ముగిసిన మూడో రోజు ఆట.. ఇంగ్లండ్‌ 67/1

Feb 5,2024 07:49 #Cricket, #Sports
  • 332 పరుగులు ఆధిక్యంలో భారత్‌

విశాఖ : విశాఖపట్నం వేదికగా భారత్‌, ఇంగ్లండ్‌ మధ్య జరుగుతున్న రెండవ టెస్ట్‌ మ్యాచ్‌లో మూడవ రోజు ఆట ముగిసింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ వికెట్‌ నష్టానికి 67 పరుగులు చేసింది. ఆట ముగిసే సమయానికి క్రాలే (29), రెహాన్‌ అహ్మద్‌(9) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఓపెనర్‌ బెన్‌ డకెట్‌ (28) వికెట్‌ను స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ తీశాడు. వ్యక్తిగత స్కోరు 28 పరుగుల వద్ద కీపర్‌ శ్రీకర్‌ భరత్‌కు క్యాచ్‌ ఇచ్చి డకెట్‌ వెనుదిరిగాడు. ఇంకో 2 రోజులు మిగిలివుండగా ఇంగ్లండ్‌ గెలవాలంటే ఇంకా 332 పరుగులు చేయాల్సి ఉంది. భారత్‌ గెలవాలంటే 9 వికెట్లు పడగొట్టాల్సి ఉంది. కాగా ఈ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 255 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఫలితంగా భారత్‌కు 398 పరుగుల ఆధిక్యం లభించింది. 399 పరుగుల విజయలక్ష్యంతో పర్యాటక జట్టు రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ ఆరంభించింది. మూడవ రోజు ఆటలో శుభ్‌మాన్‌ గిల్‌ (104) సెంచరీ నమోదు చేశాడు. శ్రేయాస్‌ అయ్యర్‌ 29, అక్షర్‌ పటేల్‌ 45, రవిచంద్రన్‌ అశ్విన్‌ 29 , యశస్వి జైస్వాల్‌ 17, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 13 స్వల్ప పరుగులకే రెండో ఇన్నింగ్స్‌లో ఔటయ్యారు. రజత్‌ పాటిదార్‌ (9), కేఎస్‌ భరత్‌ (6) విఫలమయ్యారు. ఇక ఇంగ్లండ్‌ బౌలర్లలో స్పిన్నర్లు టామ్‌ హార్ట్‌ లే 4, రెహాన్‌ అహ్మద్‌ 3 వికెట్లు, ఆండర్సన్‌ 2, షోయబ్‌ బషీర్‌ 1 వికెట్‌ చొప్పున తీశారు. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 396 పరుగులు, ఇంగ్లండ్‌ 253 పరుగులకు ఆలౌట్‌ అయిన విషయం తెలిసిందే.

➡️