స్విచ్‌ ఆఫ్‌!!

Dec 17,2023 07:20 #Editorial

                ‘నా అనురాగాలకు చిరునామా/ నా అనుబంధాలకు నిలయం/ అమ్మనాన్నలు కొలువుండే దేవాలయం/ అన్న చెల్లి అక్కా తమ్ముళ్ల అల్లరి కేకల అలజడులను ఓపికతో సహించే ఆటస్థలం/ ఇంటి నుంచి మొదలైన అనుబంధాలు విశ్వజనీనమై వర్థిల్లజేసే శాశ్వత ఆనందానికి కేంద్రం నా కుటుంబం/ తరిగిపోని అనుబంధాలకు/ బలాన్నిచ్చేదే నా కుటుంబం’ అంటుంది చిన్నారి కవయిత్రి గౌతమి. సామాజిక జీవనంలో అత్యంత ప్రధానమైనది కుటుంబం. మనిషి జీవితంలోని బంధాలు మొత్తం కుటుంబంతో ముడిపడి వుంటాయి. ఆ అనుబంధాలకు ఎక్కడైనా చిన్న అవాంతరం ఏర్పడినా ఆ కుటుంబంలోని వ్యక్తులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సాంకేతికత మన దైనందిన జీవితాల్లో కాదనలేని ఒక భాగంగా మారింది. అది మన జీవితాల్లోకి చొచ్చుకొని వచ్చిన విధానం కుటుంబంలోని వ్యక్తుల భావోద్వేగాలను ప్రభావితం చేస్తున్నది. ప్రత్యేకించి తల్లిదండ్రులు తమ స్మార్ట్‌ఫోన్లతో మునిగిపోవడంతో…తల్లిదండ్రులు- పిల్లల మధ్య బంధం దెబ్బతింటున్నది. దీంతో పిల్లలు ఒంటరిగా ఫీలవుతున్నారు. న్యూనతాభావానికి గురవుతున్నారు. తమ ఇంట్లో, తమ కుటుంబ సభ్యుల మధ్యనే తాను ఒంటరిని అన్న భావనకు లోనవుతున్నారు. సాధారణంగా స్మార్ట్‌ఫోన్‌ ఎక్కువగా వాడకూడదని, స్క్రీన్‌ ఎక్కువ సేపు చూడడం కళ్లకు మంచిదికాదని చిన్నారులకు బుద్ధులు చెప్పే తల్లిదండ్రులే ఫోన్లకు అతుక్కుపోతుంటారు. పిల్లలైనా, పెద్దలైనా ఫోన్లకు బానిసలైతే ఇక అంతేసంగతులు అని ఇప్పటికే పలు అధ్యయనాలు హెచ్చరించాయి.

సెలవులు గడపడానికి ముగ్గురు సభ్యుల కుటుంబం ప్రయాణ ఏర్పాట్లు చేసుకుంటూ వుంటుంది. వారి చిన్న పాప ఉత్సాహంగా తన బట్టలు సర్దుకుంటూ…మనం వెళ్లేచోట నాకిష్టమైన స్విమ్మింగ్‌పూల్‌ వుంటుందా? అని అడుగుతుంది. తండ్రి ఫోన్‌ చూసుకుంటూ పాప మాటలను పట్టించుకోడు. నీకు ఇష్టమైనవన్నీ వుంటాయి అంటూ…అప్పుడే వచ్చిన ఫోన్‌ కాల్‌ మాట్లాడుతూ బయటకు వెళతాడు. అయితే, నాకు బీచ్‌ ఇష్టం అంటుంది తల్లి. పాప బాగా నిరుత్సాహపడుతుంది. నాకు నిజానికి స్విమ్మింగ్‌పూల్‌ కంటే విమానం ఇష్టం. అక్కడ నాన్న ఫోన్‌ మోగదు కదా… అందుకే విమానం నాకు ఇష్టం అంటుంది పాప. తల్లిదండ్రులిద్దరూ అవాక్కవుతారు. తన ప్రవర్తనతో పాప ఎంత ఫీలవుతున్నదో గ్రహించిన తండ్రి… విమానంలోని అనౌన్సర్‌ మాదిరిగా నటిస్తూ…’విమానం బయలుదేరడానికి సిద్ధంగా వుంది. దయచేసి మీ సెల్‌ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేయండి’ అంటూ తన సెల్‌ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేస్తాడు. పాపను ఉత్సాహపరిచే సన్నివేశం హృదయాన్ని తాకుతుంది. ఎఫ్‌సిబి ఇండియా రూపొందించిన ఈ స్విచ్‌ ఆఫ్‌ వీడియో బాగా ట్రెండ్‌ అవుతోంది. ‘మానవ సంబంధాలపై స్మార్ట్‌ఫోన్ల ప్రభావం-2023′ పేరుతో వివో-సైబర్‌ మీడియా రీసెర్చ్‌’ వారు నిర్వహించిన సర్వేలో విస్తుగొలిపే నిజాలు వెల్లడయ్యాయి. స్మార్ట్‌ఫోన్‌ల వాడకం వల్ల తల్లిదండ్రులు, పిల్లల మధ్య పెద్ద అగాధం ఏర్పడుతోంది. 77 శాతం మంది తల్లిదండ్రుల స్మార్ట్‌ఫోన్‌ వినియోగంపై పిల్లలు ఫిర్యాదు చేస్తున్నారు. 93 శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలతో సంబంధాల పట్ల అపరాధభావానికి గురవుతున్నారు. ఫోన్‌ వాడుతున్న సమయంలో పిల్లలు ఏదైనా అడిగితే 74 శాతం మంది తల్లిదండ్రులు చిరాకు పడుతున్నారని ఈ అధ్యయనం వెల్లడించింది. దీంతో పిల్లల మనసు నొచ్చుకుంటోంది. 91 శాతం మంది పిల్లలు తమ తల్లిదండ్రుల స్మార్ట్‌ఫోన్‌ వినియోగం వల్ల మునుపెన్నడూ లేనంత ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. తద్వారా తల్లిదండ్రులు పిల్లల మధ్య సంబంధాలు దెబ్బతింటున్నాయి.

ఈ చేదు నిజాలను తల్లిదండ్రులకు తెలియపర్చి, రోజులో కొంత సమయం స్మార్‌ఫోన్‌లను స్విచ్‌ఆఫ్‌ చేసి కుటుంబంతో గడపాలని ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ వీవో ‘స్విచ్‌ఆఫ్‌’ పేరుతో ఒక ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ నెల 20న రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు తమ స్మార్ట్‌ఫోన్లను స్విచ్‌ ఆఫ్‌ చేసి, ఆ సమయాన్ని తమ కుటుంబాలతో గడపాలని కోరింది. నిజమే…తమ సమయమంతా స్మార్ట్‌ఫోన్లతో గడిపేవారు పెద్దలైనా, పిల్లలైనా ఆలోచించాల్సిన విషయం ఇది. పిల్లలకు చెప్పడమే కాదు…పెద్దలు కూడా ఆచరించాలి. పెద్దలు, పిల్లలు తమ ఫోన్లను స్విచ్‌ ఆఫ్‌ చేసి కుటుంబంతో గడిపేందుకు కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. అది కొద్ది సమయమే అయినా…వ్యక్తుల మధ్య బంధాలను స్మార్ట్‌ఫోన్‌ నెట్‌వర్క్‌ల కంటే బలమైన అనుబంధంగా మార్చుతుంది.

➡️