తేజస్వి యాదవ్‌ విచారణ-8 గంటలపాటు ప్రశ్నించిన ఇడి

పాట్నా : ఆర్‌జెడి నాయకులు, బీహార్‌ మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) అధికారులు మంగళవారం దాదాపు 8 గంటల పాటు విచారించారు. పాట్నాలోని ఇడి కార్యాలయానికి మంగళవారం ఉదయం 11.30 గంటల సమయంలో తేజస్వి యాదవ్‌ చేరుకున్నారు. తేజస్వి యాదవ్‌కు మద్దతుగా ఆర్‌జెడికు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అక్కడకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. తేజస్వికి అనుకూలంగా నినాదాలు చేశారు. తేజస్విని రాత్రి 8:00 గంటల వరకూ అధికారులు విచారించారు. విచారణ సమయంలో అధికారులు 60కు పైగా ప్రశ్నలను సంధించినట్లు సమాచారం.ఈ నెల 28న మహా కూటమి ప్రభత్వుం నుంచి నితీష్‌ వైదొలిగి బిజెపి పంచన చేరారు. ఆ తరువాత రోజు నుంచి ఆర్‌జెడి నేతలపై ఇడి విచారణ ప్రారంభమైంది. ల్యాండ్‌ ఫర్‌ జాబ్స్‌ స్కామ్‌ కేసుకు సంబంధించి ఆర్‌జెడి అధినేత, తేజస్వి యాదవ్‌ తండ్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ను ఇడి సోమవారం సుమారు 10 గంటలపాటు విచారణ జరిగింది. ఈ నెల 19న తేజస్వి యాదవ్‌, లాలూ ప్రసాద్‌లకు కొత్తగా ఇడి సమన్లు జారీ చేసింది. సిబిఐ నమోదు చేసిన కేసు ఆధారంగా ఇడి విచారణ చేస్తోంది. లాలూ ప్రసాద్‌ రైల్వే శాఖ మంత్రిగా ఉన్న సమయంలో 2004 నుంచి 2009 మధ్య కాలంలో కొంత మంది అభ్యర్థుల నుంచి తన కుటుంబ సభ్యుల పేరు మీద భూమి తీసుకుని వారికి రైల్వేల్లో, వివిధ జోన్లలో ఉద్యోగాలు కల్పించారని సిబిఐ తన ఎఫ్‌ఐఆర్‌లో ఆరోపించింది. రాజ్యసభ సభ్యులు మనోజ్‌ ఝా యాదవ్‌ మాట్లాడుతూ ‘ఇది ఇడి కార్యాలయం కాదు. తేజస్వి యాదవ్‌ వచ్చిన బిజెపి కార్యాలయం. ఎన్నికలు వచ్చినప్పుడు ప్రతిపక్ష నాయకులను ఇక్కడికి పిలిపిస్తారు’ అని విమర్శించారు. ఆర్‌జెడి నాయకుల ఆందోళన నేపథ్యంలో ఇడి కార్యాలయం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు.

➡️