అంగన్‌వాడీలను నిరాశపరిచిన ప్రభుత్వం : సిపిఎం రాష్ట్రకార్యదర్శి వి.శ్రీనివాసరావు

  • ఎస్మా ప్రతుల దగ్ధం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సంక్రాంతికి సంబరాలు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పిస్తుందని ఆశించిన అంగన్‌వాడీలను రాష్ట్రప్రభుత్వం నిరాశపరిచిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. లక్షలమందికిపైగా ఉన్న అంగన్‌వాడీ మహిళలను రోడ్డుపైనే పండుగను జరుపుకునే దుస్థితిని కల్పించిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. విజయవాడలోని ధర్నా చౌక్‌లో నిర్వహిస్తున్న అంగన్‌వాడీల దీక్ష శిబిరాన్ని ఆదివారం ఉదయం సందర్శించారు. ఆదివారంతో అంగన్‌వాడీల సమ్మె 34వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం వారిపై ఉపయోగించిన ఎస్మా ప్రతులను భోగి మంటల్లో వేసి దగ్ధం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ పండుగ రోజు కూడా పట్టుదలగా ఆందోళన నిర్వహించిన అంగన్‌వాడీలకు సిపిఎం తరపున అభినందనలు తెలిపారు. సంక్రాంతి వారి పాలిట దీక్షగా మారి పోరాటం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం ఇప్పటికైనా చర్చలు జరిపి సమస్యను సంపూర్ణంగా పరిష్కరించి పండుగను ఇళ్లల్లో నిర్వహించుకునేలా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ హెల్పర్స్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి కె సుబ్బరావమ్మ, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు అజరుకుమార్‌, కెవిపిఎస్‌ ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. సమ్మె శిబిరాన్ని ఆలిండియా లాయర్స్‌ యూనియన్‌ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సుంకర రాజేంద్రప్రసాద్‌ సందర్శించారు. సమస్యలు పరిష్కరించకుండా రాష్ట్రప్రభుత్వం బెదిరింపులు చేయడం తగదన్నారు. న్యాయపరంగా అంగన్‌వాడీల పోరాటానికి తమ మద్దతు ఉంటుందని చెప్పారు. జగనన్నకు చెబుదాం కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విస్తృతంగా జరుగుతుందని సుబ్బరావమ్మతో పాటు అంగన్‌వాడీ యూనియన్‌ నాయకురాలు ఎన్‌సిహెచ్‌ సుప్రజ, జైనీరత్నకుమారి, ఉమాదేవి, రాణి చెప్పారు. నిరవధిక నిరాహార దీక్షలకు సిద్ధమవుతున్నామని తెలిపారు. దీక్షా శిబిరంలో నాయకులు అంగన్‌వాడీ కేంద్రాల పిల్లలకు భోగిపళ్లు పోశారు. వేతనాలపై స్పష్టత వచ్చే వరకు సమ్మె విరమణ చేయబోమని స్పష్టం చేశారు.

➡️