Freebies : గురువారం విచారణ చేపట్టనున్న సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ :   ఎన్నికల సమయంలో వివిధ రాజకీయ పార్టీలు ప్రకటించే ‘ఉచిత హామీ’లపై దాఖలైన పిల్‌పై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది.ఉచిత హామీలు ప్రకటించే రాజకీయ పార్టీల ఎన్నికల గుర్తులు, రిజిస్ట్రేషన్‌లను రద్దు చేయాల్సిందిగా ఎలక్షన్‌ కమిషన్‌ను ఆదేశించాలని పిల్‌ కోరింది.

ఈ పిల్‌పై గురువారం విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌, జస్టిస్‌ జె.బి. పార్ధివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. ”ఈ అంశం చాలా ముఖ్యమైనది. రేపటి విచారణ జాబితాలో చేస్తాం ” అని వ్యాఖ్యానించింది.

లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ పిల్‌ను విచారించాల్సిన అవసరం ఉందని పిల్‌ పిటిషనర్‌ అశ్వినీ ఉపాధ్యాయ తరపున హాజరైన న్యాయవాది విజరు హన్సారీ వాదనను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఓటర్ల నుండి రాజకీయ ఆదరణ పొందేందుకు ఉచిత హామీలను ప్రకటించడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం, ప్రజాస్వామ్య విలువలకు తీవ్ర విఘాతమని పిల్‌ పేర్కొంది. ఈ ఉచిత హామీలపై నిషేధం విధించాలని, ఎలక్షన్‌ కమిషన్‌ తగిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోరింది.

➡️