తాబేలు-కుందేలు మధ్య మళ్లీ పోటీ

Jan 17,2024 10:34 #jeevana

అది ఒక చిట్టడవి. అక్కడ అనేక రకాల పక్షులు, అంజి అనే కోతి, కుందేళ్లు, తాబేళ్లు ఉంటున్నాయి. అయితే చాలా కాలంగా కుందేళ్లకు, తాబేళ్లకు మాటల్లేవు. ఎప్పుడో తాతల కాలంలో కుందేలు-తాబేలు మధ్య జరిగిన పోటీలో తాబేలు గెలవడం అవి జీర్ణించుకోలేకపోతున్నాయి. ఒకసారి అంజి దగ్గరికి చిట్టి అనే కుందేలు వెళ్లింది. ‘మామా! నేను తాబేలుతో పోటీ పడాలనుకుంటున్నాను. న్యాయ నిర్ణేేతగా నువ్వే ఉండాలి. తాబేళ్లను కూడా ఒప్పించు’ అని అంది. అంజి తాబేళ్లతో విషయం చెప్పింది. రాణి అనే తాబేలు, కుందేలుతో పోటీకి సిద్ధమైంది. పోటీ మొదలైంది. ‘ఈ రావి చెట్టు నుండి దూరంగా ఉండే మర్రి చెట్టు వరకు వెళ్లి తిరిగి ఇక్కడకి రావాలి. అక్కడ మర్రి చెట్టు వద్ద చిలుక, పావురం మిమ్మల్ని గమనిస్తాయి’ అని చిట్టి, రాణిలకి అంజి చెప్పింది.

రాణి మెల్లగా నడక ప్రారంభించింది. చిట్టి ముందుకు పరుగు తీసి పొదల మాటుకు చేరుకుంది. అక్కడ దానికి మత్తు ఆకుల చెట్టు కనిపించింది. ముత్తాత కాలంలో జరిగినట్లుగా ఈసారి జరగకూడదనుకుని ఒక ఆకును జాగ్రత్తగా తుంచి దగ్గరపెట్టుకుంది.

దారిలో నడుస్తూ రాణి కోసం ఎదురుచూస్తూ ఉంది. ‘రాణి దగ్గరకు రాగానే ఈ ఆకు వాసన చూపిస్తా. వెంటనే అది మత్తులోకి జారుకుంటుంది. అప్పుడు నేనే పరుగుపందెంలో గెలుస్తాను’ అనుకుంటూ ‘అసలు ఈ ఆకు వాసన వస్తుందా లేదా’ అని వాసన చూసింది. ‘అబ్బో బాగానే వాసన వస్తుంది’ అనుకుంటూనే నిద్రలోకి జారిపోయింది. ఈలోపు రాణి మర్రి చెట్టు వద్దకు చేరుకుంది. అక్కడే ఉన్న చిలుక, పావురం ‘నువ్వే ముందుగా వచ్చావు రాణి’ అన్నాయి.

రాణి తిరుగుప్రయాణంలో చిట్టి కోసం వెతికింది. దారిలో పొద పక్కన మత్తుగా నిద్రపోతున్న చిట్టి కనిపించింది. దాని దగ్గరకు వెళ్లి గట్టిగా నిద్రలేపింది. ‘ఏంటి నువ్వు ఇలా పడుకున్నావు. నీ ఆరోగ్యం బాగానే ఉందా’ అని కంగారుపడుతూ అడిగింది. ‘నేను మర్రి చెట్టు వద్దకు వెళ్లి వస్తున్నాను. నువ్వు ఇంకా రాలేదని చెప్పారు. లే త్వరగా మర్రి చెట్టు వద్దకు వెళ్లు’ అని చిట్టిని తొందరపెట్టింది. రాణి మంచితనం అర్థమై చిట్టి సిగ్గుతో తలవొంచుకుంది. స్వార్థం లేని రాణి మనసు తన వాళ్లందరూ తెలుసుకునేలా చేయాలని మర్రిచెట్టు వైపు కాకుండా రావి చెట్టు వైపు పరుగు ప్రారంభించింది.

చిట్టి అక్కడికి రాగానే కుందేళ్లన్నీ ఎంతో సంబరపడ్డాయి. ‘నువ్వు గెలిచావు చిట్టి!’ తాతా ముత్తాతల వల్ల కానిది నువ్వు సాధించావు’ అంటూ పొగడ్తలతో ముంచెత్తాయి. అంజి కూడా చిట్టిని అభినందించింది. ‘ముందు రాణిని రానీయండి, ఆ తరువాత విజేత ఎవరో ప్రకటించండి’ అంది చిట్టి చాలా నింపాదిగా. కాసేపటికి రాణి వచ్చింది. రాణి రావడంతోనే చిట్టి, రాణి దగ్గరకు వెళ్లి ‘ఈ పోటీలో గెలిచింది నేను కాదు. రాణి. నేను స్వార్థంతో ఆలోచించాను. మత్తు వాసన ఆకు చూపించి రాణిని మత్తులోకి పంపాలనుకున్నాను. కానీ ఆ వాసన చూసి నేను పడిపోయాను. నన్ను దాటుకుని వచ్చేస్తే రాణినే మొదట వచ్చేది. కానీ అలా చేయక, నన్ను నిద్ర లేపింది. నాకు ఏమైందోనని కంగారు పడింది. స్వార్థం లేని దాని మనసుకు అపరాధభావంతో కుంగిపోయాను. పోటీ ఆరోగ్యకరంగా ఉండాలని రాణి నిరూపించింది. ఇంకెప్పుడూ తాబేళ్లతో నేను అనుచితంగా ప్రవర్తించను’ అని జరిగిందంతా చెప్పింది. ఆ రోజు నుంచి కుందేళ్లు, తాబేళ్లు కలిసిమెలిసి జీవిస్తున్నాయి.

– యు.విజయశేఖర రెడ్డి, 99597 36475.

➡️