జీడీపంటకు మద్దతు ధర కోసం కదం తోక్కిన గిరిజనులు

Feb 8,2024 15:12 #anakapalle district, #Dharna
  • తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆందోళన
  • తహశీల్దార్‌కు, అగ్రికల్చర్‌ ఆపీసరుకు వినతి పత్రాలు అందజేత

ప్రజాశక్తి- దేవరాపల్లి (అనకాపల్లి) : జీడీ పంటకు గిట్టుబాటు ధర ప్రకటించి ప్రభుత్వమే రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని.. జీడీ తోటలకు ఈక్రాఫ్‌ నమోదు చేయాలని రుణాలు మంజూరు చేయాలని గురువారం దేవరాపల్లి తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట వందలాది మంది గిరిజనులు పెద్ద ఎత్తున ఆందోళన చేసి తహశీల్దార్‌కు, అగ్రికల్చర్‌ ఆపీసరుకు వినతి పత్రాలు సమర్పించారు. అనంతరం గిరిజన సంఘం జిల్లా ఉపాద్యాక్షులు బిటి దోర వ్వవaసాయకార్మిక సంఘం జిల్లా ప్రదాన కార్యదర్శి డి వెంకన్న మాట్లాడారు. జీడీ పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు దళారీల చేతిలో దోపిడీకి గురై తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆహార, వాణిజ్య పంటలకు మద్దతు ధరలు ప్రకటిస్తుంటాయని.. కానీ జీడి పంటకు మాత్రం ధర ప్రకటించడం లేదన్నారు. దీన్ని అవకాశంగా తీసుకొని వ్యాపారులు తమకు ఇష్టం వచ్చిన ధరకు రైతుల వద్ద కొనుగోలు చేస్తున్నారని అగ్రహారం వ్యక్తం చేశారు. ధర నిర్ణయంలో ఎటువంటి శాస్త్రీయత గాని, పారదర్శకత గాని లేదన్నారు. ప్రస్తుతం జీడీ పిక్కలు 80 కేజీల బస్తా వ్యాపారులు 7000 రూపాయలకు కొంటున్నారని.. ఒక బస్తా జీడిపిక్కల నుండి 25 కేజీల పప్పు వస్తుంది కేజీ పప్పు ధర 800 రూపాయలు అంటే ఒక బస్తా పిక్కలు వలన 20 వేల రూపాయలు వస్తుందని తెలిపారు. ఒక బస్తా పిక్కలు ప్రోసెసిడింగ్‌ కి 2000 రూపాయలు ఖర్చు అవుతుందని రైతులు కోరిన విధంగా బస్తా జీడిపిక్కల ధర 16,000 ప్రకటించిన ఇంకా వ్యాపారులకు 2000 రూపాయలు మిగులుతుందన్నారు. దీంతో పాటు జీడి తొక్క,నూక ఇతర ఉప ఉత్పత్తుల నుంచి కూడా వ్యాపారులు ఆదాయం పొందుతున్నారని తెలిపారు. దీని వలన అటు రైతులు ఇటు వినియోగ దారులు కూడా దోపిడీకి గురవుతున్నారని తెలిపారు. కాబట్టి ప్రభుత్వమే జీడి పంటకు గిట్టుబాటు ధర నిర్ణయించి కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. స్థానికంగా పండిన జీడిపిక్కలు కొనుగోలు చేసిన తరువాత మాత్రమే విదేశీ జీడిపిక్కలు దిగుమతికి అనుమతించాలన్నారు. జీడి పరిశోధనా కేంద్రాలు ప్రాంతాలవారీగా ఏర్పాటు చేసి అభివృద్ధి చేసిన నాణ్యమైన మొక్కలు రైతులకు అందించాలని.. ఉపాధి హామీ పథకం ద్వారా జీడి తోట అభివృద్ధికి ఎకరాకు 94 వేల రూపాయలు రైతులకు క్షేత్రస్థాయిలో అందించాలనా డిమాండ్‌ చేశారు. జీడి పంటకు స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం బ్యాంకుల ద్వారా పంట రుణాలు అందించాలని.. రైతు వారి సాగు విస్తీర్ణం నమోదు చేసి జీడి పంటకు వాతావరణ బీమా అమలు చేయాలని.. జీడి పంట పండే ప్రాంతాలులో జీడి పండ్లు, పిక్కలు ప్రొసెసింగ్‌ యూనిట్లు ప్రభుత్వమే ఏర్పాటు చేసి కార్మికులకు ఉపాధి కల్పించాలని.. జీడి రైతులకు పిక్కలు ఆరబెట్టుకునేందుకుట తార్పాన్లు ఉచితంగా అందించాలని.. జీడి తోటలలోఅంతర్‌ కషి పరికరాలు ఉచితంగా రైతులకు అందించాలని డిమాండ్‌ చేశారు. ఈకార్యక్రమంలో కె అప్పన్న, డి.శంకర్‌, నాగరాజు, దోరబాబు, జె.పోతురాజు, జగన్నాథం, సిహెచ్‌ దేముడు, నాగేశ్వరరావు, చిన నారాయణ, కె.సన్యాసి, కె.ఈశ్వరావు, జె.ఈశ్వరావు, లక్షమణరావు, శ్రీనుతో పాటు అదికసంఖ్యలో గిరిజన రైతులు పాల్గొన్నారు.

➡️