మున్సిపల్‌ కార్మికుల సమ్మె తాత్కాలిక వాయిదా

  • చాలా వరకూ పరిష్కరించామన్న మంత్రి బొత్స
  • అభ్యంతరం తెలిపిన సిఐటియు అనుబంధ సంఘం

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : మున్సిపల్‌ కార్మికుల సమ్మె తాత్కాలికంగా వాయిదా పడింది. బుధవారం మూడో దఫా చర్చలు జరిగాయి. ఈ చర్చల అనంతరం నాయకులు ఈ మేరకు ప్రకటన చేశారు. మూడో దఫా చర్చల్లో మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్‌, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌(సిఐటియు), మున్సిపల్‌ ఉద్యోగుల జెఎసి నాయకులు పాల్గొన్నారు. రెండున్నరగంటలపాటు జరిగిన చర్చల్లో పలు అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చిందని, అలాగే తీసుకున్న నిర్ణయాలపై వెంటనే జిఓను ఇచ్చేందుకు అంగీకరించిందని, దీంతో సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని నాయకులు ప్రకటించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఫిబ్రవరి నుండి సమ్మెలోకి వెళతామని హెచ్చరించారు. సిబ్బంది వేతనం రూ.21 వేలు చేయడంతోపాటు కనీసం రెండు లేదా మూడువేల రూపాయలు పెంచాలని తాము కోరామని, దీనికి ప్రభుత్వం అంగీకరించకపోవడంతో అభ్యంతరం(డీసెంట్‌) నోట్‌ ఇచ్చినట్లు ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌(సిఐటియు) ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు తెలిపారు. మున్సిపల్‌ కార్మికులు 16 రోజులుగా సమ్మె నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు సార్లు చర్చలు జరిపినా ఫలితం కనిపించకపోవడంతో బుధవారం మరో విడత చర్చలకు ప్రభుత్వం ఆహ్వానించింది. సాయంత్రం వెలగపూడి సచివాలయంలో మూడుగంటలపాటు జరిగిన చర్చల్లో అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమయంలో కొన్ని సంఘాల నాయకులు సమ్మెను విరమిస్తున్నట్లు చెప్పగా సిఐటియు అనుబంధ సంఘ నాయకులు అలా కుదరదని, తాత్కాలికంగా వాయిదా వేస్తామని, ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే మరలా సమ్మె చేపడతామని స్పష్టం చేశారు.

సానుకూల నిర్ణయం తీసుకున్నాం

మంత్రి బొత్స, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి మున్సిపల్‌ కార్మికుల సమ్మెకు సంబంధించి సానుకూల నిర్ణయం తీసుకున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి తెలిపారు. అనేక అంశాలపైపరిశీలనకు అధికారులతో వెంటనే కమిటీ వేస్తామని తెలిపారు. సమావేశ అంశాలకు సంబంధించిన మినిట్స్‌ను కూడా గురువారంనాడే సంఘాల నాయకులకు అందిస్తామని వివరించారు. పారిశుధ్య కార్మికులను పది కేటగిరీలుగా మార్చి ప్రస్తుతం ఇస్తున్న రూ.15 వేల గౌరవవేతనం, ఆరువేల హెల్త్‌ అలవెన్సును కలిపి రూ.21 వేల వేతనంగా మార్చామని పేర్కొన్నారు. డ్రైవర్లు, క్లీనర్లు, మలేరియా, యుజిడి వర్కర్లకు ప్రస్తుతం ఇస్తున్న రెమ్యునరేషన్‌కు అదనంగా ఆరువేల కలిపి ఇస్తామని చెప్పారు. పాఠశాలల్లో పనిచేస్తున్న కంటింజెన్సీ వర్కర్లకూ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ నుండి జీతాలు ఇస్తామని, పారిశుధ్యేతర కార్మికుల కేటగిరీల అంశాన్ని పరిష్కరిస్తామని చెప్పారు. పని సమయంలో చనిపోతే సుప్రీం కోర్టు నిబంధనల మేరకు రూ.30 లక్షలు, శాశ్వత అంగవైకల్యానికి రూ.20 లక్షలు, వైకల్యానికి రూ.10 లక్షలు చొప్పున ఇస్తామని పేర్కొన్నారు. సిబ్బందికి సరెండర్‌ లీవులు, ఇతర పరిహారాలు అందిస్తామని అన్నారు. కొంతమంది సిబ్బందికి పిఎఫ్‌ ఎకౌంట్లు లేవని, వారికి ఏర్పాటు చేస్తామని అన్నారు. 2019లో చనిపోయిన కొంతమంది కార్మికులు పరిహారానికి దరఖాస్తు చేసుకోలేదని, వీరికి పరిహారం అందించేందుకు జిఓ ఇచ్చి దరఖాస్తుకు రెండు నెలల సమయం ఇస్తామని పేర్కొన్నారు. ఈలోపు చేసుకున్న వారికి పరిహారం అందిస్తామని వివరించారు. ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది రిటైరైతే రూ.75 వేలు ఇస్తామని, కనీసం పది సంవత్సరాలు విధులు నిర్వహించిన వారికి ఇది వర్తిస్తుందని చెప్పారు. అదనంగా విధులు నిర్వహించిన వారికి ఏటా రూ.2 వేలు పెంచుతామని వివరించారు. ప్రమాదంలో చనిపోయిన ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి రూ.7 లక్షలు పరిహారం అందిస్తామన్నారు. ఇంజనీరింగ్‌ విభాగంలో సర్టిఫికెట్‌ లేకుండా చేస్తున్న వారికి సర్టిఫికెట్‌ తెచ్చుకుంటే ఖాళీలు వచ్చిన సమయంలో వారితోనే భర్తీ చేస్తామని పేర్కొన్నారు. మట్టి ఖర్చులు రూ.15 వేల నుండి రూ.20 వేలకు పెంచుతామని అన్నారు. కరోనా సమయంలో కొంతమంది పనిచేశారని, వారిని ఔట్‌సోర్సింగ్‌లో చేర్చుకోలేదని భవిష్యత్‌లో ఖాళీలు వస్తే అటువంటి వారికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. కొత్త మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వర్కర్లకు కూడా మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కింద వేతనాలు ఇస్తామని తెలిపారు. విలీన పంచాయతీల్లో, సిఆర్‌డిఏ పరిధిలో మంగళగిరిలో కలిసిన గ్రామాలకు మున్సిపల్‌ వేతనాలు ఇస్తామని, మిగిలిన గ్రామాల్లో మున్సిపాలిటీ లేనందున సిఆర్‌డిఏ పరిధిలో ఇచ్చే వేతనాలే ఇస్తామని పేర్కొన్నారు. పండుగ నేపథ్యంలో ప్రతి కార్మికుడికి వేయి రూపాయలు అదనంగా ఇస్తామని వివరించారు.

హామీలు సంతృప్తికరంగా లేవు : సిఐటియు కె.ఉమామహేశ్వరరావు 

‘చర్చలు సానుకూలంగా జరిగినప్పటికీ కార్మికులందరూ పూర్తి సంతృప్తి చెందేలా జరగలేదు. ఈ నేపథ్యంలో సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాము. చర్చల్లో అభ్యంతరాన్ని(డీసెంటు) ఇచ్చాము. మినిట్స్‌ కాపీ వచ్చిన తరువాత ఒప్పుకున్న జీత భత్యాలు, సమ్మెకాలం జీతం, కేసుల ఎత్తివేత, ఇంజనీరింగ్‌ కార్మికుల సమస్య పరిశీలనకు కమిటీ, క్లాప్‌ డ్రైవర్ల సమస్యల పరిష్కారంపై ఉత్తర్వులు రావాల్సి ఉంది.రూ.21 వేల వేతనానికి తోడు అదనంగా రెండువేలు లేదా మూడువేలు పెంచాలని, కనీసం ఒకనెల బోనస్‌ అన్నా ఇవ్వాలని కోరాము. ప్రభుత్వం అంగీకరించ లేదు. ఇంజ నీరింగ్‌ కార్మికులకు 11వ పిఆర్‌సి ప్రకారం వేతనాల ఇవ్వాలని, క్లాప్‌ డ్రైవర్లకు జీతాలు పెంచి, పిఎఫ్‌, ఇఎస్‌ఐ సమస్యలు పరిష్కరించాలని కోరాము. సిఆర్‌డిఎ పరిధిలో మున్సిపాలిటీలో కలిసిన గ్రామాల్లో వారికి మున్సిపల్‌ వేతనాలు ఇస్తామని మంత్రులు చెప్పారు. సిఆర్‌డిఏ అధికారులతో మాట్లాడి మిగిలిన గ్రామాల్లో వారికి కూడా న్యాయం చేయాలని కోరాము. వారినీ మున్సిపాలిటీ పరిధిలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశాము. ఇంజనీరింగ్‌ కార్మికులకు సర్టిఫికెట్‌ లేనివారికి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ద్వారా సర్టిఫికెట్లు ఇప్పిస్తామని మంత్రులు తెలిపారు. దీనిపైనా ఉత్తర్వులు ఇవ్వాలని కోరాము. ఔట్‌సోర్సింగ్‌ కార్మికులను కాంట్రాక్టులోకి మార్చే అంశంపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశాము. ప్రభుత్వాన్ని కోరాల్సివన్నీ కోరాము.

అనేక అంశాలు పెండింగ్‌లో ఉన్నాయి : పి.సుబ్బారాయుడు, మున్సిపల్‌ జెఎసి

‘చర్చల సందర్భంగా ప్రభుత్వం హామీలు ఇవ్వడంతో సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేశాం. 21 అంశాలపై ప్రతిపాదనలు ఇచ్చాము. వాటి పరిష్కారానికి సంబంధించి జిఓ ఇవ్వాల్సి ఉంది. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరాము, సరెండర్‌ లీవులు మూడున్నర సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే వేతనాల్లో వ్యత్యాసానికి సంబంధించిన అంశాలపైనా చర్చించాలని కోరాము. అధికారులతో వేసే కమిటీల్లో సంఘ నాయకులను కూడా చేరుస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాము.

 

➡️