగులకు మడుగులొత్తుతోంది. బరితెగిస్తున్న గూండాలకు రక్షణ కల్పించి, బాధితులపైనా, బాధితులకు అండగా నిలబడుతున్న వామపక్ష నాయకులూ, కార్యకర్తలపైనా తప్పుడు కేసులు బనాయిస్తోంది.గత కొద్దికాలంగా సందేశ్‌ ఖలీ ప్రాంతంలో అధికార పార్టీ ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. షాజహాన్‌ అనే తృణమూల్‌ నాయకుడు ఇష్టారాజ్యంగా వ్యవహరించటం, అతడికి జోడీగా శిబు హజ్రా, ఉత్తమ్‌ సర్దార్‌ అనే తైనాతీలు చెలరేగిపోవడం సామాన్య జనానికి కంటకప్రాయంగా మారింది. వామపక్ష ప్రభుత్వం గతంలో పేదలకు పంచిన భూములను తృణమూల్‌ గూండాలు బలవంతంగా లాక్కున్నారు. అడ్డు చెప్పినవారిపై అత్యంత దారుణంగా దాడులు చేశారు. మహిళలను, యువతులను చెరబట్టారు. వారి పార్టీ కార్యాలయాల్లో బంధించి, తుపాకులతో బెదిరించి, పాశవికంగా అత్యాచారాలకు పాల్పడ్డారు. ఈ దురాగతాల్లో షాజహాన్‌ ప్రత్యక్ష పాత్రధారి! అనేక అమానుష సంఘటనల నేపథ్యంలో ఇటీవల మహిళలు బహిరంగంగానే తమపై జరిగిన అకృత్యాలపై గొంతెత్తారు. తమపై ఎంత దారుణంగా లైంగిక హింస సాగిందో, ఎన్ని బెదిరింపులూ అదిలింపులతో తమను బాధపెట్టారో మీడియా ముందు ఏకరువు పెట్టారు. ఆగ్రహంతో కదలిన ప్రజలు ఎక్కడికక్కడ తృణమూల్‌ నేతల ఇళ్లపై దండెత్తారు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర పోలీసులు చోద్యం చూడ్డం తప్ప దుర్మార్గులపై కేసులు నమోదు చేయకపోవడమే తృణమూల్‌ మార్కు పాలన. సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకరత్‌ నేతృత్వంలోని బృందం బాధితులను పరామర్శించటానికి వెళ్లినప్పుడు- 144 సెక్షన్‌ అమల్లో ఉందని, పర్యటన కుదరదని అధికార పక్షానికి కొమ్ముకాసే కహానీలను వినిపించారు. హైకోర్టు జోక్యం చేసుకొని, రోజుల తరబడి 114 సెక్షన్‌ విధించటానికి వీల్లేదని చెప్పింది. బృందాకరత్‌ పర్యటనలో బాధిత మహిళలు వినిపించిన స్వీయానుభవాలు తృణమూల్‌ మూకల అమానుషానికి అద్దం పట్టేవిగా ఉన్నాయి. తన కుమార్తెను టిఎంసి గూండాలు వారం క్రితం అపహరించుకుపోయారని, ఇప్పటివరకూ ఎక్కడ ఉందో జాడ తెలియలేదని అపర్ణాదాస్‌ అనే మహిళ విలపిస్తూ చెప్పింది. ఇలాంటి వందలాది దుర్మార్గాలూ వెల్లడైనా, పోలీసులు ఒక్క కేసూ నమోదు చేయలేదు. పైగా, సందేశ్‌ ఖలీలో ఇన్ని అల్లర్లు జరగటానికి సిపిఎం నేత, మాజీ ఎమ్మెల్యే నిరపడా సర్దార్‌ కారణమంటూ గ్యాంగ్‌ రేప్‌ నిందితుడు, తృణమూల్‌ నాయకుడూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన్ని అరెస్టు చేశారు. తీవ్రంగా హింసించారు. ఆ ప్రాంతపు కీచకుడిగా అవతరించిన షాజహాన్‌ని మాత్రం ముందస్తు బెయిలు ఉందన్న సాకుతో అరెస్టు కూడా చేయలేదు. ఈ తతంగాన్ని గమనిస్తున్న రాష్ట్ర హైకోర్టు కేసును సుమోటోగా తీసుకొంది. పోలీసులు ప్రేక్షక, పక్షపాత పాత్రను వదిలిపెట్టి, నిందితులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. సిపిఎం నేత సర్దార్‌ని బేషరతుగా విడుదల చేయాలని, ఆయన్ని హింసించిన పోలీసులను వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించింది. ప్రజల తరఫున నిర్భయంగా పోరాడుతున్న సర్దార్‌కి తాము అభినందనలు చెబుతున్నామని పేర్కొంది. షాజహాన్‌కి ఎలాంటి ముందస్తు బెయిలూ లేదని, వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించింది. బాధితులకు బాసటగా, అరాచకానికి అడ్డుచక్రంగా వ్యవహరించిన హైకోర్టు చర్య అభినందనీయం. తృణమూల్‌ కాంగ్రెస్‌ అరాచక పాలనపై బెంగాల్‌ ప్రజల్లో గూడుకట్టుకొని ఉన్న అసంతృప్తి, ఆగ్రహం ఇప్పుడిప్పుడే పెల్లుబుకుతోంది. అధికార కావరంతో కన్నూమిన్నూ కానకుండా ప్రవర్తించే నిరంకుశ పాలకులకు ప్రజల చైతన్యమే సరైన జవాబు.

➡️