వాణిజ్యం, వ్యాపారం మరింత సులభతరం

Jan 16,2024 22:09 #PM Modi
  • ‘నాసిన్‌’ ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీ

ప్రజాశక్తి- అనంతపురం ప్రతినిధి : నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కస్టమ్స్‌, ఇన్‌డైరెక్టర్‌ ట్యాక్సెస్‌ అండ్‌ నార్కొటిక్స్‌ అకాడమీ (నాసిన్‌)తో వాణిజ్యం, వ్యాపారం మరింత సులభతరం అవుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు తాము అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో వాణిజ్య, వ్యాపారాభివృద్ధికి అనేక రకాల చర్యలు తీసుకున్నామని వివరించారు. మంగళవారం ఆయన శ్రీసత్యసాయి జిల్లాలో పర్యటించారు. ముందుగా ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో లేపాక్షి వెళ్లారు. అక్కడి చారిత్రాత్మక కట్టడమైన వీరభద్ర ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద ఉన్న నాసిన్‌కు చేరుకున్నారు. రూ.541 కోట్లతో నిర్మించిన ఈ సంస్థ భవనాలను బటన్‌ నొక్కి ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడారు. గతంలో పన్నుల విధానం చాలా సంక్లిష్టంగా ఉండేదన్నారు. తాము అధికారంలోకి వచ్చిన ఈ పదేళ్లలో పన్నుల విధానంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని తెలిపారు. జిఎస్‌టితో దేశ ఆదాయం గణనీయంగా పెరిగిందని వివరించారు. గడిచిన తొమ్మిదేళ్లలో 25 కోట్ల మంది పేదలు పేదరికం నుంచి బయటకొచ్చారని అన్నారు. ఆదాయపు పన్ను విధానంలోనూ మార్పులు తెచ్చామని తెలిపారు. ఏటా దేశంలో పన్నులు చెల్లించే వారి సంఖ్య, మిడిల్‌ క్లాస్‌, నీయో మిడిల్‌ క్లాస్‌ సంఖ్య పెరుగుతోందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ అత్యంత వెనుకబడిన శ్రీసత్యసాయి జిల్లాలో నాసిన్‌ నిర్మాణంతో ఆనందంగా ఉందన్నారు. ప్రపంచ స్థాయి అకాడమీని ఇక్కడ ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రాంతాభివృద్ధికి దోహదపడుతుందని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌, నాసిన్‌ డిప్యూటీ జనరల్‌ కెఎన్‌.రాఘవన్‌, హిందూపురం ఎంపి గోరంట్ల మాధవ్‌ తదితరులు పాల్గొన్నారు.

సిపిఎం నాయకుల అక్రమ అరెస్టు

ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో సోమందేపల్లికి చెందిన సిపిఎం నాయకులను పోలీసులు సోమవారం రాత్రి అరెస్టు చేసి మడకశిర స్టేషన్‌కు తరలించారు. నాసిన్‌ భూములు కోల్పోయిన రైతులకు పరిహారం కోసం గతంలో ఈ నాయకులు పోరాడారు. ఈ నేపథ్యంలో సిపిఎం మండల నాయకులు ఎస్‌.చాంద్‌ బాషా, బాబు, కెవిపిఎస్‌ జిల్లా అధ్యక్షులు హనుమయ్య, జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేశులు, సిఐటియు మండల కార్యదర్శి కొండా వెంకటేశ్‌ తదితరులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి స్టేషన్‌లో పెట్టారు. ప్రధాని పర్యటన అనంతరం వారిని విడుదల చేశారు. అక్రమ అరెస్టులను సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.ఇంతియాజ్‌ ఖండించారు. భూములు కోల్పోయిన వారికి పరిహారం ఇవ్వాలని అడిగేందుకు వీల్లేకుండా సిపిఎం నాయకులను ప్రభుత్వ ప్రోద్బలంతో ముందస్తు అక్రమ అరెస్టులు చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు.

➡️