ఈ ఏడు అలవాట్లు.. క్యాన్సర్‌ ప్రమాదాన్ని తగ్గిస్తాయ్.. అవేంటంటే..?

Dec 22,2023 17:10 #health, #Lifestyle

ఇంటర్నెట్‌డెస్క్‌ : మీకు ఈ ఏడు అలవాట్లు గనుక ఉంటే.. క్యాన్సర్‌ ప్రమాద శాతం చాలా తక్కువగా ఉంటుందని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. మన జీవన శైలిలో ఈ ఏడు అలవాట్ల వల్ల క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుందని బిఎంసి మెడిసన్‌ జర్నల్‌లో ప్రచురించబడిన తాజా అధ్యయనం పేర్కొంది. లండన్‌లోని ఐదు లక్షల మంది అలవాట్లను పరిశోధకులు పరిశీలించారు. వారి ఆరోగ్య అలవాట్లు క్యాన్సర్‌ వ్యాధిని పెంచేలా ఉన్నాయా? తగ్గించేలా ఉన్నాయా? అనే వాటిపై పరిశోధన జరిగింది. మరి ఆ ఏడు అలవాట్లు ఏంటంటే..!

1. ఆరోగ్యకరమైన బరువు : వయసుకు తగ్గట్టుగా.. ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండాలి.

2. వ్యాయామం : ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. శారీరక శ్రమ తప్పనిసరి. వారంలో కనీసం 5 నుండి 10 గంటలైనా వ్యాయామం చేయాలి.

3. తృణధాన్యాలు : రోజువారీ తీసుకునే ఆహారంలో తృణధాన్యాలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. పండ్లు, కూరగాయలు, బీన్స్‌ వంటివి అధికంగా తీసుకోవాలి. రోజుకి కనీసం 30 గ్రాముల ఫైబర్‌ తీసుకోవాలి.

4. ఫాస్ట్‌ ఫుడ్స్‌ : రోజులో ఫాస్ట్‌ ఫుడ్స్‌, పిజ్జాలు, బర్గర్లు వంటివి పరిమితంగా తీసుకోవాలి.

5. మాంసం : వారానికి అరకేజి కంటే తక్కువగానే మాంసాన్ని తినాలి.

6. కూల్‌డ్రింక్స్‌ : కూల్‌డ్రింక్స్‌కి దూరంగా ఉంటే ఆరోగ్యానికి మంచిది.

7. మద్యం సేవించకూడదు : మద్యం సేవించకూడదు. ఒకవేళ డ్రింక్‌ చేసినా.. వారానికి 14 గ్లాసుల కంటే తక్కువగా డ్రింక్‌ చేయాలి.

ప్రొస్టేట్‌, రొమ్ము, కొలొరెక్టల్‌, ఊపిరితిత్తులు, గర్భాశయం, కాలేయం, ప్యాంక్రియాటిక్‌, కడుపు, అన్నవాహిక, తల, మెడ, అండాశయం, మూత్రాశయం, పిత్తాశయం వంటి క్యాన్సర్లలో ఈ ఏడు అలవాట్ల వల్ల 7 శాతం క్యాన్సర్‌ ప్రమాదాన్ని తగ్గించవచ్చు అని పరిశోధకులు కనుగొన్నారు. క్యాన్సర్‌ నివారణా సిఫారసులను వీలైనంత ఎక్కువమంది అనుసరించాలని, వాటిని లక్ష్యంగా పెట్టుకోవాలని న్యూకాజిల్‌ యూనివర్సిటీకి చెందిన హ్యూమన్‌ న్యూట్రిషన్‌ రీసెర్చ్‌ సెంటర్‌లోని రీసెర్చ్‌ అసోసియేట్‌ ఫియోనా మాల్కమ్‌సన్‌ తెలిపారు.

➡️