12 మంది రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకారం

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం ఉదయం ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌ కొత్త సభ్యులతో ప్రమాణం చేయించారు. కేంద్ర సమాచార, ప్రసారశాఖ సహాయ మంత్రి ఎల్‌ మురుగన్‌, ఆర్‌జెడి నేత మనోజ్‌కుమార్‌ ఝా సహా మొత్తం 12 మంది సభ్యులు పెద్దల సభకు ప్రమాణ స్వీకారం చేశారు. ఎల్‌ మురుగన్‌, ధర్మశీల గుప్తా, మనోజ్‌ కుమార్‌ ఝా, సంజరు యాదవ్‌, గోవింద్‌భారు లాల్జీభారు ధోలాకియా, సుభాష్‌ చందర్‌, హర్ష్‌ మహాజన్‌, జిసి చంద్రశేఖర్‌, అశోక్‌ సింగ్‌ చంద్రకాంత్‌, హండోరే మేధా, విశ్రమ్‌ కులకర్ణి, సాధన సింగ్‌ తదితరులు ఉన్నారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. గురువారం ఎపి, తెలంగాణకు చెందిన సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
కాగా, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సహా 54 మంది రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేసిన విషయం తెలిసిందే. వీరిలో తొమ్మిది మంది కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. మంగళవారం ఒక్కరోజే 49 మంది రాజ్యసభ ఎంపిలు పదవీ విరమణ చేయగా.. ఐదుగురు ఎంపిలు బుధవారం పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం కేంద్ర మంత్రులుగా కొనసాగుతున్న ఏడుగురి రాజ్యసభ సభ్యులు పదవీ కాలం కూడా మంగళవారంతో ముగిసింది. వీరిలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయా, పశు సంవర్ధక, మత్స్య శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా, ఐటి మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌, విదేశాంగశాఖ సహాయ మంత్రి వి మురళీధరన్‌, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలశాఖ మంత్రి నారాయణ్‌ రాణే, సమాచార, ప్రసారశాఖ సహాయ మంత్రి ఎల్‌ మురుగన్‌ ఉన్నారు. పర్యావరణశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ పదవీ కాలం బుధవారంతో ముగిసింది. ఈ కేంద్ర మంత్రులందరూ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

➡️