బిజెపి గురించి మాట్లాడరేం?.. వైసిపికి వి శ్రీనివాసరావు సూటిప్రశ్న

ప్రజాశక్తి- పాలకొల్లు (పశ్చిమగోదావరి జిల్లా) : బాపట్ల జిల్లా మేదరమెట్లలో జరిగిన సిద్ధం సభలోనూ రాష్ట్ర విభజన హామీలు ఏ ఒక్కటీ అమలు చేయని బిజెపి కేంద్ర ప్రభుత్వంపైగానీ, మోడీపైగానీ సిఎం జగన్‌ మాట్లాడలేదెందుకని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రశ్నించారు. బిజెపి పట్ల వైసిపి వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. సోమవారం ఆయన పాలకొల్లులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన బిజెపితో టిడిపి, జనసేన జత కట్టడం రాష్ట్రానికి హానికరమన్నారు. రాష్ట్రానికి శత్రువైన బిజెపిని గత ఐదేళ్లలో వైసిపి పల్లెత్తు మాట అనలేదని తెలిపారు. ఎన్‌డిఎలో ప్రత్యక్షంగా లేకపోయినా బిజెపినిగానీ, మోడీనిగానీ అన్ని విధాల సమర్థించిందని గుర్తు చేశారు. జగన్‌ కలబొల్లి కబుర్లు చెబితే ఉపయోగం లేదని, బిజెపి పట్ల తమ వైఖరి స్పష్టం చేయకపోవడమంటే మైనార్టీలను మోసగించడమేనని, రాష్ట్రాభివృద్ధిని కాలరాయడమేనని విమర్శించారు. రాష్ట్రంలో 22 ఎంపీ సీట్లు, 52 శాతం ఓట్లు వైసిపికి ఇచ్చినా ఇంకా 25 ఎంపీలు, 175 ఎంఎల్‌ఎలు కావాలని జగన్‌ కోరుకోవడంలో ఆంతర్యమేమిటో చెప్పాలన్నారు. ఈ భారీ మెజార్టీతో తిరిగి రాష్ట్రాన్ని కేంద్రానికి తాకట్టు పెట్టడానికేనా? అని ప్రశ్నించారు. గత ఐదేళ్లలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హక్కుల గురించి ఏ ఒక్క సందర్భంలోనూ బిజెపితో వైసిపి పోరాడలేదని, ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, విశాఖ ఉక్కు, రాజధాని నిధుల గురించి నిలదీయలేదని గుర్తు చేశారు. కనీసం పార్లమెంట్‌లోనూ పోరాడలేదన్నారు. కేంద్రంలోని బిజెపి తమకు 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని చెబుతోందని, ప్రజలకు విద్య, వైద్యం, మైనార్టీల హక్కులు రక్షించడానికి రాజ్యాంగ సవరణ చేస్తే తమకు అభ్యంతరం లేదని, రాజ్యాంగంలోని లౌకికవాదం తీసివేయడానికి కుట్ర చేస్తే తాము అంగీకరించబోమని తేల్చి చెప్పారు. రాజ్యాంగ సవరణపై టిడిపి, జనసేన, వైసిపి తమ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. దేశంలో ఇండియా వేదిక బలపడుతోందని, దీంతో, మోడీ భయపడుతున్నారని వివరించారు. మేదరమెట్ల సిద్ధం సభకు రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని విమర్శించారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీకి జగన్‌ నాలుగుసార్లు భూమి పూజ చేశారని, ఇప్పటికీ ఒక ఇటుక కూడా పడలేదని తెలిపారు. రైతులు గిట్టుబాటు ధర కోసం కేంద్రంపై పోరాడితే కనీసం జగన్‌ తన వైఖరి స్పష్టం చేయలేదని, పార్లమెంట్లో కనీసం రైతుల సమస్యపై వైసిపి ఎంపీలు మాట్లాడలేదని గుర్తు చేశారు. ఎలక్ట్రోరల్‌ బాండ్ల వివరాలు ఎస్‌బిఐ తక్షణం బహిర్గతం చేయాలని శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా ఎస్‌బిఐ జాప్యం చేయడం దారుణమన్నారు. సిపిఎం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం, పట్టణ కార్యదర్శి జవ్వాది శ్రీనివాస్‌, మాజీ ఎంఎల్‌ఎ దిగుపాటి రాజగోపాల్‌ పాల్గొన్నారు.

➡️