దేశమంతా నీటి కష్టాలు

Apr 6,2024 07:50 #all india, #water crisis
  • దక్షిణ భారతంలో 20 శాతం
  • కనీసం హెచ్చరించని కేంద్రం

ప్రజాశక్తి – న్యూఢిల్లీ : సాధారణ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ దేశమంతా నీటి కష్టాలు ముంచుకొచ్చాయి. దేశ వ్యాప్తంగా ప్రధాన జలాశయాలు, కీలక నదీ పరివాహక ప్రాంతాల్లో నీటి నిల్వలు అనూహ్యంగా క్షీణిస్తున్నాయి. సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. వేసవికాలం ఇంకా ప్రారంభంలో ఉండగానే పలు ప్రాంతాల్లో నీటి నిల్వలు ప్రమాదకరమైన కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. నిజానికి ఈ పరిస్థితికి సంబంధించిన సంకేతాలు రెండు, మూడు నెలల క్రితమే అందినట్లు సమాచారం. వాతావరణశాఖ చేసిన ముందస్తు హెచ్చరికలు, అప్పట్లోనే రిజర్వాయర్లలోని నీటి నిల్వలకు సంబంధించిన సమాచారాన్ని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమౌతుంది. అయినా, ఈ ముంచుకొస్తున్న ఈ అత్యవసర ముప్పు గురించి కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రాలకు నామమాత్రపు హెచ్చరికలు అందలేదు. దీంతో అనేక రాష్ట్రాలు డిసెంబరు, జనవరి నెలల్లో కూడా జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేశాయి. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే నేరుగా కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉన్న 150 ప్రధాన రిజర్వాయర్లలోనూ ఇదే స్థితి. ఈ నెల 4వ తేదీ (గురువారం) నాటికి ఈ ప్రాజెక్టుల్లో 61.801 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల (బిసిఎం) నీటి నిల్వ ఉంది. ఇది మొత్తం సామర్ధ్యంలో 35 శాతం మాత్రమే! గతేడాది ఇదే సమయానికున్న నీటి నిల్వతో పోలిస్తే ఇది చాలా తక్కువ. పదేళ్ల సగటు నిల్వతో పోల్చినా కూడా ప్రస్తుత నిల్వలు తక్కువగా ఉన్నాయి. రెండు వారాల క్రితం ఈ ప్రాజెక్టుల్లో 67.591 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల నీటి నిల్వ ఉండగా, గతవారం 64.606కు, ఈ వారం 61.801 బిసిఎంలకు నీటి నిల్వలు పడిపోయాయి. జూన్‌ నెల వరకు వర్షాలు కురిసే అవకాశం లేకపోవడంతో ఈ నిల్వలు మరింత పడిపోతాయని, మహా నగరాలతో పాటు అనేక పట్టణాల్లో తాగునీటికి సైతం కొరత ఏర్పడే పరిస్థితి ఉందని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే, ఎన్నికల వేళ అధికార పార్టీలు ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొనే అవకాశం ఉంది. పంజాబ్‌, రాజస్థాన్‌, ఒడిశా, పశ్చిమబెంగాల్‌, నాగాలాండ్‌, బీహార్‌, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడుల్లోని ప్రాజెక్టుల్లో పదేళ్ల సగటు నిల్వ (ఇదే సమయానికి) తక్కువకు చేరాయి.

దక్షిణ భారత దేశంలో..
కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కేరళలోని 42 రిజర్వాయర్లలో కేవలం 20 శాతం మాత్రమే నీటి నిల్వలు ఉన్నాయి. గతేడాది ఇదే కాలంలో ఈ ప్రాజెక్టుల్లో 34 శాతం నీటి నిల్వ ఉంది. గడిచిన పదేళ్ల కాలంలో ఈ ప్రాజెక్టుల్లో కనిష్ట నీటి నిల్వ 28 శాతం. ఈ ఏడాది అంతకన్నా తక్కువ స్థాయికి నీటి నిల్వలు చేరడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు అత్యంత కీలకమైన నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులో ఈ నెల 4వ తేదీ నాటికి డెడ్‌స్టోరేజీకి పైన 0.111 బిసిఎం మేర మాత్రమే నీటి నిల్వ (లైవ్‌ స్టోరేజి) ఉంది.

మహానది.. పెన్నార్‌ బేసిన్‌ల మధ్య..
మహానది, పెన్నార్‌ బేసిన్‌ల మధ్య ఉన్న 13 నదుల్లో నీటి నిల్వలు దాదాపు శూన్యంగా మారాయి. పెన్నార్‌ బేసిన్‌లో గత వారం 3.71 శాతంగా నీటిమట్టం ఉంటే ప్రస్తుత వారానికి 2.56 శాతానికి పడిపోయాయి. కావేరి బేసిన్‌లో ఇదే కాలానికి 23 నుండి 21 శాతానికి నీటి మట్టం పడిపోయింది. వీటితోపాటు రుషికల్య, బహుదా, వంశధార, నాగావళి, శారద, వరాహ, తాండవ, ఏలూరు, గుండ్లకమ్మ, తమ్మిలేరు, మూసి, పాలేరు, మున్నేరులలో మార్చి 21 నుంచి నీటి ప్రవాహ లేని పరిస్థితి నెలకొంది. దీంతో వీటి పరివాహక ప్రాంతంలో నీటి నిల్వలు కనిష్టానికి పడిపోయాయి. ఇవి దాదాపు 86,643 చదరపు కిలోమీటర్ల మేర ప్రవహిస్తుండటం గమనార్హం. సిడబ్ల్యుసి నివేదిక ప్రకారం ఒక్క సింధు మినహా మిగిలిన అన్ని ప్రధాన నదుల్లోనూ (గంగా, గోదావరి, మహానది, తాపీ, నర్మద, మహి, కృష్ణా, బ్రహ్మపుత్ర) నీటి ప్రవాహాలు గణనీయంగా తగ్గాయి. దీంతో పరివాహక ప్రాంతాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. బెంగళూరులో ఇప్పటికే తాగునీటికి సమస్య ఏర్పడింది. ఏప్రిల్‌ జూన్‌ మధ్య తీవ్ర ఎండలు, వడగాడ్పులు తప్పవని వాతావరణశాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వాలు ఇప్పటికైనా ముంచుకొస్తున్న ఈ సమస్యపై దృష్టి పెడతాయో లేదో చూడాలి.

➡️