చేనేతల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే : రాష్ట్ర చేనేత జన సమైక్య ఆరోపణ

Jan 11,2024 23:56

ప్రజాశక్తి – వేటపాలెం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో చేనేత పరిశ్రమ రోజు రోజుకి కుంటుపడుతుందని చేనేత జన సమైక్య నాయకులు ఆరోపించారు. మండలంలో చల్లారెడ్డిపాలెం పంచాయితీ కొంజేటి నగర్ కాలనీలో గత రాత్రి అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న లేళ్ల విజయలక్ష్మి మరణం కలచి వేసిందని పేర్కొన్నారు. చేనేత రిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులకు రోజువారి పని లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. చేనేత కార్మికులు ఆర్థిక సమస్యలు, అనారోగ్యాలతో సతమతం అవుతూ జీవనాన్ని గడుపుతున్నారని అన్నారు. కరోనా మహమ్మారి సంక్షోభం తర్వాత కార్మికులకు పని చేసే శక్తి, నైపుణ్యం కలిగి ఉన్నప్పటికీ రోజు వారీ పని లేక కుటుంబ పోషణకు అధిక వడ్డీలకు అప్పులు చేస్తున్నారని అన్నారు. అప్పులు తీర్చే పరిస్థితిని వృత్తి భరోసాను ప్రభుత్వాలు కల్పించకపోవడంతో ప్రత్యామ్నాయం లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. దేశాయిపేట పంచాయతీ పృద్వి సుజాత గత ఏడాది జూన్‌ 3న, రామానగర్‌కు చెందిన కౌతరపు జ్యోతి జూన్‌ 07న మగ్గానికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు. దేశాయిపేట పంచాయతీ ఐటిఐ కాలనీకి చెందిన పెద్ద చెన్నయ్య, సుబ్బలక్ష్మి దంపతులు జులై 17న రైలు క్రిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఆ దంపతులు ఇద్దరు కలిసి ఒక్కరిగానే మరణించడం ఆవేదన కలిగించింది. వీటిని మరవక ముందే కొణిజేటి నగర్ చేనేత కార్మికురాలు లేళ్ళ విజయలక్ష్మి అప్పుల బాధ తట్టుకోలేక, అప్పులు ఇచ్చిన వారి వేధింపులు తాళలేక జనవరి 09న మగ్గానికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుని ఆత్మహత్యకు గురైందని తెలిపారు.

➡️