నిఘా బృందాలు సమిష్టిగా పని చేయాలి

Apr 17,2024 22:27
నిఘా బృందాలు సమిష్టిగా పని చేయాలి

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుకు ఎంసిసి, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, వీడియో సర్వెలెన్స్‌, స్టాటిక్‌ సర్వైలెన్స్‌ బృందాలు అంకిత భావంతో సమిష్టిగా కృషి చేయాలని రిటర్నింగ్‌ అధికారి, రాజమండ్రి సిటీ అసెంబ్లీ నియోజకవర్గం ఆర్‌ఒ, నగరపాలక సంస్థ కమిషనర్‌ కె.దినేష్‌ కుమార్‌ తెలిపారు. తనిఖీ బందాలతో నగరపాలక సంస్థ కార్యాలయంలో బుధవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలూ, వారి అభ్యర్థులూ తమ కార్యకలాపాలను విస్తతం చేస్తారని, కావున మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సరియైన పత్రాలు లేకుండా ఎవరూ నగదు తీసుకెళ్ళరాదని, అటువంటి నగదు దొరికినపుడు నిబంధనలకు అనుగుణంగా ప్రవర్తించాలని చెప్పారు. రూ.10 లక్షల కన్నా ఎక్కువ మొత్తం దొరికితే ఆదాయపన్ను శాఖ వారికి సమాచారం ఇచ్చి, వారి ద్వారా నగదు జప్తు చేయాలని తెలిపారు. అభ్యర్థులతో ర్యాలీలో పాల్గొనే వారి వాహనాలను నిశితంగా పరిశీలించాలని, పార్టీ జండాలతో ఆయా వాహనాల ఖర్చు అభ్యర్ధి ఖాతాలో వేయాల్సి ఉంటుందని తెలియచేసారు. స్టాటిక్‌ సర్వైలెన్సు టీములు నగరంలోకి ప్రవేశించే మార్గాలన్నింటి వద్ద నిఘా వేసి ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని ఆదేశించారు. రేపటి నుంచి అన్ని బందాలు పూర్తి స్థాయిలో పని చేయాలని, బందాల యొక్క పని తీరును రోజు వారీగా సమీక్ష చేస్తామన్నారు.

➡️