ఐక్యరాజ్య సమితిలో సంస్కరణలు తేవాలి

Feb 23,2024 11:05 #UNO

జి-20 సమావేశంలో బ్రెజిల్‌ పిలుపు

రియో డీ జెనీరో : ఐక్యరాజ్య సమితిలో, ఇతర బహుళ జాతుల సంస్థల్లో సంస్కరణలు తీసుకురావాలని బ్రెజిల్‌ పిలుపునిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా తలెత్తుతున్న ఘర్షణలను నివారించడంలో ఈ సంస్థల అశక్తతను విమర్శించింది. రియో డీ జెనీరోలో జరిగిన జి-20 సమావేశంలో ప్రారంభోపన్యాసం చేస్తూ బ్రెజిల్‌ విదేశాంగ మంత్రి మారో వియరా, ఉక్రెయిన్‌, గాజా వంటి చోట్ల తలెత్తిన ఘర్షణలను ఐక్య రాజ్య సమితి నివారించలేకపోయిందని అన్నారు. ప్రస్తుత సవాళ్ళను సమర్ధవంతంగా ఎదుర్కోడానికి తగిన రీతిలో బహుళ జాతుల సంస్థలు సన్నద్ధం కావడం లేదన్నారు. దారిద్య్రం, వాతావరణ మార్పులు, పెరుగుతున్న అంతర్జాతీయ ఉద్రిక్తతలపై చర్చించేందుకు, నవంబరు 18, 19 తేదీల్లో రియోలో జరగనున్న సదస్సుకు ముందుగానే ప్రణాళికను రూపొందించడానికి 20దేశాల విదేశాంగ మంత్రులు ఈ వారంలో ఇక్కడ సమావేశమయ్యారు. ఐక్యరాజ్య సమితి, ప్రపంచ వాణిజ్య సంస్థ, బహుళ జాతుల బ్యాంకులు వంటి ప్రపంచ పాలనా సంస్థలను సంస్కరించాలని బ్రెజిల్‌ అధ్యక్షుడు లూలా డసిల్వా కోరారు. ఈ లక్ష్య సాధనలో వర్ధమాన దేశాలకు బలమైన ప్రాతినిధ్యం వుండాలని ఆయన కోరుతున్నారు. భద్రతా మండలిని విస్తరించాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా నుండి మరిన్ని దేశాలకు అవకాశం కల్పించాలని, అలాగే భారత్‌, జర్మనీ లేదా జపాన్‌లను కూడా సభ్యులుగా తీసుకోవాలని కోరుతున్నారు.

➡️