మరుగుదొడ్డి

Nov 19,2023 07:44 #Editorial

‘కొత్తగా పెళ్లి చేసుకొని అత్తగారింటికి వచ్చిన షమీమ్‌కు ఎక్కడా లెట్రిన్‌ కనిపించలేదు. ఇంటెనక్కి పోయింది. అక్కడా కనపడలేదు. చుట్టూ చూసింది. ఒక మూలన నాలుగు కర్రలు పాతి, చుట్టూ గోనె సంచులు, తాటి కమ్మలు కట్టివున్న గుడారం లాంటిది కనిపించింది. దానికి తలుపులాగా ఒక కర్ర అడ్డంగా ఉంది. దానికి గోనె పట్టా వేళాడుతోంది. అంతలో ఆ గోనె పట్టాను జరుపుకుంటూ ఒకామె బైటకొచ్చింది లోటా బట్టుకొని’…అంటూ మరుగుదొడ్డి బాహ్యరూపాన్ని, లోపలి భయానక పరిస్థితినీ, పేదరికం తీవ్రతను షాజహానా ‘సండాస్‌’ అనే కథలో వర్ణిస్తుంది. ఇదోక బాధాకరమైన పరిస్థితి అయితే, అంతకంటే దారుణమైన స్థితిని ‘బ్లాక్‌’ అనే కథలో ఎం.ఎం.వినోదిని చెబుతారు. ‘యింటోళ్లందరి యేరుగుడు పాతికేళ్లు నుంచి యెత్తీయెత్తీ సేతులు రేకులయినారు. డబ్బులడిగితే ముడ్లో సెగ్గడ్డలు మొలుచుకొత్తరు. వొకటా రెండా? పాతికేల్ల బట్టి సేత్తన్నా? యిన్నేల్ల బట్టి యీల్ల ఆస్తులు బెరిగినారు! లోకంలో దరలు బెరిగినారు! నా బిడ్డ బెరిగ… సివరికి యీడింట్లో యేరిగే ముడ్లు కూడా బెరిగినారు. నా బత్తెం మాత్తరం బెరగలా…’ అంటూ ‘బ్లాక్‌’ కథలో మాన్యువల్‌ స్కావెంజర్ల దైన్యాన్ని కళ్లకు కడతారు వినోదిని. మాన్యువల్‌ స్కావెంజింగ్‌ మానవాళికి ముప్పు అని, 98 శాతం మాన్యువల్‌ స్కావెంజర్లలో మహిళలు, బాలికలు అతి తక్కువ వేతనం పొందుతున్నారని… అదే వర్గం నుంచి వచ్చిన మెగాసెసే అవార్డు గ్రహీత బెజవాడ విల్సన్‌ అంటారు. మన దేశ అభివృద్ధి గ్రాఫ్‌ను అద్దంలో చూపే కథలివి. వాస్తవ జీవితానికి ప్రతిబింబాలు. దేశంలోని సగానికి పైగా జనాభా నిత్యం అనుభవించే మరుగుదొడ్డి సమస్యలు.
140 కోట్ల జనాభా వున్న భారత్‌లో 53 శాతం మందికి పైగా మరుగుదొడ్లు లేవంటే నమ్మగలమా? గ్రామీణ ప్రాంతాలలో 66 శాతం మంది ఇప్పటికీ బహిర్భూమిలోనే కాలకృత్యాలు తీర్చుకుంటున్నారనేది నిష్టుర సత్యం. ఎస్సీల్లో దాదాపు 66.1 శాతం, ఇతర కులాల్లో 53.1 శాతం మందికి ఈ సౌకర్యం అందుబాటులో లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఆరుబయట మలవిసర్జన చేసే వారిలో 60 శాతం మంది మన దేశానికి చెందినవారేనని లెక్కలు చెబుతున్నాయి. బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ టాయిలెట్‌ అంబాసిడర్‌గా చేసిన ఓ ప్రకటనలో ‘ఒక యువ వధువు ఆమె ముఖాన్ని కప్పిన ముసుగు పైకెత్తి గ్లాసుతో నీళ్లు తాగుతుంది. ముసుగు దించి తాగాలని, అది గౌరవమని అత్తగారు చెబుతుంది. విద్యాబాలన్‌ ఆ తర్వాత ఇంట్లో మరుగుదొడ్డి లేదని తెలుసుకుని గుక్కెడు నీటి కోసం తన ముసుగు ఎత్తడం సరైంది కానప్పుడు, బహిరంగ ప్రదేశంలో టాయిలెట్‌కు వెళ్లడం ఎలా గౌరవమో ఆలోచించమంటుంది. మీ ఇంట్లో మరుగుదొడ్డి ఉంటే మీరు, మీ కోడలు గౌరవాన్ని కాపాడుకోవచ్చు’ అని చెబుతుంది. ‘స్వచ్ఛ భారత్‌ అభియాన్‌’ పేరుతో కోట్లాది రూపాయలు ప్రకటనలకే ఖర్చు చేస్తోంది. 2014లో గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్లు నిర్మిస్తామని ప్రధాని మోడీ చేసిన వాగ్దానం అమలు ఇప్పటికీ లక్ష్యానికి ఆమడ దూరంలో వుంది. ప్రచారానికి చేసే ఖర్చు… మరుగుదొడ్ల నిర్మాణానికి చేస్తే ఎంతో ప్రయోజనం చేకూరేదని జనం చెబుతున్న మాట.
మరుగుదొడ్లు అనేది మనుషుల గౌరవానికి సంబంధించిన ముఖ్యమైన అంశం. మరుగుదొడ్ల సమస్య కారణంగా మహిళలు, బాలికలు లైంగిక దాడులకు, హత్యలకు గురైన సంఘటనలు అనేకం. అంతేకాదు, గత ఐదేళ్ల కాలంలో సెప్టిక్‌ ట్యాంక్‌, మురుగు కాల్వల్లో పడి 399 మంది మాన్యువల్‌ స్కావెంజర్లు చనిపోయారని ప్రభుత్వ అధికారిక సమాచారం. వాస్తవానికి ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే వుంటుందని, మృతుల కుటుంబాలను సైతం ప్రభుత్వాలు ఆదుకోవడం లేదని స్కావెంజర్లు చెబుతున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు కావస్తున్నా పరిశుభ్రమైన మరుగుదొడ్ల కోసం కూడా అంగలార్చాల్సి రావడం అత్యంత శోచనీయం. ముఖ్యంగా ప్రభుత్వ స్కూళ్లు, హాస్టళ్లలోను, పేదలు, దిగువ మధ్యతరగతికి చెందినవారు ఈ సమస్యను తీవ్రంగా ఎదుర్కొంటున్నారు. భారతదేశం బహిరంగ మలవిసర్జన రహిత దేశంగా మారాలంటే ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి వుంది. మరుగుదొడ్లపై అవగాహన కల్పించేందుకు ‘ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం’ ప్రతియేటా నవంబర్‌ 19న జరుపుతున్నారు. ‘మార్పును వేగవంతం చేయడం’ ఈ ఏడాది థీమ్‌. ఇప్పటికైనా ప్రభుత్వాలు ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి వుండేలా చర్యలు తీసుకోవాలి. ఆ దిశగా ప్రజలను చైతన్యవంతం చేయాలి. ఈ మార్పు వేగవంతం కావాలి.

➡️