హోం ఓటింగ్‌కు సర్వే!

Apr 15,2024 23:38

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : సార్వత్రిక ఎన్నికల్లో ఇంటి నుంచి ఓటు వేసేందుకు వికలాంగులు, 85 ఏళ్లు దాటిన వృద్ధుల గుర్తింపు ప్రక్రియ సోమవారం గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ప్రారంభమైంది. రెండు జిల్లాల పరిధిలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్‌ కేంద్రం అధికారులు (బిఎల్‌వో) ఓటర్ల జాబితా ఆధారంగా వీరిని గుర్తిస్తున్నారు. హోం ఓటర్ల గుర్తింపు కోసం బిఎల్‌వోలు వారి వద్ద ఉన్న సమాచారంతో సంబంధిత అర్హుల చేత దరఖాస్తు చేయిస్తారు. ఈ వివరాలను తహశీల్దార్‌ సంబంధిత రిటర్నింగ్‌ అధికారికి సమర్పిస్తారు. ఈ మేరకు వారికి అవగాహన కల్పిస్తారు. 18వ తేదీనుంచి 20వ తేదీ వరకు తిరిగి సంబంధిత దరఖాస్తుల పరిశీలన జరుగుతుంది. అధికారులు దృవీకరించిన తరువాత అర్హత ఉన్న వారికిఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తారు. 40 శాతం పైబడిన వికలాంగులు, తీవ్ర అనారోగ్యంతో ఉండి మంచంలో కదలలేని స్థితిలో ఉన్న వారు కూడా హోం ఓటింగ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ ఈనెల 17 వరకు కొనసాగుతుంది. ఒక వేళ ఓటర్ల జాబితాలో వయస్సు తప్పుగా నమోదై వాస్తవంగా ఓటరు వయస్సు 85 దాటినట్టు ఆధార్‌ కార్డు లేదా పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం సమర్పిస్తే ఇంటి వద్ద నుంచి ఓటు వేసుకునేందుకు దరఖాస్తు ఫారం 12 డిని సమర్పించవచ్చునని అధికారులు తెలిపారు. వికలాంగులకు 40 శాతం వైకల్యం ఉన్నట్టు సదరం ధ్రువీకరణ పత్రాలను చూపాలి. ఆరోగ్య సమస్యలుండి మంచంలో ఉన్న వారికి కూడా సంబంధిత వైద్యుల ద్వారా ధ్రువీకరణ పత్రం అందచేయాలి. ఇందుకోసం జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోలు రూం ఏర్పాటు చేశారు. ఏయే నియోజకవర్గాల్లో ఎంత మంది హోం ఓటింగ్‌కు అర్హులు ఉన్నారు. ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారో సంబంధిత బిఎల్‌ఓల నుంచి వివరాలను కంట్రోలు రూమ్‌ సిబ్బంది సేకరించి రిటర్నింగ్‌ అధికారి, జిల్లా ఎన్నికల అధికారి ద్వారా ఎన్నికల కమిషన్‌కు పంపుతారు. బిఎల్‌వోలుగా ఉన్న సచివాలయం ఉద్యోగులు ఈ ప్రక్రియను మూడురోజుల్లో పూర్తి చేయాల్సి ఉండటంతో సోమవారం ఉదయం నుంచి ఈ ప్రక్రియను వేగవంతం చేశారు. ఓటర్ల జాబితాల్లో వయస్సు తప్పుగా నమోదైన వారు, 40 శాతం పైబడిన వికలాంగులు నేరుగా సంబంధిత బిఎల్‌వోకు హోం ఓటింగ్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని అధికారులు తెలిపారు. పోలింగ్‌ రోజున ఎన్నికల విధుల్లో పాల్గొనే జర్నలిస్టులకు కూడా ఈసారి పోస్టల్‌ ఓటింగ్‌ సదుపాయాన్ని కల్పించారు. ఇప్పటివరకు పోలింగ్‌ విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులకు ఈ సదుపాయం ఉంది. ఈ సారి జర్నలిస్టులకు, ఇతర శాఖలకు సంబంధించిన వారికి కూడా పోస్టల్‌ ఓటింగ్‌ సదుపాయం కల్పించారు. పోలింగ్‌ విధుల్లో పాల్గొనే జర్నలిస్టులకు ఎన్నికల కమిషన్‌ ఇచ్చే ఆథరైజేషన్‌ లేఖలతో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారని అధికారులు తెలిపారు.

➡️