పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఉధృతం

Apr 20,2024 05:15 #edite page

20డమాస్కస్‌లో తమ రాయబార కార్యాలయంపై జరిగిన దాడికి ప్రతీకారంగా ఇరాన్‌ ఇజ్రాయిల్‌పై డజన్ల కొద్ది క్షిపణులు, ద్రోన్లు కురిపించింది. ఇక ఇజ్రాయిల్‌ ఏప్రిల్‌ మొదటి తేదీన ఇరాన్‌ రాయబార కార్యాలయంపై దాడి చేసి పదమూడు మంది ప్రాణాలు తీసింది. అతున్నత హోదాగల ఇద్దరు ఇరాన్‌ విప్లవ సైనిక గార్డులు కూడా మరణించిన వారిలో వున్నారు. ఈ దాడి 1961 నాటి వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించడమే. దేశాల దౌత్య సంబంధాలను నిర్దేశించే ఈ ఒప్పందంతో పాటు రాయబార కార్యాలయాల సంబంధాలపై 1963 వియన్నా ఒప్పందాన్ని కూడా ఈ చర్య అతిక్రమించింది. దౌత్యకార్యాలయాల ప్రాంగణాలపై ఎలాంటి దాడి జరపరాదని ఈ నిబంధనలు స్పష్టంగా నిషేధిస్తున్నాయి. కనుక ఇజ్రాయిల్‌ చర్యతో పశ్చిమాసియాలోని అత్యంత ఉద్రిక్త పరిస్థితికి అగ్గి ముట్టించినట్టయింది. అక్కడ సంఘర్షణలకు ఆజ్యం పోసింది.
పశ్చిమాసియాలో దుండగీడు రాజ్యంగా వ్యవహరిస్తోంది ఇజ్రాయిల్‌. పాలస్తీనాపై దాని జాతి హత్యాకాండ మొదలై ఇప్పటికి ఆరు మాసాలు దాటుతోంది. 34,000 మందికి పైగా పాలస్తీనియన్లు హతులైనారు. వారిలో అత్యధికులు స్త్రీలూ, పిల్లలే, ఇజ్రాయిల్‌ దాడులు కేవలం గాజా ప్రాంతానికే పరిమితమై లేవు. పశ్చిమ తీరంలోనూ వందలమంది పాలస్తీనియన్లకు గురిపెట్టి మరీ ప్రాణాలుబలిగొన్నది. సిరియా లెబనాన్‌ ఇరాక్‌లకూ ఈ దాడిని విస్తరించింది.ఇజ్రాయిల్‌ ఇంత విచ్చలవిడిగా నిస్సంకోచంగా వ్యవహరిస్తున్నదంటే అమెరికా, నాటో కూటమి సర్వవిధాల బీరుపోకుండా వత్తాసునివ్వడమే కారణం. స్టాకహేోంలోని శాంతి పరిశోధనా సంస్థ (ఎస్‌ఐపిఆర్‌ఐ) అంచనాల ప్రకారం 2019-2023 మధ్య ఇజ్రాయిల్‌ ఆయుధాలలో 69 శాతం అమెరికా నుంచే దిగుమతి చేసుకుంది. నిజానికి డమాస్కస్‌లో ఇరాన్‌ దౌత్య కార్యాలయంపై దాడి చేసేందుకు అమెరికా ఆయుధాలనే ఇజ్రాయిల్‌ ఉపయోగించుకుంది. నిజానికిది అమెరికా ఆయుధ ఎగుమతి నియంత్రణ చట్టం నిబంధనలకు వ్యతిరేకం. ఈ ఆయుధాలను కేవలం న్యాయమైన ఆత్మరక్షణకే ఉపయోగించాలని ఆ నిబంధనలు చెబుతున్నా అమెరికా పట్టించుకోలేదు.
ఆపైన ఇజ్రాయిల్‌ దాడిని ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో రష్యా ప్రతిపాదించిన ప్రకటనను బలపర్చేందుకు కూడా అమెరికా బ్రిటన్‌ ఫ్రాన్స్‌ నిరాకరించాయి. ఆఖరుకు భారత ప్రభుత్వం కూడా ఈ దాడిపై కేవలం ఆందోళన వ్యక్తం చేసిందే తప్ప ఖండించేందుకు సిద్ధం కాలేకపోయింది. ఈ విధమైన నిష్క్రియా ప్రియత్వమే ఇజ్రాయిల్‌కు కొమ్ములు తెచ్చింది. అది ఇరాన్‌ను దాడికి లక్ష్యంగా చేసుకోవడం ఇదేమీ మొదటిసారి కాదు. ఇరాన్‌పై అనేకసార్లు ద్రోన్లతో దాడికి దిగింది. ఆ దేశ భూభగంలో హత్యలకూ సైబర్‌ దాడులకూ పాల్పడింది. 2024 జనవరిలో ఇరాన్‌ లోని ఒక నగరంలో లోతుగా బాంబులు పాతి వంద మందికి పైగా ప్రజలు మరణించడానికి కారణమైంది. అగ్రశ్రేణి శాస్త్రజులు, ఇంజనీర్లు హత్యగావించబడ్డారు. ఇరాన్‌ అణుబాంబు తయారు చేయకుండా అడ్డుకోవాలనే సాకుతో సాగిన ఈ కవ్వింపు చర్యలన్నిటికీ అమెరికా ఆశీస్సులతో జరిగినవే.
తమ సంస్థకు సంబంధించినంత వరకూ ఇరాన్‌ అణుబాంబు కలిగి వున్నట్టు చెప్పే సమాచారం గానీ, సంకేతాలు గానీ ఏవీ లేవని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఎఇఎ) డైరెక్టర్‌ జనరల్‌ రాఫెల్‌ గ్రాసీ చాలా తాజాగా ఏప్రిల్‌ 14నే ప్రకటించారు. అయితే ఈ అంచనా అమెరికాకు గానీ, ఇరాన్‌కు గానీ పట్టదు. ఏదో విధంగా ఇరాన్‌ను కల్లోల పర్చవడమే వాటి లక్ష్యం. ఎందుకంటే పశ్చిమాసియాలో వాటి ఆధిపత్యానికి ప్రధాన సవాలుదారుగా వున్న దేశం అదే.
బెంజిమన్‌ నెతన్యాహూ ఉద్దేశపూర్వకంగానే యుద్ధాన్ని ఎగదోస్తున్నాడు. హమాస్‌ను అణచివేయడంలో ఆయన విఫలం కావడం తప్ప ఇందుకు వేరే కారణం లేదు. దాన్ని నిర్మూలించడమే లక్ష్యమంటూ ఆయన పాలస్తీనియన్లపై మారణకాండ ప్రారంభించాడు. కానీ ఇప్పటి వరకూ బందీలను విడిపించడంలోనూ ఆయన కృతకృత్యం కాలేకపోయారు. అవినీతికీ, అసమర్థతకూ మారుపేరుగా తయారైన నెతన్యాహూ పాలనపై విసుగెత్తివున్న ఇజ్రాయిలీల ఆగ్రహం మరింత పెరగడానికి ఇవన్నీ దారితీశాయి. ఆయన రాజీనామా చేయాలంటూ వేలు లక్షల మంది ఇజ్రాయలీలు నిరంతరాయంగా నిరసనలు తెల్పుతూనే వున్నారు. ఒకసారి ఈ యుద్ధం ముగిస్తే ఇక తాను అధికారంలో కొనసాగడం తథ్యమని నెతన్యాహూకు బాగా తెలుసు.
అమెరికా పశ్చిమాసియాలో మోసపూరిత పాత్ర పోషిస్తున్నది, మంటలు చల్లార్చడానికి వచ్చినట్టు నటిస్తూ వాస్తవంలో అగ్నికి ఆజ్యం పోసే పాత్ర నిర్వహిస్తున్నది. అమెరికా మిత్రదేశాలైన బ్రిటన్‌, వంటివి యుద్ధ విరమణకోసం జోక్యం చేసుకోవాలంటే ఆయా తమ దేశస్తుల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. అవి ఇజ్రాయిల్‌కు ఆర్థిక మద్దతు, ఆయుధ సరఫరాలు నిలిపివేయడం ద్వారా ఈ పనిచేయొచ్చు.కానీ ఇజ్రాయిల్‌ వాటికి నమ్మకమైన మిత్ర దేశం. పశ్చిమాసియాలో వాటి పట్టు నిలబెట్టుకోవడానికి అదే సాధనంగా వుంది. మరో వైపునుంచి చూస్తే అతి త్వరలోనే ఎన్నికలు ఎదుర్కోవాల్సిన ఈ దేశాలలో ప్రజల నుంచి వచ్చే నిరసనలను విస్మరించలేవు కూడా. అందుకే ఇజ్రాయిల్‌ అదుపు అంటూ ఏదో అభినయిస్తున్నాయి.
ఇరాన్‌ క్షిపణి దాడులపై అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌ నాటో వంటి వాటి ప్రతిస్పందన మరోసారి వాటి కపటత్వాన్ని బహిర్గతం చేసింది. ఇరాన్‌ క్షిపణులు లక్ష్యాలను ఛేదించకుండా విఫలం చేయడంలో అమెరికా బ్రిటన్‌ జోర్డాన్‌ ప్రధాన పాత్ర వహించాయి. తమ చెక్కుచెదరని నేస్తమైన ఇజ్రాయిల్‌కు మద్దతు నిస్తున్నట్టు అమెరికా అద్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు. పైకి మాత్రం ఆ ప్రాంతాన్ని మరింత విస్త్రుతమైన యుద్ధంలోకి దించే మరే విధమైన తదుపరి చర్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశాడు. అయితే ఇజ్రాయిల్‌ను కేవలం ప్రకటనలతో బెదిరింపులతో లంగదీయడం కుదిరేపని కాదు. దాని దురాక్రమణ చర్యలు, వలసవాద విస్తరణ చర్యల నుంచి ఇజ్రాయిల్‌ వత్తాసుదారులందరూ విడగొట్టుకోవడం విస్తారమైన ప్రజా ఒత్తిడితోనే సాధ్యం. అన్ని దేశాలు కూడా దానికి సైనిక రక్షణభద్రతా పరమైన లావా దేవీ లు నిలిపి వేయాలి. ఇజ్రాయిల్‌ జాతి హత్యాకాండ యుద్ధాన్ని కొనసాగిస్తున్న వారందరిని అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారించి శిక్షించాలి. అన్నిటికన్నా ముఖ్యంగా పాలస్తీనా రాజ్యాన్ని, 1967కు పూర్వమున్న దాని తూర్పు జెరూసలేము రాజధానిని గుర్తించాలి. తక్షణ కాల్పుల విరమణ, ఆక్రమిత ప్రాంతాలన్నిటినుంచి ఇజ్రాయిల్‌ ఉపసంహరణతో ఈ ప్రక్రియ ప్రారంభం కావాలి.
పశ్చిమాసియాలో లక్షల మంది భారతీయులు జీవిస్తున్నారు. యుద్ధం ప్రజ్వరిల్లితే వారి జీవితాలే ప్రమాదంలో పడతాయి. భారత ప్రభుత్వం చురుగ్గా జోక్యం చేసుకోవాలి. వారి క్షేమంగా బయిటపడేలా చూడాలి. ఇవేవి జరగాలన్నా-పాలస్తీనియన్లకు మన మద్దతు ఫణం పెట్టి ఇజ్రాయిల్‌ స్నేహం కోసం పాకులాడే విధానం తలకిందులుగా మారాలి. ఈ పూర్వ రంగంలో మన దేశ నిర్మాణ కార్మికులను ఇజ్రాయిల్‌కు పంపడం అత్యంత ప్రమాదభరతమైన పని. దాన్ని తక్షణం ఆపేయాలి. ఇజ్రాయిల్‌ కజ్జాకోరు పోకడలను నిర్ద్వంద్వంగా ఖందించి దాంతో రక్షణ భద్రతా ఒప్పందాలను రద్దు చేసుకుని వాటినుంచి వైదొలగాలి. పాలస్తీనాకు సంఘీభావంగా దృఢ వైఖరి తీసుకోవాలి.
ఇది రాస్తున్న సమయంలో ఇరాన్‌ క్షిపణి దాడులకు ప్రతిస్పందన తెల్పుతానని ఇజ్రాయిల్‌ ప్రతిజ్ఞ వెలువడింది. అయితే అది ఏ రూపంలో వుండేది ఇంకా తెలియలేదు. తమ రాయబార కార్యాలయంపై ఇజ్రాయిల్‌ దాడికి సమాధానంగానే క్షిపణి దాడులు జరిపామని ఇక ఆది ముగిసి పోయినట్టే భావిస్తున్నానని ఇరాన్‌ ప్రకటించింది. ఇజ్రాయిల్‌ మరిన్ని దాడులకు పాల్పడితే ఊరుకోబోనని హెచ్చరించింది. సంయమనం పాటించవలసిందని, మరింత పెరగకుండా చూడాలనీ యావత్‌ అంతర్జాతీయ సమాజం ఇరు దేశాలకు విజ్ఞప్తి చేసింది. అయితే ఇదంతా ఇజ్రాయిల్‌ పైన దాని ప్రధాన వత్తాసుదారుడైన అమెరికా మీద ఆధారపడి వుంటుంది.
(ఏప్రిల్‌17 ‘పీపుల్స్‌ డెమోక్రసీ’ సంపాదకీయం)

➡️