టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ.. రెండు మ్యాచ్‌లకు కోహ్లీ దూరం

Jan 22,2024 15:33 #Cricket, #Sports, #test match, #Virat Kohli

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందే టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్టుల నుంచి తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాలతో అతడు హైదరాబాద్‌, విశాఖపట్నం వేదికగా జరగాల్సిన టెస్టులకు దూరంగా ఉండనున్నాడు. ఈ మేరకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బిసిసిఐ) ఎక్స్‌ (ట్విటర్‌) ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. ఇదే విషయమై బిసిసిఐ ‘భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య జరుగబోయే తొలి రెండు టెస్టులకు విరాట్‌ కోహ్లీ దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాలతో అతడు ఈ సిరీస్‌ నుంచి తప్పుకుంటున్నాడు. ఈ విషయాన్ని అతడు కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు టీమ్‌ మేనేజ్‌మెంట్‌, సెలక్టర్లకూ తెలియజేశాడు. దేశానికి ఆడటం కోహ్లీకి ప్రథమ ప్రాధాన్యమైనా కొన్ని వ్యక్తిగత కారణాలతో అతడు రెండు టెస్టులకు దూరమవుతున్నాడు. బిసిసిఐ అతడి నిర్ణయాన్ని గౌరవిస్తుంది. కోహ్లీ రిప్లేస్‌మెంట్‌ను త్వరలోనే ప్రకటిస్తాం’ అని బిసిసిఐ ఆ ప్రకటనలో పేర్కొంది. జనవరి 25 నుంచి 29వరకు హైదరాబాద్‌ (ఉప్పల్‌) వేదికగా తొలి టెస్టు, ఫిబ్రవరి 02 నుంచి 06 దాకా విశాఖపట్నం వేదికగా రెండో టెస్టు జరగనుంది.

భారత జట్టు: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌,  శ్రేయస్‌ అయ్యర్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, కేఎల్‌ రాహుల్‌, కేఎస్‌ భరత్‌, దృవ్‌ జురెల్‌, కుల్దీప్‌ యాదవ్‌, ముకేశ్‌ కుమార్‌, మొహమ్మద్‌ సిరాజ్‌, జస్ప్రీత్‌ బుమ్రా, ఆవేశ్‌ ఖాన్‌

➡️