వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మహిళా కార్మికులు మృతి

Apr 1,2024 23:35 #3 death, #road acident
  • పది మందికి తీవ్రగాయాలు

ప్రజాశక్తి-వేటపాలెం (ప్రకాశం జిల్లా), మాచర్ల, చిలకలూరిపేట (పల్నాడు జిల్లా) : మూడు వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మహిళా కార్మికులు దుర్మరణం చెందారు. ఈ ఘటనలు ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో సోమవారం చోటు చేసుకున్నాయి. ప్రకాశం జిల్లాలో వేటపాలం లక్ష్మీపురం అక్కయ్యపాలెం గ్రామానికి చెందిన కార్మికులు వేరుశనగ కోత మిషన్‌ అమర్చి ఉన్న ట్రాక్టర్‌ జల్లెడపై కూర్చుని.. కూలి పనులకు వెళుతుండగా జల్లెడ ఒక్కసారిగా విరిగిపడిపోయింది. దీంతో జల్లెడపై కూర్చుని ప్రయాణిస్తున్న కార్మికులు తలో దిక్కుకు పడిపోయారు. తీవ్ర గాయాలవడంతో నక్కల బుచ్చమ్మ (50) అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు చీరాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
పల్నాడు జిలాల్లో మాచర్ల పట్టణంలోని సెరీన్‌ కాలనీకి చెందిన 15 మంది మహిళా కార్మికులు వెల్దుర్తి మండలం కళ్లకుంట గ్రామానికి మిర్చి కోతలకు ఆటోలో వెళుతుండగా అడవి పంది అడ్డు రావడంతో దాన్ని తప్పించే క్రమంలో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఆటోలోని నారోజు నారాయణమ్మ (50) అక్కడికక్కడే మృతి చెందారు. మహంకాళి నాగేంద్రమ్మ, చల్ల విజయ, బుజ్జి, మున్ని, డ్రైవర్‌ దాసుకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను మాచర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
చిలకలూరిపేట పట్టణంలోని సంజీవ నగర్‌కు చెందిన మిర్చి కోతల కోసం కట్టుబడివారిపాలేనికి ట్రాక్టర్‌పై ఏడుగురు కార్మికులు బయలుదేరారు. రహదారిపై ఉన్న గుంతలోకి ట్రాక్టర్‌ పడడంతో ఒక్కసారిగా మూకిరి కృపమ్మ (39) రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడ్డారు. ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే ఆమె మృతి చెందారు.

➡️