చాగలమర్రిలో 44.1 డిగ్రీల ఉష్ణోగ్రత

  • నేడు 315 మండలాల్లో వడగాడ్పులు
  • రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో గురువారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నంద్యాల జిల్లా చాగలమర్రిలో 44.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కడప జిల్లా చిన్నచెప్పల్లిలో 43.9 డిగ్రీలు, కర్నూలు జిల్లా లద్దగిరిలో 43.8 డిగ్రీలు, ప్రకాశం జిల్లా దరిమడుగు 43.6, అనంతపురం జిల్లా తెరన్నపల్లి 43.5, నెల్లూరు జిల్లా మనుబోలు, తిరుపతి జిల్లా చియ్యవరంలో 43.2, శ్రీసత్యసాయి జిల్లా కుటగుల్లలో 43.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఈ మేరకు సంస్థ ఎమ్‌డి ఎమ్‌డి రోణంకి కూర్మనాథ్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 315 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం వుందన్నారు. శుక్రవారం 109 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 206 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని, అలాగే శనివారం 115 మండలాల్లో తీవ్ర, 245 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపారు. శ్రీకాకుళం 24 మండలాల్లో, విజయనగరం 25, పార్వతీపురం మన్యం 14, అల్లూరి సీతారామరాజు 6, విశాఖపట్నం మూడు, అనకాపల్లి 16, కాకినాడ 11, అంబేద్కర్‌ కోనసీమలో ఒక మండలం, తూర్పుగోదావరిలో తొమ్మిది మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం వుందని పేర్కొన్నారు. ప్రజలు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని, వృద్ధులు, గర్భిణులు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

➡️