విస్ఫోటనం.. శీతలీకరణమా..!

Mar 10,2024 07:35 #Science, #Sneha, #volcano, #volcano eruption
  • అగ్నిపర్వతం.. విస్ఫోటనం.. శీతలీకరణం..! అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెంది భూమిని చల్లబరుస్తాయా..? అదెలా సాధ్యం.. తదితర అంశాల గురించిన వివరాల్లోకి వెళ్ళే క్రమంలో.. అగ్నిపర్వత విస్ఫోటనాల వల్ల ఏర్పడే వాతావరణంపై అధ్యయనాలు జరిగాయి. ఇండోనేషియాలోని టోబా అగ్నిపర్వతం పేలి 74 వేల సంవత్సరాలైంది. అప్పుడే శాస్త్రవేత్తలకు అనేక సందేహాలు. అలాగే 1980లో మౌంట్‌ సెయింట్‌ హెలెన్స్‌ విస్ఫోటనం జరిగింది. అయితే టోబా అగ్నిపర్వత పేలుడు దీనికంటే వెయ్యి రెట్లు శక్తివంతమైనది. టోబా విస్ఫోటనానికి సూర్యశక్తి తోడై మానవాళి నశించిపోయేంత శక్తి ఉంది. కానీ అలా జరగలేదు. పైగా ఇవి సూర్య కిరణాలను నిరోధించే శక్తిని కలిగి ఉన్నట్లు గుర్తించారు పరిశోధకులు. ఈ సందేహాలను నివృత్తి చేసుకోవాలనే కుతూహలం పెరిగి పరిశోధనలకు దారి తీసింది.

ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రభావం.. దాని పర్యవసానాలు పరిశోధకులను తీవ్ర గందరగోళానికి గురిచేస్తున్న క్రమంలో ఈ విస్ఫోటన కణాలపై పరిశోధనలు జరిపారు. అధునాతన కంప్యూటర్‌ సాంకేతికత టోబా సూపర్‌ – విస్ఫోటన కణాలను సేకరించింది. భూమిని ఎలాగైనా రక్షించాలనే ఉద్దేశ్యమే ఈ పరిశోధనలకు మూలమైంది. విస్ఫోటనం నుంచి వెలువడే కణాలు సూర్యరశ్మిని నిరోధిస్తున్నాయని తేలింది. కాబట్టి భూమినీ చల్లబరుస్తాయని శాస్త్రవేత్తలు భావించారు.

  • సూపర్‌విస్ఫోటనం..

అగ్నిపర్వతం పేలినప్పుడు శిలాద్రవం (లావా) విడుదలవుతుంది. దీనితోపాటు వెలువడే కణాలు వెయ్యి క్యూబిక్‌ కిలోమీటర్ల దూరం కంటే ఎక్కువ ప్రదేశంలో వాతావరణాన్ని కలిసినట్లైతే, దీనిని సూపర్‌ విస్ఫోటనంగా నిర్ణయిస్తారు. ఈ విస్ఫోటనాలు ఎంత శక్తిమంతమైనవో అంత అరుదైనవి. టోబా విస్ఫోటనం తర్వాత న్యూజిలాండ్‌లో 22 వేల సంవత్సరాల క్రితం మరో సూపర్‌ విస్ఫోటనం సంభవించింది.వీటన్నింటినీ సమన్వయం చేసుకుని అధ్యయనాలు జరిపారు.

  • ఏరోసోల్‌ కణాలు..

సూపర్‌ విస్ఫోటనం నుండి సల్ఫేటులు ఏరోసోల్‌ కణాలు వాతావరణంలోకి విడుదలవుతాయి. ఇవి సూర్యకిరణాలను కొంతవరకు పరావర్తనం చెందిస్తాయి. ఈ ఏరోసోల్‌ కణాల పరిమాణంపై శీతలీకరణ చర్య ఆధారపడి ఉంటుంది. ఎంత పెద్ద విస్ఫోటనం జరిగినా శీతలీకరణ స్థాయి 1.5 డిగ్రీల సెల్సియస్‌కు మించలేదని ఇటీవల పరిశోధనల్లో తేలింది. భూమి ఉపరితల ఉష్ణోగ్రతను ఆ కణాలు చల్లబరచలేవని పరిశోధనలో నిర్ధారణ అయింది.

  • అదనంగా ఏరోసోల్‌..

ఏరోసోల్‌ పరిమాణాన్ని అంచనా వేయడానికి ఇంటరాక్టివ్‌ ఏరోసోల్‌ మోడల్‌ను ఈ పరిశోధనల్లో ఉపయోగించారు. అంటే వాతావరణంలో ఉండే స్ట్రాటోస్పియర్‌లో సాధారణంగానే సల్ఫర్‌, ఏరోసోల్‌ కణాలు ఉంటాయి. వీటికి మరికొంత ఏరోసోల్‌ను మిళితం చేసినట్లైతే శీతలీకరణ ప్రక్రియకు సాధ్యమవుతుందనే యోచనలో ఉన్నట్లు అధ్యయన ప్రధాన రచయిత జాచరీ మెక్‌గ్రా తెలిపారు.

  • రిఫ్లెక్షన్‌..

వాతావరణ మార్పులను ప్రభావితం చేసే అంశాలన్నింటినీ బృందం పరిశోధించింది. తొలిగా స్ట్రాటో ఆవరణలోకి పంపిన మైక్రోస్కోపిక్‌ సల్ఫర్‌ కణాలపై దృష్టి సారించింది. అగ్నిపర్వత విస్ఫోటనాల సమయంలో సల్ఫర్‌ డయాక్సైడ్‌ వాయువు నుండి ఏర్పడిన ఈ కణాల సంక్లిష్ట పరస్పర చర్యలను పరిశోధనకు లక్ష్యంగా పెట్టుకుంది బృందం. ఈ కణాలు భూ ఉపరితల ఉష్ణోగ్రతపై రెండు రకాల ప్రభావాలను కలిగి ఉంటాయి. శీతలీకరణ, వేడిని నిరోధించడం. భూమిపై పడుతున్న సూర్యకిరణాలను కొంతవరకు (రిఫ్లెక్షన్‌) వెనుకకు మరలిస్తాయి. గ్రీన్‌హౌస్‌ వార్మింగ్‌ ఎఫెక్ట్‌ ప్రభావం తగ్గించే దిశగా ఉష్ణోగ్రతని నియంత్రించి, శీతలీకరిస్తాయి.

  • జియో ఇంజినీరింగ్‌..

సుదీర్ఘ పరిశోధనల అనంతరం 1.5 నుండి 2 – 8 డిగ్రీల సెల్సియస్‌ వరకు శీతలీకరించేందుకు అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. నాసా పరిశోధకులు ఇప్పుడు సూపర్‌ విస్ఫోటనాలను పరిశీలించడానికి అధునాతన కంప్యూటర్‌ మోడలింగ్‌ను ఉపయోగించారు. కొన్ని అధ్యయనాలు పూర్తి ఫలితాలు ఇవ్వనప్పటికీ, గ్లోబల్‌ వార్మింగ్‌ను నియంత్రించే పరిష్కారం కోసం స్ట్రాటో ఆవరణలోనికి ఏరోసోల్‌ను చొప్పించాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియను జియో ఇంజనీరింగ్‌ పద్ధతితో నిర్వహించాలని అధ్యయనం సూచిస్తోంది.
నాసా జెపిఎల్‌ శాస్త్రవేత్త అయిన లూయిస్‌ మిల్లన్‌ అగ్నిపర్వత ఏరోసోల్‌ కణాల పరిమాణాలను నిర్ణయించే కారకాలపై మరిన్ని పరిశోధనలు చేయవలసి ఉందంటున్నారు.

➡️