అరుణాచల్‌ప్రదేశ్‌లో బిజెపిపై ఆదివాసీల నిరసన

అరుణాచల్‌ప్రదేశ్‌లో 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్‌ అధికారంలో ఉండగా ఫిరాయింపు ఎమ్మెల్యేలను లాక్కొని 2019లో బిజెపి అధికారంలోకి వచ్చింది. ఈసారైనా పుంజుకోవాలని కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. గిరిజనులు అధికంగా ఉన్న ఈ ఈశాన్య రాష్ట్రంలో అభివృద్ధి పేరిట వారి మనుగడకే ముప్పు వాటిల్లుతోందని ఆదివాసీలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక ఇటీవల మణిపూర్‌లో చోటుచేసుకున్న ఘటనలు ఈ ఎన్నికలపై ప్రభావం చూపనున్నాయి.. లోక్‌సభ ఎన్నికల్లో ఈశాన్య రాష్ట్రాల ఫలితాలపై దేశమంతా ఆసక్తి నెలకొంది. తొలిదశ ఎన్నికల్లో భాగంగా అరుణాచల్‌ప్రదేశ్‌లో ఏప్రిల్‌ 19న పార్లమెంటుతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. జూన్‌ 4న ఫలితాలు వెలువడనున్నాయి. మొత్తం 60 అసెంబ్లీ స్థానాలల్లో 169 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. 59 బిజెపి, 23 కాంగ్రెస్‌, 16 నేషలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్‌సిపి), 23 నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌పిపి), 29 మంది స్వతంత్ర అభ్యర్థులు తలపడుతున్నారు. ఈ ఎన్నికల్లో బిజెపి నుంచి నలుగురు, కాంగ్రెస్‌ నుంచి ముగ్గురు మహిళా అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న అరుణాచల్‌ప్రదేశ్‌లో 2016లో కాంగ్రెస్‌ సిఎం పెమాఖండుతో సహా 44 మంది ఎమ్మెల్యేలు ఆపార్టీని వీడి పిపిఎ (పీపుల్స్‌ పార్టీ ఆప్‌ అరుణాచల్‌)లోకి ఫిరాయించారు. బిజెపి వారికి మద్దతు పలికింది. పిపిఎ ముఖ్యమంత్రిగా తిరిగి ఖండూ ప్రమాణస్వీకారం చేశారు. తిరుగుబాటుదారులతో కలిసి బిజెపి చేసిన రాజకీయాన్ని సుప్రీంకోర్టు కొట్టిపారేయడంతో తిరిగి కాంగ్రెస్‌ నేతృత్వంలో ఖండు సిఎం అయ్యారు. 2019లో ఫిరాయింపుదారులను చేర్చుకుని బిజెపి అధికారంలోకి వచ్చింది.

రెండు లోక్‌సభ స్థానాలు
రెండు లోక్‌సభ స్థానాలకుగాను 14 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌ ఉన్న వెస్ట్‌ లోక్‌సభ నియెజకవర్గానికి ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర మంత్రి కిరణ్‌ రిజుజు ఈ స్థానం నుంచి పోటీచేస్తున్నారు. ఆయనకు ప్రత్యర్థిగా అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీ ప్రెసిడెంట్‌ నబంతుకీ తలపడుతున్నారు. రెండు స్థానాల్లోనూ 8 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2004లో బిజెపి, 2009లో కాంగ్రెస్‌ ఇక్కడ నెగ్గాయి, 2014లో చెరో సీటు దక్కించుకున్నాయి. 2019లో రెండింటినీ బిజెపి గెలుచుకుంది. ఈ రాష్ట్రంలో మొత్తం 8,86,848 మంది ఓటర్లున్నారు. పర్వత ప్రాంతం కావడంతో కొన్ని ప్రాంతాల్లో పోలింగ్‌ కేంద్రాల నిర్వహణ కష్టంగా ఉండొచ్చని చెబుతున్నారు. సిబ్బంది, ఓటర్లు కాలినడకనే వెళ్లాల్సి ఉంటుంది.

కార్పొరేట్లకు వనరుల పందేరం
26 ఆదివాసీ తెగలు అరుణాచల్‌ప్రదేశ్‌లో నివసిస్తున్నాయి. అతిపెద్ద నిషి తెగవారి ప్రభావం ఈస్ట్‌ లోక్‌సభ నియోజకవర్గంపై ప్రభావం చూపనున్నాయి. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజెపి అభివృద్ధి పేరుతో ప్రైవేటు వారికి అనుమతులు జారీ చేసింది. విమానాశ్రయం, రోడ్ల విస్తరణకు వేల ఎకరాలు కేటాయించడంతో ఆప్రాంతంలో గిరిజనులకు అన్యాయం జరిగింది. ఎత్తైన పర్వతాలు, వాటి నడుమ హిమాలయ నదుల ప్రవాహంతో జలవిద్యుత్‌ ప్రాజెక్ట్‌లకు అనువైన ప్రదేశమని ఇటీవల బిజెపి ప్రభుత్వం కార్పొరేట్‌ కంపెనీలకు అక్కడ భూములను అప్పగించింది. జలవిద్యుత్‌ ప్రాజెక్ట్‌ల నిర్మాణం వల్ల పర్యావరణం దెబ్బతినడంతో పాటు తమ మనుగడకే ముప్పువాటిల్లుతుందని గిరిజనులు పెద్దఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపట్టటంతో కొన్ని ప్రాజెక్ట్‌లు ఆగిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా జలవిద్యుత్‌ ప్రాజెక్ట్‌లకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమౌతున్నా.. అధికార బలంతో వాటిని అణచివేస్తున్నారు. వీటికి తోడు ఇటీవల మణిపూర్‌లో చోటుచేసుకున్న ఘర్షణలలో మహిళలు, క్రైస్తవులపై దాడుల వంటి సంఘటనలు ఓటర్లలో ఆందోళన కలిగిస్తున్నాయి. 2014, 2019లో రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వచ్చేందుకు భారీగా నగదు, పశువులను పంపిణీ చేసిందని కాంగ్రెస్‌ నేత మెడీరామ్‌ దోడుమ్‌ అంటున్నారు. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) అమలుకు వ్యతిరేకత వ్యక్తమౌతోంది. కనీస అవసరాలైన విద్య, వైద్యం, ఉపాధి వంటి వాటిపై దృష్టిసారించకుండా కార్పొరేట్లకు అనుకూలంగా చట్టాలను చేస్తూ అభివృద్ధి చేసామంటూ చేస్తున్న బిజెపి ప్రచారాలను స్థానిక గిరిజనులు వ్యతిరేకిస్తున్నారు. ప్రకృతి వనరులపై అధిపత్యం, ప్రాజెక్ట్‌ల నిర్వహణ కోసం ఎలాగైనా అధికారంలోకి రావాలని బిజెపి పన్నాగాలు రచిస్తోంది. రాష్ట్రంలో 60 అసెంబ్లీ స్థానాలుండగా 10 అసెంబ్లీ స్థానాల్లో ప్రత్యర్ధులతో నామినేషన్లు వెనక్కి తీసుకునేలా చేసింది బిజెపి. ఎన్నికలు లేకుండా పదింటిలో ఏకగ్రీవం చేసుకున్న బిజెపి పన్నాగాలు ఎలాంటివో ఈ పరిణామంతో అర్థమవుతోంది.

➡️