ఆలయ ధ్వజం, రాజ్యాంగం ఒక్కటే కాదు!

Jan 25,2024 06:39 #edite page, #temple

నా రచనలు చదివే చాలామంది లాగే నేను కూడా ప్రతి ఉదయం పత్రికలు చూడడంతో మొదలెడతాను. మొదట ఆన్‌లైన్‌లోనూ తర్వాత అచ్చులోనూ చూస్తుంటాను. జనవరి ఏడున ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక ఆన్‌లైన్‌లో భారత ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్‌ గుజరాత్‌లో కొన్ని దేవాలయాలు సందర్శించడం గురించి ఇచ్చిన కథనంతో మొదలుపెట్టాను. ప్రసిద్ధమైన సోమనాథ్‌ దేవాలయం కూడా వెళ్లారు. నేను చదివిన కథనంతో పాటు ఇచ్చిన ఫోటోలో సిజెఐ దంపతులు హిందువులు చాలా పవిత్రంగా పరిగణించే ప్రఖ్యాతమైన ద్వారకాధీశ్‌ ఆలయాన్ని సభక్తికంగా సందర్శిస్తున్న దృశ్యం వుంది. తాను మహాత్మా గాంధీ జీవితాదర్శాలతో ప్రేరణతో వివిధ రాష్ట్రాల సందర్శన చేస్తున్నట్టు సిజెఐ చెప్పినట్టు ఆ కథనంలో వుంది. న్యాయ వ్యవస్థను ఎదుర్కొంటున్న సవాళ్లను అర్థం చేసుకోవడానికి పరిష్కారాలు కనుగొనడానికి చేస్తున్న ఈ పర్యటనలలో భాగంగానే గుజరాత్‌ వచ్చినట్టు ఆయన చెప్పారట. ఆయన గాంధీజీ గురించి చేసిన ఈ ప్రస్తావనే నన్ను ఆశ్చర్యపరచింది. ఎందుకంటే నేను లాయర్‌నో న్యాయమూర్తినో కాకపోయినా మహాత్మా గాంధీ జీవితం, వారసత్వం గురించి చాలా దశాబ్దాల పాటు అధ్యయనం చేస్తూ గడిపాను.

దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత గాంధీ ఒక ఏడాది పాటు దేశమంతటా రైళ్లలో తిరుగుతూ పర్యటించిన సంగతి బాగా తెలిసిన విషయమే. ప్రజా జీవితంలోకి ప్రవేశించే ముందు అన్ని అంశాలు ఆకళింపు చేసుకోవడానికే ఆయన పర్యటించారు. తర్వాత కాలంలో ఒక సంఘ సంస్కర్తగా, రాజకీయ నాయకుడుగా పని చేసే సమయంలోనూ గాంధీ దేశమంతా తిరుగుతూనే వున్నాడు. ఎక్కువగా రైలులోనూ ఎద్దుల బళ్లలోనూ చాలా సార్లు కాలి నడకతోనూ కూడా పర్యటించాడు. అయితే ధనికులు, పేదలు, ప్రసిద్ధులు, అనామకులు, స్త్రీలు, పురుషులు ఎవరైనా సరే దేశం గురించి ప్రజల గురించి బాగా లోతుగా అవగాహన పెంచుకోవడానికి పర్యటిస్తామంటే గాంధీ ఆమోదించేవాడు.

గాంధీ ఇలా చేసి వుండేవాడా?

అయితే ఒక ప్రధాన న్యాయమూర్తి దేవాలయాలు సందర్శిస్తూ అక్కడ ఫోటోలు తీయించుకుని ఆ క్రమంలో ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడాన్ని గాంధీ ఎలా చూసి వుండేవాడు? గాంధీ తనుగా ఎప్పుడూ ఒక హిందూ దేవాలయానికి వెళ్లలేదు. 1946లో మదుర మీనాక్షి ఆలయంలో చాలా కాలం నిషేధాల తర్వాత, దళితుల ప్రవేశాన్ని అనుమతించినపుడు మాత్రమే సందర్శించాడు. ఇలాంటి మినహాయింపులు చాలా తక్కువే వుంటాయి. తాను హిందువునని అభివర్ణించుకున్నాడు. కానీ ఆయన ఎంచుకున్న పూజా మార్గం మాత్రం సర్వ మత ప్రార్థనే. అది కూడా ఆరుబయిట హిందూ, ముస్లిం, పార్సీ, సిక్కు, జైన, క్రైస్తవ తదితర మతాల వారంతా కలిసి సామూహిక ప్రార్థన చేసే విధానంలోనే. వారందరూ వారి వారి మత గ్రంథాలను కలసి పఠించే పద్ధతినే పాటించేవారు. భారత దేశం సకల మతాల సమానతకు సంబంధించినదని చెప్పేందుకు ఆయన ఎంచుకున్న తనదైన ఎంతో లోతైన అర్థంతో మనసును కదిలించే విధానమది.

సుప్రీంకోర్టు ప్రాంగణంలో లేక మరెక్కడైనా భారత ప్రధాన న్యాయమూర్తి తనలా సర్వ మత ప్రార్థనలు చేయాలని గాంధీ కోరుకుని వుండడు. ఆశించి వుండడు కూడా. మనం కూడా అలా కోరుకోవద్దు. హిందూ మత విశ్వాసాలను ప్రగాఢంగా అనుసరించే ఒక మాజీ ప్రధాన న్యాయమూర్తి నాకు తెలుసు. ఆయన కూడా ప్రతిరోజూ ఉదయం ప్రార్థనతో మొదలుపెట్టి ప్రార్థనతో ముగిస్తారని నాకు తెలుసు. అయితే అది తన పూజగది లోనే చేస్తారు. ఆ సిజెఐ పదవీ కాలం గురించి ఇప్పటికీ ప్రశంసాపూర్వకంగా మాట్లాడుతుంటారు. ఆయన ఆలయాలు సందర్శించేవారు గానీ ప్రచార పూర్వకంగా వెళ్లి ఫొటోలు అనుమతించేవారు కాదు. అది కూడా ఈ సందర్భంలో. అయోధ్యలో నూతన ఆలయం ఘనంగా జరుగుతున్న ప్రారంభోత్సవానికి పది రోజుల ముందు, అది కూడా హిందూ భక్తి సమర్పణంగా గాక హిందూత్వ ఆధిక్యతా వాద ప్రదర్శనగా జరుగుతున్న సమయంలో అసలే ఇలా చేసేవారు కాదు.

ఆ ధ్వజం, రాజ్యాంగం ఒకటేనా?

ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ కథనంలో సిజెఐ చేసిన మరికొన్ని వ్యాఖ్యానాలు కూడా వున్నాయి. అవి ఆలోచించవలసినవే. సోమనాథ్‌, ద్వారాకాధీశ ఆలయాల సందర్శన సమయంలో తాను దర్శించిన ధ్వజాలను గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ”ద్వారాకాధీశ ఆలయ ధ్వజం చూసిన నేను చాలా ఉత్తేజపడ్డాను. అది పూరీ జగన్నాథ ఆలయంలో చూసిన దానిలాగే వుంది. మన దేశంలో ప్రతి చోటా వున్న ఈ సంప్రదాయం మనను కలిపివుంచుతుంది. ఆ ధ్వజంపైన శక్తి ఏదో వుంది. అది మనలను, లాయర్లను, జడ్జిలను, పౌరులను, అందరినీ కలిపి వుంచుతుంది. అదే మానవత్వం. చట్టబద్ద పాలన రాజ్యాంగం అనే వాటితో పాలించబడే మానవత అని ఆయన అన్నారు. ఈ మాటలు సిజెఐ అన్నవి అన్నట్టే పొందుపరిచారని అనుకుంటున్నా. అదే నిజమైతే ఆయన మన ప్రాచీన ఆధునిక చరిత్రల గురించి చేసిన వ్యాఖ్యానాలు విమర్శనాత్మక పరీక్షకు నైతిక ప్రమాణాలకు కూడా నిలబడవని గౌరవంగానే చెప్పవలసి వుంటుంది.

ఆలయాల ధ్వజాలు అందరినీ ఒకే మానవులుగా కలిపి వుంచలేదు. నిజానికి ఆ ధ్వజాలు కూడా అన్నిటికీ ఒకటిగా వుండవు. సిజెఐకి బాగా తెలిసిన విషయమే. మన హిందూ ఆలయాలు చరిత్రలో చాలా కాలం పాటు దళితులను అనుమతించలేదు. ఆలయాల పూజారులు వారిని లోపలికి వచ్చి పూజలు చేసుకోనివ్వలేదు. మహిళలను కూడా రుతు సమయంలో అనుమతించేవారు కాదు. ఇదేగాక ఆర్థిక, రాజకీయ, అధికార పరంగానూ సామాజికంగానూ దళితులను మహిళలను అనేక విధాల వివక్షకు గురి చేశారు. మహాత్మా గాంధీ వల్ల పూరీ శంకరాచార్య ధ్వజం వల్ల ఉత్తేజం పొందానంటున్న ఆయనకు మరో విషయం చెప్పాలి. గాంధీ దళితులను ఆలయాలలోకి అనుమతించాలని ఉద్యమించిన తర్వాత కొంతమంది జాతీయ నాయకులు వలసవాద జాతీయ శాసనసభలో ఆలయ ప్రవేశ బిల్లు ప్రతిపాదించారు. అప్పుడు ఈ పూరీ శంకరాచార్యుడే దాన్ని వ్యతిరేకిస్తూ వైస్రాయ్ కి లేఖ రాశారు.

సవర్ణులను, దళితులను ఒకేసారి కలసి ప్రార్థించేలా అనుమతించడం సనాతన ధర్మాన్ని సమూలంగా నాశనం చేస్తుందని ఫిర్యాదు చేశారు. వారి ధార్మిక ఆధ్యాత్మిక జీవిత ప్రశాంతతను భగం చేస్తుందని వాపోయారు. అసలు గాంధీని హిందూ బాహ్యుడుగా ప్రకటించాలని ఇంకొందరు ఆచార్యులు, పూజారులు సంతకాల సేకరణ జరిపారు. సిజెఐ చెబుతున్నట్టు కాకుండా సనాతన హిందూ సంప్రదాయానికి రాజ్యాంగ ఆదర్శాలకు మధ్య చాలా అంతరం వుంది. గాంధీ, అంబేద్కర్‌, జ్యోతీరావ్‌ ఫూలే, సావిత్రీబాయి ఫూలే, గోఖలే, రనడే వంటి అనేకమంది సంస్కర్తల నిర్విరామ కృషి ఫలితమే రాజ్యాంగం. హిందూ శాస్త్రాలలో లిఖితమై ఆచరించ బడుతున్న అనేక వివక్షలను వారు సవాలు చేసిన ఫలితమే అది. గమనించాల్సిందేమంటే రాజ్యాంగం అస్పృశ్యతను నిషేధించిన తర్వాత కూడా హిందూ సంప్రదాయంలో ప్రసిద్ధమైన పూరీ బద్రీనాథ్‌ వంటి చోట్ల ఆ దురాచారం దశాబ్దాల పాటు కొనసాగుతూనే వచ్చింది. ఇటీవలనే 2023 జులైలో కూడా ఉత్తరాఖండ్‌, దేవభూమి వంటి చోట్ల దళితులకు ప్రవేశం లేదని వార్తలు వచ్చాయి.

ఇప్పటికీ వివక్షలు, అసమానతలు

పురుషులకన్నా మహిళలను తక్కువగా చూడటం కూడా 1950వ దశకం వరకూ హిందూ చాందసులు కొనసాగిస్తూనే వచ్చారు. పూరీ శంకరాచార్యులే సతీసహగమనాన్ని 1988లో కూడా సమర్థించినట్టు వార్తా కథనాలు చూశాం. వేదాలను పఠించడానికి వాటిపై వ్యాఖ్యానం చేయడానికి స్త్రీలు దళితులు అనర్హులని ఆయన సెలవిచ్చారు కూడా. ఏ సంప్రదాయం కూడా స్థిరోభవా అంటూ వుండదనేది నిజమే, అయితే గాంధీ పూలే అంబేద్కర్‌ వంటి వారు సవాలు చేసి వుండకపోతే పూరీ ద్వారక వంటి చోట్ల వాటి వాటి అప్రజాస్వామిక సమానతా వ్యతిరేక ఆచారాలు యథాతథంగా కొనసాగుతూ వుండేవి. వారు క్షేత్ర స్థాయిలో కుల వివక్షలపై పోరాడారు. అలాగే అంబేద్కర్‌ నాయకత్వంలో భారత రాజ్యాంగ సభ మనుధర్మ శాస్త్రాన్ని తోసిపుచ్చి ప్రజాస్వామ్య సమానతా సూత్రంతో కూడిన రాజ్యాంగాన్ని ఆమోదించి వుండకపోతే అది మరోలా వుండేది. అందువల్ల ప్రధాన న్యాయమూర్తి గారు సంప్రదాయంగా హిందూ దేవాలయా లపై ఎగిరే ధ్వజ పతాకాలనూ భారత రాజ్యాంగం ఆధునిక సూత్రాలకూ మధ్య ఒకే విధమైన సారూప్యత చూడటం ఉద్దేశపూర్వకంగా దారితప్పించడం అవుతుంది (ఇది కూడా చాలా సుతిమెత్తగా చెబుతున్న విమర్శ). భారత రాజ్యాంగం గురించి మహా చరిత్రకారుడు గ్రాన్‌వెల్లి ఆస్టిన్‌ చెప్పిందేమిటో ఆయనకూ మనకూ కూడా గుర్తుండడం అవసరం. ”పారమార్థ లక్ష్యాల సాధన కోసం అహేతుక పద్ధతులను విస్తారంగా పాటించే ఒక దేశ ప్రజానీకానికి సంబంధించి నంత వరకూ అదో మహత్తరమైన ముందంజే”.

తలెత్తే ప్రశ్నలివే!

సిజెఐ ఆలయ దర్శనానికి సంబంధించి ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రచురించిన ఫోటోను కూడా నేను ప్రస్తావించాను. గుజరాత్‌లో ఆలయాలకు ఆయన కాషాయ కుర్తా ధరించి వెళ్లారు. ఒకవేళ ఆయన తెల్లటి దుస్తులు లేదా ఆకుపచ్చ రంగువి వేసుకుని వెళ్లినా సరే, మన దేశ చరిత్రలోని ఈ సమయంలో ఒక పదవిలోని ఒక ప్రధాన న్యాయమూర్తి ఆలయాలకు ఇంత అధికారికంగా వెళ్లడం-ఆయన వ్యక్తిగత విషయాలలో ఆయన తీర్పును గురించి ఇబ్బందికరమైన ప్రశ్నలను లేవనెత్తుతుంది. అంతేగాక దాన్ని సమర్థించుకో వడం కోసం ఆయన కొన్ని వ్యాఖ్యానాలు చేశారు. భారత రాజ్యాంగానికి హిందూ సంప్రదాయానికి మధ్యన ఒక నిరంతరాయత, సమాన లక్షణాలు వున్నాయని చెప్పడం చూస్తే ఆయన ఆలోచనా శక్తి గురించిన సందేహం కలుగుతుంది.

-వ్యాసకర్త ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ

➡️