ఉద్యోగాలిప్పిస్తామని కుచ్చుటోపీ..!

  • నకిలీ ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి టోకరా
  • గుత్తిలో కార్యాలయం ఏర్పాటు చేసి రూ.1.60 కోట్లు వసూలు

ప్రజాశక్తి-గుత్తి (అనంతపురం జిల్లా) : ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అమాయకులకు మాయమాటలు చెప్పి గుత్తిలో రూ.కోట్లు వసూలు చేసిన మోసం చేసిన దంపతులు హైదరాబాదుకు ఉడాయించిన ఘటన అనంతపురం జిల్లా గుత్తిలో చోటు చేసుకుంది. తమకు జరిగిన అన్యాయం గురించి ప్రశ్నిస్తే తమకు పెద్దపెద్ద వాళ్లు తెలుసని ఇలాగే వ్యవహరిస్తే ఇంటికొచ్చి చావకొడతామని బెదిరిస్తున్నట్లు బాధితులు వాపోతున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ భాగోతం గురించి బాధితులు తెలిపిన వివరాల ప్రకారం…గుత్తి పట్టణ శివారు కర్నూలు రోడ్డులోని ఓ కాలనీలో రాణి నాగేశ్వరి, సాయి దుర్గాప్రసాద్‌ దంపతులు ఓ గదిని అద్దెకు తీసుకుని ఎమ్‌ఎస్‌.సొల్యూషన్స్‌ (జాబ్‌ కన్సల్టెన్సీ) పేరుతో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. తమ ప్రధాన కార్యాలయం హైదరాబాదులో ఉందని నమ్మబలికారు. వాట్సాప్‌ గ్రూప్‌ను తయారు చేసి నిరుద్యోగ యువకులను ఆకర్షించేందుకు పలు కంపెనీల సంబంధించిన కార్యాలయాల వీడియోలను పోస్ట్‌ చేసేవారు. నిరుద్యోగులకు సాఫ్ట్‌వేర్‌తో పాటు వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మించారు. ఉద్యోగాలకు అవసరమయ్యే విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు, వివిధ కళాశాలలకు చెందిన సర్టిఫికెట్లు నకిలీవి వారే సృష్టించేవారు. ఈ నేపథ్యంలో చెర్లోపల్లి కాలనీకి చెందిన జి.మోహన్‌కృష్ణ అనే యువకుడు వారిని ఆశ్రయించాడు. రూ.3.35 లక్షలు ఇస్తే ఉద్యోగమిప్పిస్తామని చెప్పడడంతో మోహన్‌కృష్ణ రూ.50 వేలు ఫోన్‌ పే ద్వారా, రూ.లక్ష హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు ద్వారా వారి అకౌంట్‌కు చెల్లించారు. మరో రూ.1.85 లక్షలు రెండు విడతలుగా ఇంటికెళ్లి ఇచ్చారు. నగదు అందుకున్న దంపతులు ఆ యువకుడికి నకిలీ ఉద్యోగ ధ్రువీకరణ పత్రం, ఐడి కార్డు, ల్యాబ్‌టాప్‌ను అందజేసి వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేయాలని చెప్పారు. వార్షిక వేతనం రూ.4.50 లక్షలని నమ్మించారు. ఐదు నెలలపాటు ఆ యువకుడిని ప్రతినెలా రూ.16 వేలు చొప్పున వెబ్‌నెట్‌ ఇన్ఫోసెస్‌ అనే సాఫ్ట్‌వేర్‌ కంపెనీ పేరుతో ఎమ్‌ఎస్‌.సొల్యూషన్స్‌ నిర్వాహకులే వేతనంగా చెల్లించారు. కంపెనీలో చేరిన తరువాత నెలకు రూ.35 వేలు జీతం వస్తుందని చెప్పారు. ఐదు నెలలుగా ఆ యువకుడికి జీతం రాకపోవడంతో అనుమానం వచ్చి రాణి నాగేశ్వరిని, సాయి దుర్గాప్రసాద్‌ను నిలదీశారు. కంపెనీ గురించి ఆరా తీయగా అది ఫేక్‌ కంపెనీ అని తేలింది. ఇలా ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఒక్కొక్కరితో రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు వసూలు చేసినట్లు సమాచారం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించి 86 మంది ఉద్యోగాలు వస్తాయని ఆశతో డబ్బు ఇచ్చి మోసపోయారు. వీరందరి వద్ద నుంచి సుమారు రూ.1.60 కోట్లు వసూలు చేసుకుని మోసం చేసినట్లు సమాచారం. ఇటీవల వీరు గుత్తిలో ఉన్న తమ కార్యాలయం బోర్డు తిప్పేశారు. తమకు జరిగిన మోసంపై బాధితులు పోలీసులను ఆశ్రయించారు. న్యాయం చేయాలని కోరారు.

➡️