తహశీల్దార్‌ దారుణ హత్య – భూవివాదాలే కారణం!

Feb 4,2024 08:45 #brutally murder, #Tahsildar, #Visakha
  • భూవివాదాలే కారణం!
  • వైసిపి పై ఆరోపణలు

ప్రజాశక్తి- మధురవాడ, ఎంవిపి కాలనీ (విశాఖ) : విశాఖ నగరంలో తన ఇంటి వద్ద తహశీల్దార్‌ దారుణ హత్యకు గురయ్యారు. రియల్‌ ఎస్టేట్‌, భూ వివాదాలే ఈ ఘటనకు కారణం కావడంతో రెవెన్యూ ఉద్యోగులు ఉలిక్కిపడ్డారు. పిఎం.పాలెం పోలీసుల కథనం ప్రకారం… జివిఎంసి ఐదో వార్డు పరిధి కొమ్మాదిలోని ఎస్‌టిబిఎల్‌ థియేటర్‌ వెనుక చరణ్‌ క్యాస్టల్స్‌ అపార్టుమెంట్‌ ఐదో అంతస్తులో తహశీల్దార్‌ సనపల రమణయ్య నివాసం ఉంటున్నారు. శుక్రవారం రాత్రి 10.15 గంటల సమయంలో ఫోన్‌ రావడంతో ఫ్లాట్‌ నుంచి ఆయన కిందకు వచ్చారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తితో ఘర్షణ తలెత్తింది. సదరు వ్యక్తి తన వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్డుతో రమణయ్య తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. రక్తపు మడుగులో పడి ఉన్న రమణయ్యను స్థానికులు ఆరిలోవలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో శని వారం తెల్లవారు జామున మృతి చెందారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అపార్టుమెంట్‌ సెల్లార్‌లోని సిసి ఫుటేజీలను పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం విశాఖ కెజిహెచ్‌కు తరలించారు. ఈ సంఘటనలో వైసిపి ప్రమేయంపై ఆరోపణలు వస్తున్నాయి. టిడిపి పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ వైసిపికి చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నట్లు తెలిపారు. విశాఖలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఆయన అన్నారు. మాజీ ఎంఎల్‌ఏ గండి బాబ్జీ మాట్లాడుతూ విశాఖలో జరుగుతున్న భూ వివాదాలు, హత్యల వెనుక ప్రభుత్వ పెద్దలున్నారని ఆరోపించారు.

బదిలీ తరువాత తొలి రోజు విధులకు …

                     రమణయ్య సొంత ఊరు శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలం దిమ్మిలాడ గ్రామం. ఆయనకు భార్య, పాప, బాబు ఉన్నారు. పదేళ్ల క్రితం విధుల్లో చేరిన ఆయన ఉత్తరాంధ్రలోని వజ్రపుకొత్తూరు, పద్మనాభం, విశాఖ రూరల్‌ (చినగదిలి) మండలాల్లో తహశీల్దార్‌గా పనిచేశారు. రెండు రోజుల క్రితం విజయనగరం జిల్లా బొండపల్లికి బదిలీ అయ్యారు. తొలిరోజు విధులకు హాజరై రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఇంటికి చేరుకున్న ఆయనపై దాడి జరిగింది. త్వరలో అరెస్టు చేస్తాం : విశాఖ పోలీసు కమిషనర్‌ రవిశంకర్‌ రమణయ్యను హత్య చేసిన వ్యక్తిని గుర్తించామని విశాఖ సిటీ పోలీస్‌ కమిషనర్‌ ఎ.రవిశంకర్‌ తెలిపారు. హంతకుడిని త్వరలోనే అరెస్ట్‌ చేస్తామన్నారు. శనివారం మధ్యాహ్నం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రియల్‌ ఎస్టేట్‌, భూ వివాదాలే హత్యకు కారణం తెలిపారు. హత్య చేసిన వ్యక్తి విమానం ఎక్కి వెళ్లినట్టు గుర్తించామని చెప్పారు. ఆయన కోసం పది బృందాలతో గాలిస్తున్నామని తెలిపారు. ఆగంతకుడు గతంలో పలుమార్లు చినగదిలి తహశీల్దార్‌ కార్యాయాలానికి వచ్చి వెళ్లినట్లు గుర్తించామని చెప్పారు.

సమగ్ర విచారణ జరపాలి : సిపిఎం

               తహశీల్దార్‌ రమణయ్య దారుణ హత్యపై సమగ్ర విచారణ జరిపి, నిందితులను కఠినంగా శిక్షించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం, విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు వారు శనివారం వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశారు.

కలెక్టరేట్‌ వద్ద రెవెన్యూ ఉద్యోగుల నిరసన

                రమణయ్య కుటుంబీకులను ఎపి రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ నాయకులు సత్తి నాగేశ్వరరెడ్డి తదితరులు కెజిహెచ్‌ వద్ద పరామర్శించారు. ప్రభుత్వ భూములకు రక్షణగా ఉన్న ఉద్యోగులకు రక్షణ లేకుండా పోయిందని ఈ సందర్భంగా వారు మీడియాకు చెప్పారు. అనంతరం ఉద్యోగులంతా కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలిపారు. రమణయ్య కుటుంబీకులను టిడిపి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, జనసేన పార్టీ నాయకులు, ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్‌ పరామర్శించారు.

నిందితులను కఠినంగా శిక్షించాలి : రెవెన్యూ అసోసియేషన్ల డిమాండ్‌

                       రమణయ్యను హత్య చేసిన నిందితులను తక్షణమే అరెస్ట్‌ చేసి కఠినంగా శిక్షించాలని పలు రెవెన్యూ సంఘాలు డిమాండ్‌ చేశాయి. ఈ మేరకు రాష్ట్ర డిప్యూటీ కలెక్టర్ల సంఘం ప్రధాన కార్యదర్శి ఎం.విశ్వేశ్వరనాయుడు , ఎపి రెవిన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ ఛైర్మన్‌, ప్రధాన కార్యదర్శులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, చేబ్రోలు కృష్ణమూర్తి, ఎపి గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు భూపతిరాజు రవీంద్రరాజు, ఎం అప్పలనాయుడు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశారు. రమణయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, తహశీల్దార్లకు, విఆర్‌ఓలకు ప్రభుత్వం ప్రత్యేక రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇటీవల వైజాగ్‌లో భూ సంబందించిన విషయాలపై విఆర్‌ఓలపై క్రిమినల్‌ కేసులు పెట్టడాన్ని ఖండించారు. విధి నిర్వహణలో ప్రభుత్వ ఉద్యోగిపై ఎవరు దాడి చేసినా అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రెవిన్యూ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాయి. తహశీల్దార్‌ హత్యకు నిరసనగా శనివారం 26 జిల్లాల్లో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలిపినట్లు రెవిన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ తెలిపింది.

➡️