కొబ్బరికి రూ.15 వేలు మద్దతు ధర ప్రకటించాలి 

Dec 29,2023 08:42 #Coconut, #Support Price
కొబ్బరికి రూ.15 వేలు మద్దతు ధర ప్రకటించాలి 

 

కొబ్బరి రైతు సంఘం డిమాండ్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : 2024 సీజన్‌కు సంబంధించి కొబ్బరి కనీస మద్దతు ధరను రూ.15 వేలకు పెంచాలని ఆంధ్రప్రదేశ్‌ కొబ్బరి రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్‌ కె శ్రీనివాస్‌, కో-కన్వీనర్‌ బత్తిని లక్ష్మినారాయణ డిమాండ్‌ చేశారు. కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ నిర్ణయించిన ధర ఏ మాత్రం సరిపోదన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. క్వింటాల్‌ మిల్లింగ్‌ కొబ్బరి రూ.300, బంతి కొబ్బరికి రూ.250 పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. అది కేవలం కంటి తుడుపు చర్య మాత్రమేనన్నారు. మద్దతు ధర కోసం ఆందోళన చేస్తున్నా కొబ్బరి రైతుల గోడును కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టిందన్నారు. కొబ్బరి రైతులకు పెట్టుబడి ఖర్చులు కూడా రాకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారని, విదేశాల నుండి కొబ్బరి ఉత్పత్తుల దిగుమతులకు అవకాశం కల్పించడం వల్ల దేశీయంగా కొబ్బరి రైతులకు కనీస ధరలు రావడం లేదన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కొబ్బరి ఉత్పత్తిలో భారతదేశం మూడో స్థానంలో ఉండగా, దేశంలో ఆంధ్రప్రదేశ్‌ 4వ స్థానంలో ఉందన్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఒక్కో కొబ్బరికాయ రైతులకు రూ.8 నుంచి రూ.10 మాత్రమే ధర వస్తుందన్నారు. చెట్లు నుండి కొబ్బరికాయలు కోసి గుట్టగా పోయడానికి ఒక్కో కాయకు రైతుకు రూ.3లకు పైగా ఖర్చవుతుందన్నారు. రైతుకు కాయకు రూ.5 మించి ధర రావడం లేదన్నారు. ఎకరా సాగు చేసేందుకు పెట్టుబడి రూ.40 వేలు అవుతుందన్నారు.

➡️