విషాద బడ్జెట్‌ 2024- మరోసారి వంచనకు గురైన రాష్ట్రం

Feb 2,2024 08:08 #cpm, #V.Srinivas rao

– కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం

– సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి సంబంధించిన ఎలాంటి ప్రతిపాదనలూ లేవని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు విమర్శించారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రభుత్వ రంగంలో కొనసాగించే విషయం గానీ, పోలవరం నిర్వాసితుల విషయం గానీ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, కడప ఉక్కు ఫ్యాక్టరీ, అమరావతి రాజధానికి నిధులు, విభజన హామీల ప్రస్తావన వంటి తదితర ఏ అంశాలూ ఈ బడ్జెట్లో లేకపోవడం మరొకసారి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను వంచించటానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని స్పష్టమవుతున్నదని పేర్కొన్నారు. రాష్ట్రం నుండి జిఎస్‌టి వసూళ్లు పెరిగినా రాష్ట్రం వాటా మాత్రం పెరగలేదని తెలిపారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా ప్రజలంతా ముందుకు రావాలని, వైసిపి, టిడిపి, జనసేన సహా అన్ని పార్టీలూ ఈ కేంద్ర ప్రభుత్వం విధానాలను వ్యతిరేకిస్తూ ముందుకు రావాలని కోరారు. కేంద్ర విద్రోహానికి వ్యతిరేకంగా ఈ నెల 7, 8 తేదీల్లో ఢిల్లీలో జరిగే ధర్నాను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ గత పదేళ్ల విషాద భారతం కొనసాగింపుగానే ఉందని, 99 శాతం ప్రజలకు ఎలాంటి ఉపశమనమూ లేదని పేర్కొన్నారు. బడా కార్పొరేట్లకు వికాసం, సామాన్యులకు విషాదం మిగిలిందని, ప్రభుత్వ, ప్రజల ఆస్తులను అంబానీ, అదానీ వంటి బడా కార్పొరేట్లకు కట్టబెట్టడంలో ఈ ప్రభుత్వం జయప్రదమైందని విమర్శించారు. నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని, ధరల పెంపుదలతో ప్రజలపై భారాలు పెరిగాయని, జిఎస్‌టి పేరుతో రెట్టింపు పరోక్ష పన్ను వసూలు చేయడమే దీనికి తార్కాణమని విమర్శించారు. ప్రత్యక్ష పన్ను రాయితీలన్నీ కార్పొరేట్‌ కంపెనీలకు ఇచ్చి పెంపుదల భారమంతా మధ్య తరగతి, ఉన్నత మధ్య తరగతిపై, ఉద్యోగవర్గాలపై వేయడం ఈ కాలంలో వారు సాధించిన ‘ఘనత’ అని వివరించారు. విదేశీ పెట్టుబడిదారులకు పెద్దపీట వేసి చిన్న పరిశ్రమలను చిన్న వ్యాపారస్తులను దెబ్బతీశారని, సాధారణ ప్యాసింజర్‌ రైళ్లను తగ్గించి వందేభారత్‌ రైళ్ల పేరుతో ప్రయాణాలను భారంగా మార్చారని విమర్శించారు. ఈ అసంతృప్తిని పక్కదారి పట్టించడానికి, అణచడానికి మతాన్ని అడ్డంగా ఉపయోగించుకుని రామనామ స్మరణతో ప్రజలను మాయ చేయాలని, దానికోసమే రామనామస్మరణ ముసుగు వేసుకున్నారని తెలిపారు. దేశాన్ని మతరాజ్యంగా మార్చడం వారి ధ్యేయమని, రాష్ట్రపతి ప్రసంగంలో, బడ్జెట్‌ ఉపన్యాసంలో స్పష్టంగా వెల్లడైందని, ఒకవైపు ఆర్థిక భారాలు ప్రజలపై వేస్తూ కార్పొరేట్లకు దేశ సంపదను కట్టబెడుతూ మరోవైపు మతోన్మాద భావోద్రేకాలను రెచ్చగొట్టి దేశాన్ని బలహీనపరిచే బిజెపి వైఖరిని మేధావులు, లౌకికవాదులు అన్ని పార్టీలూ ఖండించాలని కోరారు. ఈ ప్రజావ్యతిరేక బడ్జెట్‌ను వ్యతిరేకించాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు.మేడిపండు చందంగా బడ్జెట్‌ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ మేడిపండు చందంగా ఉందని కాంగ్రెస్‌ పార్టీ మీడియా సెల్‌ ఛైర్మన్‌ తులసిరెడ్డి పేర్కొన్నారు. రైతులకు తీరని అన్యాయం జరిగిందని, పోలవరం, హోదా అంశాలు ప్రస్తావనకు రాలేదని వివరించారు. వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తుందని భావించినా అదీ చేయలేదని తెలిపారు. గ్యాస్‌ సిలిండర్‌ ధరను రూ.500కు తగ్గిస్తారనుకున్నామని, చేయలేదని పేర్కొన్నారు. ుుుుు

➡️