చంద్రబాబును అడ్డుకున్న తెలుగు తమ్ముళ్లు

-ఉండి అభ్యర్ధి రామరాజును మార్చొద్దని డిమాండ్‌
ప్రజాశక్తి- పాలకొల్లు (పశ్చిమ గోదావరి జిల్లా) :పశ్చిమగోదావరి జిల్లా ఉండి టిడిపి అభ్యర్థి మంతెన రామరాజును మార్చరాదని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. రామరాజును మారుస్తారని ప్రచారం జరుగుతుండడంతో ఈ కార్యక్రమం చేపట్టారు. దీంతో, కొంతసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. పాలకొల్లులోని ఎస్‌ కన్వెన్షన్‌ సెంటర్లో నరసాపురం పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల టిడిపి, జనసేన, బిజెపి నేతలతో శనివారం చంద్రబాబు సమీక్షించారు. ఈ సమావేశం అనంతరం కారులో వెళ్తున్న ఆయనను టిడిపి శ్రేణులు అడ్డుకున్నాయి. చంద్రబాబు రక్షణ సిబ్బంది వారిని పక్కకు నెట్టేసి కాన్వారుకి దారి కల్పించారు. అనంతరం రామరాజు మాట్లాడుతూ చంద్రబాబు మాటను పాటిస్తానని, అదే సమయంలో కార్యకర్తల మనోభావాలకు విలువ ఇస్తానని చెప్పడం చర్చనీయాంశమైంది.
కూటమిలోని ఏ పార్టీ అభ్యర్థికి టికెట్‌ ఇచ్చినా కలిసికట్టుగా పనిచేయాలి : చంద్రబాబు
టిడిపి, జనసేన, బిజెపికి చెందిన ఏ అభ్యర్థి పోటీలో ఉన్నా కూటమిలోని మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభ్యర్థులు సమన్వయంతో పనిచేసి విజయం సాధించాలని టిడిపి అధినేత చంద్రబాబు మూడు పార్టీల నాయకులకు దిశానిర్దేశం చేశారు. పాలకొల్లులోని ఎస్‌ కన్వెన్షన్‌ సెంటర్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టిడిపి, జనసేన, బిజెపికి చెందిన పదిమంది నాయకులు చొప్పున 30 మంది నాయకులు ఈ సమావేశంలో పాల్గన్నారు. గత రాత్రి పాలకొల్లు జనసేన నేత, సినీ నిర్మాత బన్నీవాసును స్టేజ్‌పైకి ఎక్కించి లేదని అలిగిన ఆ పార్టీ నేతలు ఈ సమావేశానికి హాజరు కాలేదు. గుంటూరుకు వెళ్లేందుకు ప్రయాణం అవుతుండగా ఆఖరి నిమిషంలో చంద్రబాబును వారు కలిసి ఫొటోలు తీయించుకున్నారు. ఎంపి రఘురామకృష్ణంరాజు ఆఖరి నిమిషంలో చంద్రబాబును కలిసేందుకు వచ్చి కలవకుండానే వెళ్లిపోయారు. చివరిలో హెలికాప్టర్‌ వద్ద కలిసి చంద్రబాబుతో కరచాలనం చేశారు.

➡️