‘ఓటుకు నోటు’ కేసుమధ్యప్రదేశ్‌కు బదిలీ చేయండి

Feb 10,2024 10:27 #CM Revanth Reddy, #Telangana
  •  సుప్రీంకోర్టులో బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల పిటిషన్‌
  •  తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డికి నోటీసులు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ‘ఓటుకు నోటు’ కేసు విచారణను తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్‌కి బదిలీ చేయాలని బిఆర్‌ఎస్‌ నేతలు దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రతివాది, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై నాలుగు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. 2015లో తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కోసం నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రేవంత్‌ రెడ్డి కోట్లు లంచంగా చూపి… అందులో అడ్వాన్స్‌గా రూ. 50 లక్షలు ఇచ్చారనేది ప్రధాన ఆరోపణగా ఉంది. ఈ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం వర్సెస్‌, ఏ రేవంత్‌ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం వర్సెస్‌ సండ్ర వెంకట వీరయ్యలతో రెండు కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రెండు కేసుల విచారణ తెలంగాణలోని ప్రత్యేక న్యాయమూర్తి ధర్మాసనం ముందు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే హైదరాబాద్‌ నుంచి ఈ కేసుల విచారణను తెలంగాణ వెలుపల మధ్యప్రదేశ్‌ లేదా చత్తీస్‌గఢ్‌ కు బదిలీ చేయాలని బిఆర్‌ఎస్‌ నేతలు, మాజీ మంత్రులు జగదీష్‌ రెడ్డి, సత్యవతి రాథోడ్‌, మహ్ముద్‌ అలీ, కల్వకుంట్ల సంజరు లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. న్యాయవాది పి మోహిత్‌ రావు దాఖలు చేసిన ఈ పిటిషన్‌ శుక్రవారం జస్టిస్‌ గవాయి, జస్టిస్‌ సందీప్‌ మెహతాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. ఈ కేసులో ప్రతివాదిగా ఉన్న రేవంత్‌ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి, హౌం మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారని పిటిషనర్ల తరపున సీనియర్‌ న్యాయవాదులు సిద్దార్థ్‌ దవే, డి శేషాద్రి నాయుడు, న్యాయవాది మోహిత్‌ లు వాదనలు వినిపించారు. అలాగే ఈ కేసులో వెంటనే ట్రయల్‌ కూడా మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తమకు సమాచారం ఉందని నివేదించారు. ఇప్పటికిప్పుడు ట్రయల్‌ మొదలైతే… విచారణపై ప్రభుత్వ పెద్దల ప్రభావం చూపే అవకాశం ఉందని వాదనలు వినిపించారు. రేరవంత్‌ రెడ్డిపై 88 క్రిమినల్‌ కేసులు నమోదైనట్లు తెలిపారు. పలు సందర్భాల్లో పోలీసులను బెదిరించేలా రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలు చేశారని ధర్మాసనానికి నివేదించారు. 2015 నుంచి విచారణ జాప్యం అయ్యేలా నిందితులు ఏదో ఒక సాకుతో పిటిషన్లు వేసినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో ఎపి మాజీ సిఎం చంద్రబాబు నాయుడు జోక్యం ఉందని తెలిపారు.

➡️