జైలులో చిత్రహింసలు పెట్టారు : నాగపూర్‌ జైలులో అనుభవాలపై ప్రొ. సాయిబాబా

న్యూఢిల్లీ : ‘పోలియో కారణం గా కాళ్లు చచ్చుబడి పోవడంతో చిన్నప్పుడు మా అమ్మే నన్ను స్కూలుకు తీసుకెళ్లింది. ఆ తల్లి జబ్బు చేసి చనిపోయినప్పుడు కడసారి చూసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. పెరోల్‌ కోసం అభ్యర్థిస్తే తిరస్కరించారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయని మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన ఆరోపణలపై సెషన్స్‌ కోర్టు విధించిన పదేళ్ల జైలు శిక్షను కొట్టివేస్తూ, తనను నిర్దోషిగా మహారాష్ట్ర బాంబే హైకోర్టు అప్పటికే ఒకసారి ప్రకటించింది. నాగ్‌పూర్‌ జైలులో తాను ఎదుర్కొన్న చిత్రహింసలను ప్రొఫెసర్‌ సాయిబాబా శుక్రవారం నాడిక్కడి సూర్జిత్‌ భవన్‌లో విలేకరుల గోష్టిలో వివరించారు. జైలులో ఉన్న సమయంలో తాను గుండె జబ్బుతో బాధపడ్డాను, అప్పుడప్పుడు స్పహ కోల్పోయేవాణ్ణి, అయినా, చికిత్స చేయించేవాళ్లుకాదు. .తన తోటి ఖైదీలు ఇద్దరు వాష్‌రూమ్‌కు తనను తీసుకెళ్లి స్నానం చేయించేవారు. భార్య పంపిన మందులను తీసుకోవడానికి కూడా నిరాహారదీక్ష చేయాల్సి వచ్చింది. అధికారులు పిరికివారిలా వ్యవహరించారు అరెస్టు చేసినప్పుడు, పోలీసులు తనను ఈద్చుకెళ్లడం వల్ల కుడి చేయి వాచిపోయింది.
నరాలు దెబ్బతినడంతో కుడి చేయి పైకి లేపలేకపోయాను. ఇంతలో, మెదడు, మూత్రపిండాలలో తిత్తులు ఏర్పడ్డాయి. పాండునరోతే జ్వరంతో అరెస్టయిన గిరిజన యువకుడు వైద్యం అందక మృతి చెందాడు. తమ కోసం సెషన్స్‌ కోర్టులో కేసు వాదించిన సురేంద్ర గాడ్లింగ్‌ కూడా జైలు పాలయ్యాడు. ఇప్పటికీ తాను తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నానని ఆయన తెలిపారు.
సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు మురళీధరన్‌, ఈ కేసులో నిర్దోషిగా విడుదలైన హేమ్‌ మిశ్రా, సాయిబాబా భార్య వసంతకుమారితోబాటు నందితా నరేన్‌, కరెన్‌ గాబ్రియేల్‌ తదితరులు ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.

➡️