విషాదాలనే వినోదాత్మకంగా..

Feb 3,2024 10:01 #feature

మున్నార్‌ ఫరూఖీ.. స్టాండప్‌ కమెడియన్‌గా ఎన్నో ఎత్తు పల్లాలు చూశాడు. ముంబయి వంటి మహానగరంలో పొట్ట కూటి కోసం పడరాని పాట్లు పడ్డాడు. స్టాండప్‌ కామెడీలో తన కంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నాడు. రాజకీయాలు, మత ఘర్షణలు, సాంఘిక దురాచారాలు .. ఇలా అనేక అంశాలు అతడి కామెడీలో చెర్నాకోలలా మనసును తాకుతాయి. నవ్విస్తూనే నిజాలను గ్రహించేలా ప్రేరేపిస్తాయి. కొందరికి అతడి వ్యంగ్య బాణాల వాడి తగిలింది. బెదిరించారు. కేసులు పెట్టారు. ఎన్నో విధాలుగా వేధించారు. నిర్బంధానికి గురిచేశారు. అయినా, మున్నార్‌ భయపడలేదు. బెదిరిపోలేదు. తాజాగా ముంబయి బిగ్‌బాస్‌ 17 సీజన్‌ విజేతగా నిలిచి, మరోసారి దేశం దృష్టిని ఆకర్షించాడు.

              మున్నార్‌ స్వస్థలం గుజరాత్‌ జునాగఢ్‌. చీకూచింతా లేని కుటుంబం. ‘ఆర్థికంగా ఇబ్బందులు పడ్డ రోజులు లేవు. అయితే నాకు 7 ఏళ్లు వచ్చేసరికి పరిస్థితులు తారుమారు అయ్యాయి. రెండునెలలకు గాను రూ.138 స్కూలు ఫీజు కట్టలేని పరిస్థితికి మా కుటుంబం వచ్చేసింది. మేమెందుకు ఇంత అథ:పాథాళానికి పడిపోయామంటే అప్పుడు అక్కడ జరిగిన మత ఘర్షణలు కారణం. ప్రాణాలు దక్కితే చాలనుకుని పారిపోయిన కుటుంబాల్లో మాది ఒకటి. రోజుల తరబడి తిండి లేకుండా తలుపులు కూడా తీయకుండా గడిపిన క్షణాలు నాకు ఇప్పటికీ గుర్తే’ అని మున్నార్‌ చెప్పిన ఆ ఘర్షణలు గుజరాత్‌ గోద్రా అల్లర్ల గురించే. ఆ విద్వేష పర్వంలో ఛిద్రమైన ఎన్నో కుటుంబాల్లో మున్నార్‌ కుటుంబం ఒకటి. మున్నార్‌కి 13 ఏళ్లు వచ్చేసరికి ముంబయికి మకాం మార్చాడు. అప్పటికే తల్లి చనిపోయింది. ‘ఆ రోజు.. అమ్మకు బాగోలేదని చెప్పగానే నేను పరుగెత్తుకుంటూ ఆస్పత్రికి వెళ్లాను. అక్కడ అమ్మకు అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. ఆమె గిలగిల కొట్టుకుని చేయి దూరంగా విసిరేసింది. అప్పుడే డాక్టరు బయటికి రావడంతో నేను పరుగెత్తుకుంటూ అమ్మ దగ్గరకి వెళ్లాను. ఆమె చెయ్యి గట్టిగా పట్టుకున్నాను. అప్పుడు నాకు ఎంత సంతోషమేసిందో! అమ్మ నాతోనే ఉందని. కానీ డాక్టర్లు నన్ను దూరంగా నెట్టేసి అమ్మను అక్కడి నుండి తీసుకెళ్లిపోయారు. ఆమె చనిపోయిందని చెప్పారు. అమ్మది సహజ మరణం కాదు. ఆత్మహత్య చేసుకుంది. కొన్ని రోజులకు వచ్చిన పోస్టుమార్టం నివేదికలో ఆమె వారం రోజుల నుంచి ఏమీ తినలేదని వచ్చింది. ఆ ఘర్షణల తరువాత అమ్మానాన్న జీవితం చాలా మారిపోయింది. ఎప్పుడూ దేనికోసమో తగాదా పడేవారు. ఆ ఘర్షణల తరువాత ఆర్థిక కష్టాలకు తోడు అమ్మ ఎంతో మానసిక వేదన పడిందని అర్థమైంద’ని మున్నార్‌ ఓ కార్యక్రమంలో వివరించాడు. ఆ సమయంలో ఆ షో నిర్వాహకులు, ప్రేక్షకులు కూడా కన్నీటి పర్యంతమయ్యారు.

స్కూలు ఫీజు కట్టలేక చదువు మధ్యలోనే ఆపేసిన మున్నార్‌ తల్లి మరణంతో ముంబయి చేరి, ఓ చిన్న దుకాణంలో పనికి చేరాడు. అక్కడికి చేరిన కొన్ని నెలలకే షాపు యజమాని కొడుకు చొరవతో మళ్లీ చదువుకు దగ్గరయ్యాడు. ఇంగ్లీషు చదవడం, రాయడం నేర్చుకున్నాడు. బాల్యం చేసిన ఎన్నో చేదు జ్ఞాపకాలతో తలమునకలౌతున్న మున్నార్‌ నెమ్మదిగా స్టాండప్‌ కామెడీవైపు దృష్టి మళ్లించాడు. ‘సెలబ్రిటీ అయిపోవాలని మొదట్లో అనుకున్నా.. కానీ స్క్రిప్ట్‌ రాసేటప్పుడు నేను అనుభవించిన కష్టాలు, నష్టాలు కళ్ల ముందు మెదిలేవి. వాటినే నా కథా వస్తువుగా తీసుకున్నాను. నా ఏడుపు లోంచి నవ్వు పుట్టించాను. నా బాధలోంచి చిరునవ్వులు చిందించాను. నా గతం జ్ఞాపకాలను అందరికీ పంచాను. ఇదే కొందరికి నచ్చలేదు. ఫలితంగా నన్ను జైలుకు పంపారు’ అని ఓ సందర్భంలో మున్నార్‌ చెబుతున్నప్పుడు దు:ఖంతో ఆయన గొంతు జీరబోయింది.

’37 రోజుల జైలు జీవితం ఎంతో భయంకరంగా గడిచింది. నా శత్రువు కూడా అక్కడికి వెళ్లకూడదని కోరుకుంటాను. స్టాండప్‌ కామెడీ ప్రారంభించిన సమయంలోనే 2020లో నాన్న చనిపోయాడు. ఆయన దహన సంస్కారాలకు కూడా నా దగ్గర డబ్బుల్లేవు. అప్పు చేసి ఆ కార్యక్రమం పూర్తి చేశాను. ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో కూడా నవ్వించడం ఆపలేదు. దేవుళ్లని దూషించానని, వాళ్ల నమ్మకాలను అవమానించానన్న నెపంతో నన్ను జైలుకు పంపారు. నిజానికి, దేశాన్ని కుదిపేసిన మత ఘర్షణలను, బాధితుల వెతలను వేలెత్తి చూపాననే నన్ను కటకటాల పాల్జేశారు. ఆ నిర్బంధ రోజుల్లో, కారణం లేకుండా అదే పనిగా నాపై లాఠీలు విరిగిపడుతున్న బాధలో కూడా నేను హాస్య సన్నివేశాలు రాసుకున్నాను. జైలు నుండి బయటికి వచ్చాక వాటిని స్టేజిపై ప్రదర్శిస్తే ప్రేక్షకులు పగలబడి నవ్వారు.’ అని చెప్పాడు మున్నార్‌.హాస్యం.. నవ్వుతూ నవ్వించడమే కాదు. ఆలోచింపజేసేదిగా ఉంటుందని ఎంతోమంది నిరూపించారు. శ్రామికుల నెత్తురు తాగే యజమానుల తీరు, యంత్రాల రాకతో కార్మికుల పొట్టకొట్టడం అనే విషాదభరిత అంశాలను ఎంతో హృద్యంగా, మరెంతో హాస్యంగా చూపించిన చార్లీచాప్లిన్‌ ఎప్పటికీ గుర్తుండిపోతారు. ఆకలితో అలమటిస్తున్న దీనార్థుల వెతలను ఆయన చూపించిన తీరుకు హాస్యంతో ఒక కంట, దు:ఖంతో మరో కంట కన్నీళ్లు వస్తాయి. మున్నార్‌ అలాంటి వారసత్వానికి ఒక కొనసాగింపులా అనిపిస్తాడు. అతడి కృషిని ప్రశంసిద్దాం. అతడి అధిక్షేప హాస్యాన్ని ఆస్వాదిద్దాం. ఇక ఈ జనవరి 28న బిగ్‌బాస్‌ విజేతగా ప్రకటించారు. ఆ రోజే మున్నార్‌ పుట్టినరోజు కావడం విశేషం.

➡️