తమిళనాడులో భారీ వర్షాలు .. విద్యాసంస్థలకు సెలవు

Dec 18,2023 12:02 #heavy rains, #Tamil Nadu

చెన్నై :   తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు తమిళనాడు దక్షిణ జిల్లాలైన తిరనల్వేలి, తూత్తుకుడి, తెన్కాసి, కన్యాకుమారి తీవ్రంగా ప్రభావితమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తూత్తుకుడి జిల్లాలో ఒకరు మరణించినట్లు అధికారులు తెలిపారు. తూత్తుకుడి జిల్లా తిరుచెందూరులో 15 గంటల్లో 60 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. తిరునల్వేలిలోని పాలయం కొట్టైలో 26 సెం.మీ కాగా, కన్యాకుమారిలో 17.3 సెం.మీ వర్షపాతం నమోదైంది.

కుండపోత వర్షాల కారణంగా ప్రభావిత జిల్లాల్లో సోమవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. బ్యాంకులతో పాటు ప్రైవేట్‌ సంస్థలు మరియు ప్రభుత్వ రంగ సంస్థలు మూసివేశారు. తూత్తుకుడిలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని విమానాలను దారి మళ్లించారు. మరికొన్ని సర్వీసులను రద్దు చేశారు. వందేభారత్‌ సహా 17 రైళ్లు రద్దయ్యాయి.

పాపనాశం, పెరుంజని, పెచుపారై డ్యాముల నుంచి నీటిని వదలడంతో తిరునెల్వేలి, తూత్తుకుడి, తెన్కాసి, కన్యాకుమారి జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తిరునల్వేలిలోని తామిరబరణి నది పొంగిపొర్లుతోంది. దీంతో మిగులు జలాలను కన్నడ ఛానెల్‌లోకి విడుదల చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల నుండి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి ) హెచ్చరించింది. కొమోరిన్‌ ప్రాంతంలో తుఫాను విస్తరణ పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తోంది.

ఎన్‌డిఆర్‌ఎఫ్‌ బృందాలను మోహరించారు. 7,500 మందిని తరలించి 84 సహాయ శిబిరాలకు తరలించారు. అంతేకాకుండా ప్రభావిత జిల్లాల్లో 4 వేల మంది పోలీసులను మోహరించారు. మత్స్యకారులను సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించారు.

➡️