ఇస్లామాబాద్‌ యునైటెడ్‌కు టైటిల్‌

  • ఫైనల్లో ముల్తాన్‌ సుల్తాన్స్‌పై ఉత్కంఠ విజయం
  • పాకిస్తాన్‌ సూపర్‌లీగ్‌

కరాచీ: పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌) 2024 సీజన్‌ టైటిల్‌ను ఇస్లామాబాద్‌ యునైటెడ్‌ జట్టు మరో దఫా చేజిక్కించుకుంది. ముల్తాన్‌ సుల్తాన్స్‌తో సోమవారం జరిగిన ఫైనల్లో ఇస్లామాబాద్‌ జట్టు 2 వికెట్ల తేడాతో ముల్తాన్‌ సుల్తాన్‌పై విజయం సాధించింది. ఆఖరి బంతి దాకా విజయం కోసం ఇరు జట్లూ పోరాడగా.. చివరి బంతికి సింగిల్‌ తీసిన ఇస్లామాబాద్‌ ఈ లీగ్‌లో మూడో ట్రోఫీ కొట్టింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ముల్తాన్‌ సుల్తాన్స్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేయగా.. ఇస్లామాబాద్‌ 20వ చివరి బంతికి ఫోర్‌ కొట్టి ఘనవిజయాన్ని అందుకుంది. కరాచీ వేదికగా జరిగిన ఫైనల్లో ముల్తాన్స్‌ జట్టు కెప్టెన్‌ మహ్మద్‌ రిజ్వాన్‌(26) బ్యాటింగ్‌లో నిరాశపరచగా.. ఉస్మాన్‌ ఖాన్‌(57) అర్థ సెంచరీతో రాణించాడు. ఆఖర్లో ఇఫ్తికార్‌ అహ్మద్‌ (20 బంతుల్లో 32, 3 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా ఆడటంతో ముల్తాన్‌ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఇస్లామాబాద్‌ బౌలర్లలో ఇమాద్‌ వసీం ఐదు వికెట్లతో రాణించగా.. సారథి షాదాబ్‌ ఖాన్‌ మూడు వికెట్లు తీశాడు. ఛేదనలో ఇస్లామాబాద్‌ కూడా తడబడింది. కొలిన్‌ మున్రో(17), అఘా సల్మాన్‌(10), షాదాబ్‌ ఖాన్‌(4)లు విఫలమయ్యారు. కానీ ఓపెనర్‌ మార్టిన్‌ గుప్తిల్‌ (32 బంతుల్లో 50, 4 ఫోర్లు), అజామ్‌ ఖాన్‌ (30)లు రాణించడంతో ఇస్లామాబాద్‌ విజయం దిశగా పయనించింది. కానీ కీలక సమయంలో వికెట్లు కోల్పోవడంతో ఆ జట్టుకు చివరి ఓవర్లో 8 పరుగులు అవసరమయ్యాయి. తొలి బంతికి ఇమాద్‌ వసీం (19 నాటౌట్‌) సింగిల్‌ తీయగా రెండో బాల్‌కు నసీమ్‌ షా ఫోర్‌ కొట్టాడు. ఆ తర్వాత రెండు బంతులకు రెండు పరుగులొచ్చాయి. కానీ ఐదో బాల్‌కు నసీమ్‌ ఔట్‌ కాగా.. ఆరో బంతికి నసీమ్‌ షా తమ్ముడు హునైన్‌ షా ఫోర్‌ కొట్టి మ్యాచ్‌ను ముగించాడు. ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇమాద్‌ వాసీంకు, సిరీస్‌ షాదాబ్‌ ఖాన్‌కు లభించాయి.

➡️