గాజాలో కాల్పుల విరమణ కోరుతూ బ్రసెల్స్‌లో వేలాదిమంది ప్రదర్శన

Jan 23,2024 11:35 #Brussels, #Gaza, #Protest

బ్రసెల్స్‌ :   గాజాలో కాల్పుల విరమణ అమలు చేయాలని కోరుతూ బ్రస్సెల్స్‌లో వేలాదిమంది ప్రదర్శన నిర్వహించారు. పాలస్తీనియన్లకు సత్వరమే న్యాయం అందేలా బెల్జియం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరారు. మధ్య ప్రాచ్యంలో నెలకొన్న పరిస్థితిపై చర్చించేందుకు సోమవారం ఇయు విదేశీ వ్యవహారాల మండలి సమావేశమవుతున్న నేపథ్యంలో ఆదివారం జరిగిన ఈ ప్రదర్శనలో దాదాపు 9వేల మంది పాల్గన్నారు. ఇజ్రాయిల్‌-పాలస్తీనా ఘర్షణలకు న్యాయమైన పరిష్కారం కనుగొనడంలో కీలక పాత్ర పోషించాలని యురోపియన్‌ కౌన్సిల్‌ ప్రస్తుత అధ్యక్షురాలైన బెల్జియంను ప్రదర్శకులు కోరారు. గాజాలో ఊచకోతను నిరసిస్తూ, ఇజ్రాయిల్‌పై అంతర్జాతీయ న్యాయ స్థానంలో కేసు వేసిన దక్షిణాఫ్రికాకు బెల్జియం అధికారికంగా మద్దతిచ్చింది. కాగా, బెల్జియం పౌర సంఘాల సంకీర్ణం ఆదివారం నాటి ఈ ప్రదర్శనకు పిలుపిచ్చింది. యుద్ధ నేరాలను పెంచి పోషించరాదని, పౌరులపై దాడులు ఆపాలని, యూదుల పట్ల వివక్ష కూడదని ప్రదర్శకులు నినదించారు. గత మూడు మాసాలుగా జరుగుతున్న గాజా యుద్ధంలో ఇజ్రాయిల్‌ బలగాలు 25వేల మందిని హతమార్చాయి. వీరిలో ఎక్కువమంది మహిళలు, చిన్నారులు, వృద్ధులే వున్నారు.

➡️