నేటి నుంచి టెన్త్‌ పరీక్షలు

Mar 18,2024 07:57 #10th class public exams

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పదో తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 6,23,092 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఈ నెల 30 వరకు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్ష ఏర్పాట్లపై పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌ సురేష్‌కుమార్‌ ఆదివారం సమీక్ష నిర్వహించారు. 3,437 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులను ఉదయం 8:45 గంటల నుంచి 9:30లోపు మాత్రమే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి ఉంటుందని చెప్పారు. పరీక్ష కేంద్రాల్లో 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని చెప్పారు. విద్యార్థులు హాల్‌ టికెట్లు చూపించి ఆర్‌టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణం పొందవచ్చునని తెలిపారు. ఫిర్యాదుల కోసం కంట్రోల్‌ రూమ్‌ 0866-2974540 నెంబర్లలో సంప్రదించవచ్చునని పేర్కొన్నారు. విద్యార్థులు హాల్‌ టికెట్లపై ప్రధానోపాధ్యాయుల సంతకం లేకపోయినా పరీక్షకు హాజరు కావొచ్చునని వెల్లడించారు.

➡️