‘ఉక్కు’ పోరాటం ఆగదు

Jan 1,2024 21:34 #Dharna, #Steel plant workers
  • అఖిలపక్ష కార్మిక, ప్రజాసంఘాల ప్రతిజ్ఞ

ప్రజాశక్తి – కలెక్టరేట్‌ (విశాఖపట్నం) :వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకం ఆపుతూ కేంద్ర కేబినెట్‌ తన నిర్ణయం ప్రకటించే వరకు పోరాటం ఆగదని విశాఖ అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాలు ప్రతిజ్ఞ చేశాయి. స్టీల్‌ప్లాంట్‌, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను ఆపాలంటూ విశాఖ జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల జెఎసి ఆధ్వర్యంలో 1005 రోజులుగా నిర్వహిస్తున్న దీక్షా శిబిరం వద్ద నూతన సంవత్సరం సందర్భంగా సోమవారం విశాఖ ప్రజలకు, కార్మిక వర్గానికి నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అక్కడ ఉక్కు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జెఎసి చైర్మన్‌ ఎం.జగ్గునాయుడు, వైస్‌ చైర్మన్‌ ఎం.మన్మధరావు మాట్లాడారు. విశాఖ ఉక్కు ప్రజల సంపద అని అన్నారు. ప్లాంట్‌ చారిత్రక నేపథ్యాన్ని, త్యాగాలను గుర్తుచేశారు. నాడు ప్లాంట్‌ కోసం 67 మంది కమ్యూనిస్టు ఎమ్మెల్యేలు, స్వతంత్రులు, పార్లమెంటు సభ్యులు తమ పదవులకు రాజీనామాలు చేశారని తెలిపారు. అటువంటి త్యాగాల ప్లాంట్‌ను అమ్మే హక్కు మోడీ ప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుకు నాటి ప్రభుత్వం కేవలం రూ.4,890 కోట్లు కేటాయిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.50 వేల కోట్లు డివిడెంట్లు, పన్నులు రూపంలో స్టీల్‌ప్లాంట్‌ చెల్లించిందని తెలిపారు. లక్ష మందికి ఉపాధి కల్పించిందని, రూ. మూడు లక్షల కోట్లు ఆస్తి కలిగి ఉందని అన్నారు. బ్లాస్ట్‌ ఫర్నేస్‌ 3ని జిందాల్‌కు కట్టబెడుతూ కేంద్రం చీకటి ఒప్పందం చేసిందని, క్రమేపీ మిగతా ఫర్నేస్‌లను, ప్లాంటును కట్టబెట్టాలని కుట్ర చేస్తోందని విమర్శించారు. జిందాల్‌తో జరిగిన ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్లాంటును పూర్తిస్థాయి ఉత్పత్తి సామర్థ్యంతో నడిపించాలన్నారు. తమ రాజకీయ ప్రయోజనాలను ప్రస్తుతం పక్కన పెట్టి కేంద్రంతో పోరాడి స్టీల్‌ప్లాంట్‌ రక్షణకు వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు చిత్తశుద్ధితో పూనుకోవాలని, అందుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి చొరవ తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో బిజెపి ద్రోహంలో వీరి పాత్ర ఉందని ప్రజలు భావించాల్సి వస్తుందన్నారు. దీక్షల్లో హెచ్‌పిసిల్‌ కాంట్రాక్టు కార్మికులు, మున్సిపల్‌, ముఠా కార్మికులు, కార్మిక, ప్రజా సంఘాల నాయకులు కూర్చున్నారు.

➡️