సంక్రాంతి ఊరెళుతున్న వారికి తెలంగాణ పోలీసుల సూచనలు

Jan 13,2024 15:00 #sankranthi holidays

హైదరాబాద్‌: సంక్రాంతి పండుగ నేపథ్యంలో చాలామంది సిటీ వాసులు సొంతూళ్లకు ప్రయాణం అవుతున్నారు. హైవేలు ఇప్పటికే రద్దీగా మారగా హైదరాబాద్‌ రోడ్లపై వాహనాల రద్దీ తగ్గిపోయింది. బంధువుల మధ్య పండుగను జరుపుకునేందుకు వెళుతున్నామనే సంతోషం వెంటే దొంగల భయం మనసులో ఓ మూల వేధిస్తూనే ఉంటుంది. అయితే, ఈ భయం అక్కర్లేదని తెలంగాణ పోలీసులు చెబుతున్నారు. ఇంటికి తాళం పెట్టి సొంతూళ్లకు వెళ్లే వారు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే పండుగను సంతోషంగా సెలబ్రేట్‌ చేసుకోవచ్చని అంటున్నారు.

పోలీసులు చెప్పిన జాగ్రత్తలు ఇవే..

– ఇరుగుపొరుగు వారిలో మీతో క్లోజ్‌ గా ఉండే వారికి మీ ప్రయాణం వివరాలు చెప్పండి. ఎప్పుడు వెళుతున్నది, ఎప్పుడు తిరిగొచ్చేది చెప్పి మీ ఇంటిపై ఓ కన్నేసి ఉంచాలని కోరండి. ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే మీకు ఫోన్‌ చేసి చెప్పాలని సూచించండి.

– ప్రయాణం నేపథ్యంలో ఇంట్లో వదిలివెళ్లే విలువైన ఆభరణాల వివరాలు కానీ వస్తువుల వివరాలపై కానీ బహిరంగంగా చర్చించుకోవడం చేయొద్దు. నగలు, ఇతర విలువైన వస్తువులను ఇంట్లో జాగ్రత్తగా దాచిపెట్టండి. బయటకు కనిపించకుండా జాగ్రత్త పడండి.

– వీలైతే ఇంట్లో సీసీటీవీ కెమెరాను అమర్చుకోవడం మంచిది. దీనివల్ల మీరు ఎక్కడున్నా మొబైల్‌ ఫోన్‌ తో ఇంటిపై ఓ కన్నేసి ఉంచవచ్చు. దొంగల భయం లేకుండా నిశ్చింతగా ఉండొచ్చు.

– ఇంట్లోని బీరువా తాళాలు మీతోనే తీసుకెళ్లండి. ఇంటికి తాళం వేశాం కదా అని నిర్లక్ష్యంతోనో ఎక్కడైనా పోతాయనే భయంతోనో ఇంట్లో వదిలి వెళ్లద్దు.

– ఇంటికి వేసేందుకు మంచి నాణ్యత కలిగిన తాళం ఉపయోగించండి. డోర్‌ కు వేసిన తాళం కనిపించకుండా పై నుంచి కర్టెన్‌ వేయడం శ్రేయస్కరం. ఇంట్లో ఎవరూ లేరనే విషయం చూసే వాళ్లకు ఇట్టే తెలిసిపోకుండా ఇది ఉపయోగపడుతుంది.

– మెయిన్‌ హాల్‌ లో ఓ లైట్‌ వేసి ఉంచడం ద్వారా ఇంట్లో ఎవరైనా ఉన్నారనే భ్రమ కలిగించవచ్చు. కొంతవరకు ఇది దొంగలను మీ ఇంటికి దూరం పెడుతుంది.

➡️