రికార్డు స్థాయికి చేరిన బంగారం ధర.. పది గ్రాములు రూ.65 వేలు

Mar 6,2024 10:18 #Gold, #record high, #Ten grams

న్యూఢిల్లీ : దేశంలో బంగారం ధరలు జిగేల్‌ మంటున్నాయి. దిగువ స్థాయి మధ్యతరగతి ప్రజలు కొనలేని స్థితికి చేరాయి. ఇది వరకు ఎప్పుడూ లేని విధంగా మంగళవారం పది గ్రాముల పసిడి ధర రూ.65వేలకు చేరడం విశేషం. ఈ ఏడాది జూన్‌లో అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను తగ్గింనుందన్న ఊహాగానాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర భారీగా పెరిగింది. దేశీయంగా పెళ్లిళ్లు, శుభ కార్యాలయాల సమయం కావడంతోనూ డిమాండ్‌ నెలకొంది. ఈ క్రమంలోనే దేశీయ మార్కెట్‌లోనూ బంగారం ధర పెరుగుతుందని బులియన్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. చెన్నరు మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారంపై రూ.800 పెరిగి 65,000 గరిష్ట స్థాయికి చేరింది. గత ట్రేడింగ్‌ సెషన్‌లో బంగారం రూ.64,200 వద్ద ముగిసింది. మరో వైపు కిలో వెండిపై సైతం రూ.900 పెరిగి రూ.74,900కు ఎగిసింది. గుడ్‌రిటర్న్‌ ప్రకారం.. హైదరాబాద్‌ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారంపై రూ.760 పెరిగి రూ.64,850 వద్ద ముగిసింది. 22 క్యారెట్ల పసిడిపై రూ.700 ఎగిసి రూ.59,450 వద్ద నమోదయ్యింది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారంపై రూ.800 పెరిగి రూ.65వేల వద్ద ఆల్‌టైమ్‌ గరిష్ఠానికి చేరుందని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీ సీనియర్‌ అనలిస్ట్‌ (కమోడిటీస్‌) సౌమిల్‌ గాంధీ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్‌లో కామెక్స్‌లో గోల్డ్‌ స్పాట్‌ ధర ఔన్స్‌కు 2110 డాలర్లకు చేరింది. గత మూడు రోజు ల్లోనే ఎంసిఎక్స్‌లో బంగారం ధర రూ.2400 వరకు పెరిగింది. యూఎస్‌లో పారి శ్రామిక, నిర్మాణ వ్యయం తగ్గడంతో పాటు ద్రవ్యోల్బణంపై ఒత్తిడి తగ్గించడంతో బంగారం ధరలు పెరిగాయని ఎల్‌కెపి సెక్యూరిటీస్‌కు చెందిన వీపీ రీసెర్చ్‌ అనలిస్ట్‌ జతిన్‌ త్రివేది పేర్కొన్నారు. అదే విధంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తలు సైతం బంగారం ధరల పెరుగుదలకు దారి తీస్తున్నాయన్నారు. మరో వైపు అమెరికా బులియన్‌ మార్కెట్‌లో వెండి ధర ఔన్స్‌కు 23.88 డాలర్లు పెరిగింది. కిత్రం సెషన్‌లో వెండి ఔన్స్‌కు 23.09 డాలర్ల వద్ద కొనసాగింది. యుఎస్‌ ఫెడరల్‌ వడ్డీ రేట్ల తగ్గింపు ఊహాగానాల మధ్య పెట్టుబడిదారులు బంగారంలో పెట్టుబడులను సరక్షితమైనవని భావిస్తున్నారని.. ఈ నేపథ్యంలోనే బంగారానికి డిమాండ్‌ పెరుగుతుందని జతిన్‌ త్రివేది తెలిపారు.

➡️