ఐదు రోజుల ఇడి కస్టడీకి హేమంత్‌ సోరెన్‌

Feb 2,2024 12:07 #Hemant Soren, #Supreme Court

హైదరాబాద్‌కు 43మంది జార్ఖండ్‌ ఎమ్మెల్యేలు

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో/రాంచీ

రాంచీ : జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరేన్‌ను ఐదు రోజుల ఇడి కస్టడీకి అనుమతిస్తూ ఇక్కడి ప్రత్యేక పిఎంఎల్‌ఎ కోర్టు శుక్రవారం ఆదేశాలు ఇచ్చింది. 8.5 ఎకరాలను హేమంత్‌ సోరేన్‌ను అక్రమంగా ఆక్రమించుకుని, విక్రయించారని ఆరోపిస్తూ బుధవారం రాత్రి హేమంత్‌ సోరెన్‌ను ఇడి అరెస్టు చేసింది. అంతకుముందు సుమారు ఏడు గంటల పాటు విచారించింది. గురువారం సోరేన్‌ను ఒకరోజు జ్యుడీషియల్‌ కస్టడీకి కోర్టు పంపింది. దీంతో శుక్రవారం మళ్లీ ఇడి అధికారులు హేమంత్‌ సోరేన్‌ను కోర్టు ముందు హాజరుపర్చారు.

హేమంత్‌ సోరేన్‌ పిటీషన్‌ను తిరస్కరించిన సుప్రీం

ఇడి తనను అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ హేమంత్‌ సోరేన్‌ దాఖలు చేసిన పిటీషన్‌ను సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనం శుక్రవారం తిరస్కరించింది. అరెస్టుపై ప్రస్తుతం జోక్యం చేసుకోవడానికి ధర్మాసనం నిరాకరించింది. హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. ‘మీరు హైకోర్టుకు ఎందుకు వెళ్లరు?. ఇది రాజ్యాంగ న్యాయస్థానం. హైకోర్టులు అందరికీ తెరిచే ఉంటాయి. మీరు నేరుగా ఇక్కడికి రావడానికి మేం అనుమతిస్తే.. మేం అందర్నీ అనుమతించాల్సి ఉంటుంది’ అని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా హేమంత్‌ సోరెన్‌ తరుపున న్యాయవాదులు కపిల్‌ సిబాల్‌, ఎఎం సింఘ్వీలకు తెలిపారు. ఈ ధర్మాసనంలో జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌, జస్టిస్‌ బేలా ఎం త్రివేది కూడా ఉన్నారు. ‘నేరుగా సుప్రీంకోర్టుకు రాకూడదు’ అని ధర్మాసనం తెలిపింది. ఈ విచారణ పూర్తి చేయడానికి హైకోర్టుకు టైమ్‌ లైన్‌ నిర్ధేశించాలని కపిల్‌ సిబాల్‌ అభ్యర్థించగా, ధర్మాసనం తిరస్కరించింది. తాము హైకోర్టును నియంత్రించాలని కోరుకోవడం లేదని స్పష్టం చేసింది.

హైదరాబాద్‌ చేరుకున్న ఎమ్మెల్యేలు

జెఎంఎం, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన 43 మంది ఎమ్మెల్యేలు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. టిపిసిసి నేతలు వారిని రెండు బస్సుల్లో ప్రత్యేక బందోబస్తు నడుమ షామీర్‌పేటలోని లియోనా రిసార్ట్‌కు తరలించారు. జార్ఖండ్‌ రాష్ట్ర నూతన సిఎంగా జెఎంఎం నేత చంపారు సోరెన్‌ ప్రమాణస్వీకారం చేసినప్పటికీ ఈ నెల 5న బలపరీక్ష నేపథ్యంలో తమ ఎమ్మెల్యేలు చేజారకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా జెఎంఎం, కాంగ్రెస్‌ నాయకత్వం వీరికి హైదరాబాద్‌లో ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేసింది. జార్ఖండ్‌ ఎమ్మెల్యేలకు సహాయకులుగా తెలంగాణ యూత్‌ కాంగ్రెస్‌ నాయకులను టిపిసిసి నియమించింది. నలుగురు ఎమ్మెల్యేలకు ఒకరు చొప్పున టిపిసిసి ఏర్పాట్లు చేసింది. రిసార్ట్‌ పరిసరాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. గురువారం సాయంత్రానికే వారు హైదరాబాద్‌లోని క్యాంపునకు రావాల్సి ఉన్నా రాంచీలో వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో వారి ప్రయాణం వాయిదాపడింది. జార్ఖండ్‌ ఎమ్మెల్యేల వెంట ఆ రాష్ట్ర పిసిసి నాయకులూ వచ్చారు. తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి దీప్‌దాస్‌ మున్షి ఎప్పటికప్పుడు ఎఐసిసి నాయకులతో మాట్లాడుతూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

➡️