‘ ఢిల్లీ ఛలో’ రైతులపై టియర్‌గ్యాస్‌

Feb 13,2024 12:21 #Delhi Chalo, #Tear Gas

 న్యూఢిల్లీ :    శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై పోలీసులు టియర్‌గ్యాస్‌ ప్రయోగించారు. ఢిల్లీలోని పంజాబ్‌ -హర్యానా సరిహద్దుకు వేలాది మంది రైతులు చేరుకున్నారు.  అయితే   రైతులు ఢిల్లీలోకి రాకుండా  సరిహద్దుల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఆగ్రహించిన రైతులు అంబాలాలోని శంబు సరిహద్దు వద్ద అడ్డుగా  ఉంచిన     బారికేడ్లను విరగ్గొట్టేందుకు యత్నించారు.   వారిపై  హర్యానా పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.  కొందరు రైతులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.   పంజాబ్, హర్యానా సరిహద్దుల్లో భారీ భద్రతా దళాలతో పాటు వాటర్ కెనాన్‌లను మోహరించినట్లు తెలిపారు.

పంటలకు కనీస మద్దతు ధర సహా పలు డిమాండ్లు నెరవేర్చాలంటూ పార్లమెంటు వరకు ట్రాక్టర్‌ ర్యాలీ చేపట్టేందుకు రైతులు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. మంగళవారం ఉదయం 10 గంటలకు పంజాబ్‌లోని ఫతేగఢ్‌ సాహిబ్‌ నుంచి వేలాదిమంది రైతులు ట్రాక్టర్లతో ఢిల్లీ చేరుకున్నారు. అలాగే సంగ్రూర్‌ నుంచి మరో బృందం ఢిల్లీ చేరుకుంది.

ఢిల్లీ సరిహద్దుల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. భారీగా బలగాలను మోహరించారు. రహదారులపై బారికేడ్లతో పాటు కాంక్రీట్‌ బ్లాక్స్‌, ఇనుప కంచెలు, మేకులను అడ్డుగా పెట్టారు. ఢిల్లీ వ్యాప్తంగా నెల రోజుల పాటు 144 సెక్షన్‌ విధించారు. పార్లమెంట్‌ సమీపంలోని సెంట్రల్‌ సెక్రటేరియట్‌ మెట్రో స్టేషన్‌ను మూసివేశారు.

➡️