ప్రజాస్వామ్య పరిరక్షణలో మీడియా పాత్ర కీలకం

Apr 20,2024 00:36

ప్రజాశక్తి – మంగళగిరి రూరల్‌ : ప్రజా స్వామ్య పరిరక్షణలో మీడియా పాత్ర ఎంతో కీలకమైనదనీ, ప్రజల హక్కులను, బాధ్యతలను మీడియా గుర్తు చేస్తుందని ఏపీ ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ మనోజ్‌ కుమార్‌ అరోరా అన్నారు. యూనివర్సిటీ ఆడిటోరియంలో గురు, శుక్రవారాల్లో ‘భారత్లో ఆధునిక మీడియా- ప్రజా సంబంధాలు అంశంపై ఏర్పాటు చేసిన రెండు రోజుల చర్చా గోష్టిని వైసఛాన్సలర్‌ ప్రారంభించి ప్రసంగించారు. ఈ సదస్సుకు పలు యూనివర్సిటీల సీనియర్‌ ప్రొఫెసర్లు, ప్రసార మాధ్యమ నిపుణులు, పాత్రికేయులు హాజరయ్యారు. ప్రధానంగా మీడియా వ్యవహారాలు, ప్రజలతో మీడియాకున్న సంబంధాలు, ఆధునిక మీడియా పాత్ర, మీడియాలో ఉపయోగిస్తున్న భాష వంటి అంశాలపై వక్తలు చర్చించి తమ అభిప్రాయాలను వెల్లడించారు. హాజరైన విద్యార్థులు, ప్రొఫెసర్లు లేవనెత్తిన పలు సందేహాలను నివృత్తి చేశారు. ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌, బిగ్‌ డేటాల సాయంతో మీడియా రంగం వినూత్నంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఈశ్వరీ స్కూల్‌ ఆఫ్‌ లిబిరల్‌ ఆర్ట్స్‌ డీన్‌ డాక్టర్‌ విష్ణుపథ్‌, కార్యక్రమ కన్వీనర్‌ ఆసిజిత్‌ దత్తా వక్తలను పరిచయం చేయగా కార్యక్రమానికి ప్రధాన వక్తలుగా రూజెర్స్‌ యూనివర్సిటీ (యూఎస్‌ఏ) అసోసియేట్‌ ప్రొఫెసర్‌ మెహెలీ సేన్‌, న్యూస్‌ లాండ్రి సంస్థ సహ వ్యవస్థాపకులు అభినందన్‌ సేక్రి, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ ప్రొఫెసర్‌ ప్రమోద్‌ నాయర్‌. క్రియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ గుండిమెడ సాంబయ్య, అజిరు ప్రేమ్‌ జీ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ మరియు జర్నలిస్టు అనూరాధ నాగరాజ్‌ పాల్గొన్నారు.

➡️