కష్టపడి చదివితే ఉత్తమ ఫలితాలు

  •  ఎమ్మెల్సీలు కెఎస్‌.లక్ష్మణరావు, ఐ.వెంకటేశ్వరరావు

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : కష్టపడి చదివితే ఉత్తమ ఫలితాలు సాధించొచ్చని ఎమ్మెల్సీలు కెఎస్‌.లక్ష్మణరావు, ఇళ్ల వెంకటేశ్వరరావు అన్నారు. కాకినాడలోని అంబేద్కర్‌ భవన్‌లో గ్రూప్స్‌, డివైఇఒ పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు యుటిఎఫ్‌, జెవివి, ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ‘భారత సమాజం-ఆంధ్రుల చరిత్ర-ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థ’ అనే అంశంపై కెఎస్‌.లక్ష్మణరావు మాట్లాడారు. పలు విషయాలపై అభ్యర్థులకు అవగాహన కల్పించారు. ఇష్టపడి చదవాలని, ప్రణాళికాబద్ధంగా చదువుకుంటే విజయాలు వాటంతట అవే వస్తాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో ఒక్క డిఎస్‌సి నోటిఫికేషన్‌ కూడా ఇవ్వలేదన్నారు. ప్రస్తుతం ఇచ్చిన నోటిఫికేషన్‌లో ఆరు వేల టీచర్‌ పోస్టులు మాత్రమే భర్తీ చేయడం దారుణమన్నారు. డిఎస్‌సి, గ్రూప్స్‌ నోటిఫికేషన్‌లో పోస్టులు పెంచాలని శాసన మండలి సమావేశాల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు. పలు అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి మెటీరియల్‌ రూపొందించామని, వీటిని అభ్యర్థులకు ఉచితంగా అందిస్తున్నామని వివరించారు. అనంతరం లక్ష్మణరావు రూపొందించిన ‘భారత సమాజం’ అనే స్టడీ మెటీరియల్‌ను ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు ఆవిష్కరించారు. ఆంధ్రుల చరిత్ర, ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థ అనే స్టడీ మెటీరియల్‌ను యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి టి.అన్నారాము, పూర్వపు రాష్ట్ర కార్యదర్శి జి.ప్రభాకరవర్మ అవిష్కరించారు. ఈ సందర్భంగా ఐవి మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాల్లో గ్రూప్స్‌, డిఎస్‌సి, సచివాలయం ఉద్యోగార్థులకు పిడిఎఫ్‌ ఎమ్మెల్సీల ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ అందిస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అభ్యర్థులకు సూచించారు. అనంతరం అభ్యర్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్‌ను పంపిణీ చేశారు.

➡️