దోసపాడులో మళ్లీ ఉద్రిక్తత

Jan 26,2024 11:09 #again, #Dospadu, #tension
  • పట్టించుకోని రెవెన్యూ అధికారులు
  • ప్రభుత్వ చట్టాలు పేదలకేనా.. భూస్వాములకు వర్తించవా..?
  • వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ.రవి

ప్రజాశక్తి – దెందులూరు (ఏలూరు జిల్లా) : పేదలకు జాయింట్‌ కలెక్టర్‌ కోర్టులో ఉన్న భూములను విడగొట్టి, సర్వే చేసి మిగిలిన భూములు అసలైన అసైన్‌దారులకు అప్పగించాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎ.రవి డిమాండ్‌ చేశారు. ఏలూరు జిల్లా దెందులూరు మండలం దోసపాడు గ్రామంలో చేపల చెరువు వద్ద వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో చెరువులో నీటిని వెళ్లగొట్టి వరినాట్లు వేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రవి మాట్లాడుతూ జిల్లా, మండల రెవెన్యూ అధికారులు పేదలు, దళితుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 144, 145 సెక్షన్లు పేదలకే వర్తిస్తాయా, భూస్వాములకు వర్తించవా అని ప్రశ్నించారు. పేదలు చెరువుల దగ్గరికి వెళ్లిన ప్రతిసారీ రెవెన్యూ అధికారులు రాకుండా పోలీసులను పంపించి భయభ్రాంతులకు గురిచేయడం దుర్మార్గమన్నారు. పేదల పట్ల ప్రభుత్వం, రెవెన్యూ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్న రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. భూరికార్డులను తారుమారు చేస్తున్న వారిపై ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అసలైన అసైన్డ్‌దారులు దోసపాడు పేదలైతే ఈ భూములు దేవినేని భాజీ ప్రసాద్‌ బినామీలకు ఏవిధంగా చెందుతాయని ప్రశ్నించారు. 30 ఏళ్ల క్రితం పేదలను దేవినేని భాజీ ప్రసాదు, ఆయన బినామీలు బెదిరించి పేదల నుండి భూములను బలవంతంగా లాక్కున్నా ఇంతవరకూ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. భూస్వామి చేతుల్లో ఉన్న ఈ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అసలైన అసైన్డ్‌రులకు కట్టబెట్టాలని డిమాండ్‌ చేశారు. అసలైన అసైన్డ్‌దారులను భూముల్లోకి రాకుండా పోలీసులు అడ్డగించడం సిగ్గుచేటన్నారు. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కోర్టులో ఉన్న అసలు భూములు విడదీసి మిగిలిన అసైన్డ్‌, సీలింగ్‌ భూములను పేదలకు పంచాలని డిమాండ్‌ చేశారు. రెవెన్యూ శాఖ అధికారుల నిర్లక్ష్య వైఖరిని ఖండించారు. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని, పేదలు, దళితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో రెవెన్యూ అధికారులు అసైన్డ్‌, సీలింగ్‌ భూములు వివరాలు బయటపెట్టి జాయింట్‌ కలెక్టర్‌ కోర్టులో ఉన్న భూములు మినహా మిగిలిన అసైన్డ్‌, సీలింగు, గయ్యాల భూములను పేదలకు పంచాలని డిమాండ్‌ చేశారు. జాయింట్‌ కలెక్టర్‌ జోక్యం చేసుకుని సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో ఈ పోరాటం మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దెందులూరు ఎస్‌ఐ పేదలను అరెస్టు చేయాలని ప్రయత్నించడం సిగ్గు చేయటన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి ఎ.శ్యామలారాణి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు పి.ఆనంద్‌రావు, సిహెచ్‌.మణి, టి.నాగేంద్ర, భూపోరాట నాయకులు ఏసు మణి, మాణిక్యం, లక్ష్మి, మరియమ్మ, కుమారి, హేమలత పాల్గొన్నారు.

➡️