మూఢవిశ్వాసాలు అభివృద్ధికి ఆటంకం !

Jan 5,2024 07:18 #Editorial

మతం-ఆధ్యాత్మికత-సైన్సుల పరిధులేమిటో తెలుసుకోవడానికి ఇక్కడ ఒక దృశ్యం చూపెడతాను-ఒక మత గురువు చిన్న గోచి గుడ్డ తప్ప మరేమీ లేకుండా అంటే దాదాపు నగంగా కూర్చుని భక్తులకు మతం- ఆధ్యాత్మికత-దైవభక్తి గూర్చి బోధిస్తున్నాడు. అయితే అతను కళ్ళజోడు పెట్టుకుని ఉన్నాడు. మరి అది ఎందుకూ? తన ఆత్మశక్తితో ఎదురుగా కూర్చుని ఉన్న భక్తజనాన్ని చూడొచ్చు కదా? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేమంటే-మత పిచ్చి అతని గుడ్డలిప్పదీసి నగంగా కూర్చోబెట్టింది. మతం అతణ్ణి అనాగరి కుణ్ణి చేసింది. ఇక కళ్ళజోడు అంటే సైన్సు-అతనికి చూపునిచ్చింది. మత పిచ్చితో గుడ్డివాడైన వాడు కూడా సైన్సుపై ఆధారపడక తప్పలేదు. ఎదురుగా ఉన్న మైకు, కళ్ళద్దాలు తీసేసి జనానికి ఏమైనా బోధించగలడా? ఆలోచించుకోవాలి! మతం గొప్పదా? విజ్ఞాన శాస్త్రం గొప్పదా అనేది అర్థం చేసుకునే వాడికి, విషయం చెప్పకుండానే అర్థమవుతుంది!

                  దేవుడు ఉంటే పాలస్తీనా ఇజ్రాయిల్‌ మధ్య జరుగుతున్న రక్తపాతాన్ని, నరమేధాన్ని ఆపలేదు ఎందుకూ? తమ కుమారులు కొట్టుకుని చావడం దేవుడికి ఇష్టమా? యుద్ధం జరగడంలో గానీ శాంతి స్థాపనలో గానీ దేవుడి ప్రమేయం ఉండదని తెలుసుకోవాలి. దేవుడు లేడన్న సత్యాన్ని ప్రజలు తెలుసుకోలేనంత కాలం, తమ సమస్యలు తామే పరిష్కరించుకోవాలని తెలుసుకోలేనంత కాలం, ‘మనుషుల్లో స్థాయీ భేదాలు లేవు, అందరిదీ ఒకే జాతి’- అని గ్రహించనంత కాలం-ప్రపంచంలో ఈ నరమేధం జరుగుతూనే ఉంటుంది.

అందువల్ల మూఢనమ్మకాలను పాటించే వారిని, ప్రచారం చేసే వారిని ఆయా మతాల సంబంధీకులు నిర్దాక్షిణ్యంగా తమ తమ మతాల నుండి బహిష్కరించాలి. అప్పుడు గానీ మతాల మీద ప్రజలకు నమ్మకం కలగదు. అప్పుడే అవి నిజమైన మతాలు అవుతాయి. లేదా చిల్లర మతాలుగా మిగిలిపోతాయి. ఈ పని చేయాల్సింది మన భారతదేశ రాజ్యాంగ స్ఫూర్తిని నిలుపుకోవడానికే! మరి మతాలే అంధవిశ్వాసాల్ని వ్యాప్తి చేస్తుంటే ఏం చేయాలి? తప్పదు-మతాల్నే త్యజించాలి. ఇంతకీ మతాలెందుకు ఏర్పడ్డాయి? అవి ఎవరి కోసం పని చేస్తున్నాయో వాటి అంతరార్థం ఏమిటో చూడండి. పురుషుడు పురుషుడి కోసం ఏర్పాటు చేసుకున్నదే మతం. వేర్వేరు మతాల్లో స్త్రీ పురుషులకు ఉన్న విలువ ఏ పాటిదో చూడండి. క్రైస్తవం ప్రకారం పురుషుడికి ఉన్న విలువలో స్త్రీ విలువ అరవై శాతమే-అని లివిటికస్‌ 27-3-7 చెపుతోంది. ఇస్లాం ప్రకారం (4-24) అంతకు ముందే వివాహమైన స్త్రీలను పురుషులు పెళ్ళి చేసుకోరాదు. బానిసలైతేనో లేక యుద్ధంలో గెలుచుకున్న వారైతేనో చేసుకోవచ్చు. హిందూ మతం ప్రకారం (తిన్ష-9/93) పురుషులు 24-30 ఏళ్ళ వయసులో 8-12 ఏళ్లున్న బాలికల్ని పెళ్లి చేసుకోవాలని మనుస్మృతి చెప్తోంది. జుడాయిజం (తల్‌మడ్‌) స్త్రీ- అనుభవిస్తూ ఆనందించాల్సిన ఒక తిత్తి (వస్తువు). జైనమతం లోని దిగంబర శాఖ ప్రకారం స్త్రీలు తమ తదుపరి జన్మలో పురుషుడిగా పుడితే గాని, నిర్వాణ స్థాయికి చేరుకోరు! మార్పులు చెందుతూ వచ్చిన ఒక బుద్ధ శాఖ ప్రకారం-పురుష భిక్షులకన్నా, స్త్రీ సన్యాసులకు నిబంధనలు ఎక్కువ! జీవితంలో విఫలమైన, పురుషులు-తర్వాతి జన్మలో స్త్రీలుగా పుడతారు.

తమకు పనికొచ్చేది ఏది ఉన్నా వెంటనే దాన్ని తమ మతంలో విలీనం చేసుకోవడం బ్రాహ్మణిజానికి అలవాటు. ఇది శతాబ్దాలుగా జరుగుతూ ఉన్న విషయమే. బుద్ధుడి విగ్రహాలు మార్చి, హిందూ దేవతా విగ్రహాలుగా మార్చుకోవడం లోగడ చూశాం. ఇప్పుడు మరిన్ని కొత్త ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంబేద్కర్‌ రెండో భార్య సవిత బ్రాహ్మణ మహిళ కావడం వల్ల, అంబేద్కర్‌ బ్రాహ్మణులకు ఇంటి అల్లుడు అని, ఆయనను మేము తగు రీతిలో గౌరవించుకుంటూనే ఉంటామని తిరుపతి బ్రాహ్మణ సంఘం నాయకులు రాఘవన్‌ అజరు కుమార్‌-ప్రమీలమ్మల ఆధ్వర్యంలో తిరుపతి పట్టణంలో తొలిసారి అంబేద్కర్‌ 127వ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. స్వార్థపరులైన కొందరు రాజకీయ నాయకులు అంబేద్కర్‌కు బ్రాహ్మణ సంఘాలకు మధ్య వివాదాలు సృష్టిస్తున్నారని-అన్నారు. అంబేద్కర్‌ పై చదువుల కోసం ఆనాడు ఓ బ్రాహ్మణుడు తన ఇంటిని అమ్మి ఆయన్ను విదేశాలకు పంపారనీ.. ఆ వ్యక్తిని అంబేద్కర్‌ గురువుగా భావించే వారనీ అన్నారు. నిజమే కావచ్చు- కానీ, వైదిక/హిందూ-మతవాదులు, మను వాదులు చేసిన దాష్టీకం గురించి అంబేద్కర్‌ ఎన్నో రచనలు చేశారు. ఎన్నో ప్రసంగాలు చేశారు. చివరకు ఆయన హిందూ మతాన్ని వదిలి, బౌద్ధం స్వీకరించారు. బుద్ధుణ్ణి హిందూ మతంలో కలుపుకున్నట్లు, దశావతారాల్లో ఒకడిగా చేసుకున్నట్లు-ముస్లిం అయిన సాయిబాబాను హిందూ దేవుడిగా ఆరాధిస్తున్నట్టు – రేపు అంబేద్కర్‌ను కూడా దేవుణ్ణి చేసే ప్రమాదం ఉంది. మనిషిని మనిషిగా ఉండనివ్వండి రా బాబూ-మీ స్వార్థ ప్రయోజనాల కోసం, మీ పొట్ట కూటి కోసం ఎందుకు మనుషుల్ని దేవుళ్లుగా చేస్తారూ? ఇక్కడ బ్రాహ్మణులను గురించి డా.బి.ఆర్‌.అంబేద్కర్‌ ఏమన్నారో చూద్దాం- ”బ్రాహ్మణుడికి మతం వల్ల ఉపాధి లభిస్తుంది. కాబట్టి అతను మతం గురించే గొప్పగా మాట్లాడుతాడు. దళితులకు రాజ్యాంగం వల్ల ఉపాధి లభిస్తుంది కాబట్టి వాళ్లు రాజ్యాంగం గొప్పతనం గురించే మాట్లాడాలి. మతం గొప్పతనం గురించి కాదు-రాజ్యాంగాన్ని నమ్ముకుంటే నిన్ను చెప్రాసి నుంచి రాష్ట్రపతిని చేస్తుంది. ఒక వేళ దళితులు మతాన్ని నమ్ముకుంటే అది మళ్లీ వాళ్లను అంటరాని వాళ్లుగా- శూద్రులుగా, నిరక్షరాస్యులుగా, బానిసలుగా చేస్తుంది”. మనువాదుల వల్ల, వారి కొమ్ముకాస్తున్న బహుజనుల వల్ల సమకాలీనంలో అనేక అనర్థాలు జరుగుతున్నాయి. మనిషి కేంద్రంగా, రాజ్యాంగం కేంద్రంగా నిర్ణయాలు, ఆచరణలూ ఉండి ఉంటే, దేశంలో పరిస్థితి మరో రకంగా ఉండి ఉండేది. స్వాతంత్య్ర సమరంలో ముందు నిలిచిన గాంధీజీయే, మతం విషయంలో మనువాదులను అనుసరించాడు. జస్టిస్‌ మార్కండేయ ఖట్జూ గాంధీజీ గురించి చెప్పిన మాటల్లో యదార్థమెంత ఉందో విశ్లేషించుకోవాలి. ఆయన ”ఈశ్వర్‌ అల్లా తేరే నామ్‌’-అంటూ మత సామర స్యానికి పాటు పడ్డారే గానీ, మతాన్ని నిరసించలేదు. వైజ్ఞానిక అవగాహన గూర్చి మాట్లాడలేదు. ఆ పని, తర్వాత కాలంలో పండిట్‌ నెహ్రూ చేసుకుంటూ వచ్చారు.

మతం-ఆధ్యాత్మికత-సైన్సుల పరిధులేమిటో తెలుసుకో వడానికి ఇక్కడ ఒక దృశ్యం చూపెడతాను-ఒక మత గురువు చిన్న గోచి గుడ్డ తప్ప మరేమీ లేకుండా అంటే దాదాపు నగంగా కూర్చుని భక్తులకు మతం-ఆధ్యాత్మికత-దైవభక్తి గూర్చి బోధిస్తున్నాడు. అయితే అతను కళ్ళజోడు పెట్టుకుని ఉన్నాడు. మరి అది ఎందుకూ? తన ఆత్మశక్తితో ఎదురుగా కూర్చుని ఉన్న భక్తజనాన్ని చూడొచ్చు కదా? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేమంటే-మత పిచ్చి అతని గుడ్డలిప్పదీసి నగంగా కూర్చోబెట్టింది. మతం అతణ్ణి అనాగరి కుణ్ణి చేసింది. ఇక కళ్ళజోడు అంటే సైన్సు-అతనికి చూపునిచ్చింది. మత పిచ్చితో గుడ్డివాడైన వాడు కూడా సైన్సుపై ఆధారపడక తప్పలేదు. ఎదురుగా ఉన్న మైకు, కళ్ళద్దాలు తీసేసి జనానికి ఏమైనా బోధించగలడా? ఆలోచించుకోవాలి! మతం గొప్పదా? విజ్ఞాన శాస్త్రం గొప్పదా అనేది అర్థం చేసుకునే వాడికి, విషయం చెప్పకుండానే అర్థమవుతుంది!

మతం ఆధారంగా అధికారంలో కొనసాగుతున్న నేటి కేంద్ర ప్రభుత్వ హయాంలో దేశంలో జరుగుతున్న దురాగతాలు ఎన్నని చెప్పగలం? ఎటు చూస్తే అటు లెక్కలేనన్ని ఉన్నాయి. రైల్వే-రక్షణ దళానికి చెందిన ఒక కానిస్టేబుల్‌ కదులుతున్న రైల్లో ముగ్గురు ముస్లింలను కాల్చి చంపాడు. మరోచోట ఒక ముస్లిం విద్యార్థిని వరుసగా క్లాసులోని తోటి విద్యార్థులంతా చెంపపై కొట్టాలంటూ ముజఫర్‌నగర్‌లో ఒక స్కూలు టీచర్‌ తన విద్యార్థులను ఆదేశించారు. దేశవ్యాప్తంగా కాషాయ మూకలు ముస్లిం వ్యతిరేక ప్రసంగాలు చేయడం, ముస్లింలపై దాడులకు దిగడం జరుగుతున్న నేపథ్యంలో బిదూరీ విద్వేష ప్రసంగాలను కూడా చూడాల్సి ఉంది. ముస్లింలను సమూలంగా నిర్మూ లించాలంటూ ‘ధర్మ సంసద్‌’లు పిలుపునివ్వడం, గోవులను అక్రమంగా రవాణా చేస్తున్నారని లేదా గొడ్డు మాంసాన్ని తీసుకెళుతున్నారనే నెపంతో ముస్లింలను వేధించి కొట్టి చంపడ మనేది హర్యానా, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర వంటి బిజెపి పాలిత రాష్ట్రాల్లో నిత్యం జరుగుతున్న విషయం-దేశ ప్రజలు గమనిస్తున్నారు. ప్రభుత్వం దేశంలో శాంతి భద్రతలు కాపాడటమంటే ఇదేనా? అని ప్రశ్నిస్తున్నారు. ఉగ్రవాదాన్ని యూరపు దేశాల్లో ‘టెర్రరిజం’ అని అంటారు. ముస్లిం దేశాల్లో ‘జీహాద్‌’ అని అంటారు. దాన్నే సమకాలీన భారత దేశంలో ‘సనాతన ధర్మం’ అంటారని ఈ దేశ ప్రజలు నిర్వచించుకుంటున్నారు.

ప్రపంచంలో మతాల ప్రాబల్యం తగ్గుముఖంలో ఉంటే, మన దేశంలో మాత్రం అధికారంలో ఉన్న ప్రభుత్వం-‘మతమే దేశభక్తి’ అని చెబుతోంది. క్రిస్టియానిటీని ప్రపంచంపై బలవంతంగా రుద్దిన ఇంగ్లాండ్‌లో-ఇప్పుడు అదే క్రిస్టియానిటీ-తగ్గు ముఖం పడుతోంది! ఇంగ్లాండ్‌లో క్రిస్టియన్ల సంఖ్య అరవై శాతం నుండి నలభై ఆరు శాతానికి పడిపోయింది. అలాగే ఏ మతాన్నీ పాటించని వారి సంఖ్య 26 నుండి 38 శాతానికి పెరిగింది. మరో దశాబ్దం నాటికి ఆ మతం మైనార్టీ స్థాయికి వచ్చినా ఆశ్చర్యపోనక్కర లేదు. అయితే మత ప్రాతిపదికన సామాజిక శత్రుత్వాలు పెరిగిపోయిన దేశాల్లో మన దేశం అగ్రస్థానంలో ఉంది. భారత దేశం 9.4, నైజీరి యా 8.5, ఆఫ్ఘనిస్తాన్‌ 8, ఇజ్రాయిల్‌ 8, మాలి 7.9, పాకిస్తాన్‌ 7.5, ఈజిప్టు, లిబియా, సిరియా7.4. ఇందులో తక్కువ స్కోరు ఉంటే అక్కడ సుహృద్భావ వాతావరణం బావుందని అర్థం! అందువల్ల మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టే వారిని, మూఢ విశ్వాసాలు ప్రచారం చేసే వారిని తక్షణం బహిష్కరించాలి. ఇది దేశ ప్రజలందరూ చేపట్టాల్సిన కార్యక్రమం!

/ వ్యాసకర్త సుప్రసిద్ధ సాహితీవేత్త, విశ్రాంత బయాలజీ ప్రొఫెసర్‌- మెల్బోర్న్‌ నుంచి /డా|| దేవరాజు మహారాజు

➡️