నిరంతర శ్రమతోనే విజయాలు

Mar 7,2024 08:30 #ISRO, #ISRO Chairman Somnath

డాక్టర్‌ పిన్నమనేని సీతాదేవి అవార్డు స్వీకరణలో ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌

ప్రజాశక్తి-హెల్త్‌ యూనివర్సిటీ (విజయవాడ) : ఒక్క రోజుతో విజయం రాదని, నిరంతర శ్రమ ఫలితంగానే విజయాలు వరిస్తాయని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్‌ శ్రీధర పానికర్‌ సోమనాథ్‌ అన్నారు. డాక్టర్‌ పిన్నమనేని – సీతాదేవి ఫౌండేషన్‌ 30వ వార్షికోత్సవం విజయవాడలోని పిబి సిద్ధార్థ ఆడిటోరియంలో ఫౌండేషన్‌ చైర్మన్‌ గుళ్లపల్లి నాగేశ్వరరావు అధ్యక్షతన బుధవారం జరిగింది. సోమనాథ్‌కు ‘డాక్టర్‌ పిన్నమనేని సీతాదేవి’ అవార్డు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక ప్రయోగం విఫలం కావడానికి అనేక కారణాలు ఉంటాయని, వాటిన్నింటినీ పరిశీలించి సమస్యను గుర్తించి పరిష్కరించాల్సి ఉంటుందని తెలిపారు. చంద్రయాన్‌-3 విజయవంతం కావడానికి అందుకుముందు జరిగిన చంద్రయాన్‌-1, చంద్రయాన్‌-2 ప్రయోగాల్లో వచ్చిన ఫలితాలు విశ్లేషించడం ద్వారానే సాధ్యమైందన్నారు. చంద్రయాన్‌-1 ప్రయోగం చేసిన సందర్భంగా భారత ప్రభుత్వం కేవలం చంద్రునిపై దిగడం మాత్రమే కాకుండా భారత పతాకాన్ని ఎగురవేయాలని సూచించిందని తెలిపారు. ఆ ప్రయోగం ద్వారా చంద్రునిపై నీరు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇస్రోలో ఫలితం ఎలా ఉంటుందని కాకుండా పని చేయడం తమ బాధ్యతనే సంస్కృతి ఉంటుందని తెలిపారు. ఎన్ని గంటలు పని చేశాం అనేది పట్టించుకోరన్నారు. అంకితభావంతో పని చేస్తారని, తద్వారా ఇస్రో అనేక విజయాలు సాధిస్తోందని తెలిపారు. బుధ గ్రహం, గురు గ్రహంపై ప్రయోగాలు చేయడం, చంద్రునిపైకి మానవుడిని పంపించడం వంటి అనేక ప్రాజెక్టులు ఇస్రో వద్ద ఉన్నాయని వివరించారు. భారత ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉందని తెలిపారు. చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతమైన రోజు తాను ఎలాంటి ఒత్తిడికీ గురికాలేదన్నారు. తనను ఉన్నత వ్యక్తిగా తీర్చిద్దిన గురువులు, ఎపిజె అబ్దుల్‌ కలాం తదితర శాస్త్రవేతలను స్మరించుకున్నానని వివరించారు. అబ్దుల్‌ కలాం తరువాత తాను ఈ అవార్డు తీసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా చంద్రయాన్‌-3 ప్రయోగం, సోమనాథ్‌ విద్యాభ్యాసం, ఉద్యోగం, ఇస్రోలో చేపట్టిన ప్రయోగాలు, జీవిత విశేషాల లఘుచిత్రాలను ప్రదర్శించారు. పిన్నమనేని ఫౌండేషన్‌ సేవా కార్యక్రమాలు, ప్రముఖులకు అందించిన అవార్డుల వివరాలతో డాక్యుమెంటరీని ప్రదర్శించారు. తొలుత ఫౌండేషన్‌ మేనేజింగ్‌ ట్రస్టీ చదలవాడ నాగేశ్వరరావు స్వాగతం పలికారు. సోమనాథ్‌ని సభకు శశిధర్‌ పరిచయం చేయగా, స్వాతిపూర్ణిమ వందన సమర్పణ చేశారు. సోమనాథ్‌ భార్య వత్సల, పిన్నమనేని ఫౌండేషన్‌ ట్రస్టీ డాక్టర్‌ సుధా, ట్రస్ట్‌ సభ్యులు పాల్గొన్నారు.

➡️