సామరస్యం.. సేవాతత్వం..

Feb 18,2024 06:41 #services, #Sneha, #Stories

నేషనల్‌ కేడెట్‌ కార్ప్స్‌ (ఎన్‌సిసి), నేషనల్‌ సర్వీస్‌ స్కీమ్‌ (ఎన్‌ఎస్‌ఎస్‌), భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ (బాలభటులు) వంటి సంస్థలు విద్యార్థుల్లో క్రమశిక్షణని, దేశభక్తిని పెంపొందిస్తాయి. వీటిల్లో చేరిన విద్యార్థులు సమాజం కోసం సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. బాలబాలికల్లో నిబిడీకృతమైన సృజనాత్మక శక్తులను వెలికి తీసి.. వారిని ధైర్యవంతులుగానూ, సాహసాలు చేసే పౌరులుగానూ, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడే ధీరులుగానూ తీర్చిదిద్దేందుకు ‘బాలభట బృందం’ ఎంతగానో దోహదపడుతోంది. చిన్నప్పటి నుంచే పిల్లల్లో పరమత సహనం, సోదర భావం, దేశభక్తి, సేవా భావాన్ని పెంపొందించటానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది. ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు, భూకంపాలు, వరదలు, తుపాన్లు, కరువు పరిస్థితులు వంటివి వచ్చినప్పుడు సహాయపడటంలో వీరు ఎంతగానో కృషి చేస్తారు. పుష్కరాలు, పండుగలు, జాతర్లు వంటి సమయాల్లో శాంతిభద్రతల పర్యవేక్షణ వంటి వాటిల్లోనూ వీరు ఎంతో క్రియాశీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ నెల 22వ తేదీ ‘ప్రపంచ స్కౌట్‌ దినోత్సవం’ సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.

బాలబాలికల్లో దేశభక్తి, క్రమశిక్షణను పెంపొందించి- వారిని సమాజ సేవకులుగా తీర్చిదిద్దడానికి రాబర్ట్‌ స్టీఫెన్‌ సన్‌ స్మిత్‌ బేడెన్‌ పవెల్‌ 1907లో ఇంగ్లాండ్‌లోని బ్రౌన్‌సి ద్వీపంలో 20 మంది విద్యార్థులతో ఈ స్కౌట్‌ (బాలభట బృందం) ప్రారంభించారు. ఈయన 1857 ఫిబ్రవరి 22న లండన్‌ నగరంలో జన్మించారు. ‘థింకింగ్‌ డే’ పేరుతో స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ను ప్రపంచ వ్యాప్తంగా 142 దేశాల్లో జరుపుకుంటున్నారు. ఈ టీమ్‌లో బాలురను ‘స్కౌట్స్‌’, బాలికలను ‘గైడ్స్‌’ అని పిలుస్తారు. దేశంలోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో ఈ శిక్షణ ఇస్తారు. దీనిలో చేరిన పిల్లలకు సేవా నిరతి గురించి, శిక్షణ ఇస్తారు. వీరికి ఈత కొట్టడం, వంతెనలు కట్టడం, రోడ్ల నిర్మాణం, ప్రథమ చికిత్సా పద్ధతులు, ముడులు (నాట్స్‌) వేయటం, మ్యాపింగ్‌, కంపాస్‌, ఎస్టిమేషన్‌, మార్చింగ్‌ వంటివి నేర్పుతారు. ఈ టీమ్‌లో చేరినవారు దళాలుగా ఏర్పడతారు. ప్రతి దళ చిహ్నంగా ఒక పతాకం, వాయిద్యాలు ఉంటాయి. ‘సదా సమాజసేవకు సిద్ధమై ఉంటాం’ అనే నినాదం ఈ పతాకంపై రాసి ఉంటుంది. ప్రతి జట్టూ ఒక నాయకుడి ఆధీనంలో ఉంటుంది. ఈ టీమ్‌లో విద్యార్థులందరూ స్వచ్ఛందంగా చేరాలి. సత్యం పలకడం, కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం, రోగగ్రస్తులకు సేవ చేయడం, పోలీసు వ్యవస్థకు అత్యవసర సమయాల్లో సాయపడటం ద్వారా బాలభటులు సమాజసేవలో పాల్గొంటున్నారు. భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ ప్రధాన కార్యాలయం మధ్యప్రదేశ్‌లోని పచ్మర్హిలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రధాన కార్యాలయం ఇబ్రహీంపట్నం (ఆంజనేయ టవర్స్‌), గుంటూరు జిల్లా తాడికొండలలోనూ శిక్షణా కేంద్రాలున్నాయి. జాతీయ భావం పెంపొందేలా..భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ ద్వారా విద్యార్థినీ విద్యార్థుల్లో జాతీయతా భావాన్ని పెంపొందించటం జరుగుతోంది. ప్రాథమిక స్థాయి పిల్లల్లో 3-5 ఏళ్ల వరకూ బాలబాలికలను బన్నీ, 5 – 10 ఏళ్ల బాలురను కబ్‌, బాలికలను బుల్‌బుల్‌, 10 – 15 (17) ఏళ్లు దాటిన బాలురను (స్కౌట్స్‌), బాలికలను (గైడ్స్‌), 16 – 25 సంవత్సరాల వారు రోవర్స్‌ (బాలురు), బాలికల్ని రేంజర్స్‌గా పిలుస్తారు. పదేళ్లు దాటిన తర్వాత ఆరో తరగతిలో చేరిన తర్వాత ‘ప్రవేశ్‌’ లో చేరతారు. మూడునెలల శిక్షణ ఉంటుంది. ఆ తర్వాత ‘ప్రథమ సోపాన్‌’ ఆరు నెలలు, ‘ద్వితీయ సోపాన్‌’ ఆరు నెలలు, ‘తృతీయ సోపాన్‌’ లకు మరో ఆరునెలలు శిక్షణ ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణత సాధించినవారు తొమ్మిది నెలల తర్వాత ‘రాజ్య పురస్కార్‌’ శిక్షణకు అర్హులవుతారు. రాష్ట్ర స్థాయిలో జరిగే టెస్టులో ఉత్తీర్ణత సాధించినవారికి గవర్నరు సంతకంతో కూడిన సర్టిఫికెట్‌ను అందజేస్తారు. రాజ్య పురస్కార్‌ తర్వాత 12 నెలలకు రాష్ట్రపతి టెస్టింగ్‌ క్యాంపు ఉంటుంది. ఇందులోనూ ఉత్తీర్ణత సాధించిన వారికి రాష్ట్రపతి సంతకంతో కూడిన సర్టిఫికెట్‌ను అందజేస్తారు. ఎన్‌సిసిలో ‘సి’ సర్టిఫికెట్‌కు ఉన్నంత ప్రాధాన్యత ఈ సర్టిఫికెట్‌కు కూడా ఉంటుంది. ఈ సర్టిఫికెట్‌ కోర్సులో ఉత్తీర్ణత పొందినవారికి చదువు, ఉద్యోగాల్లో 0.5 రిజర్వేషను కూడా ఉంటుంది.

సాహసానికి సై.. ప్రతిభలో భళా..

ఆయా జిల్లాలకు చెందిన భారత స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ బాలభట విద్యార్థులు తమ నైపుణ్యాలు, ప్రతిభ ప్రదర్శించి భళా అనిపిస్తుంటారు. చిన్నతనం నుంచే క్రమశిక్షణ, సేవాభావం అలవర్చుకొని, ఆత్మవిశ్వాసం పెంపొందించుకుంటారు. ఈ క్యాంపుల ద్వారా తమలో ఉన్న భయాన్ని పోగొట్టుకొని, ఆత్మస్థయిర్యాన్ని నింపుకుంటుంటారు. ఆపద, విపత్కర పరిస్థితుల్లో ఉన్న సమయంలో ఇతరులను కాపాడగలిగే నైపుణ్యాలను సైతం నేర్చుకుంటారు. తమను తాము కాపాడుకోవడానికి గల అవకాశాలను అలవరుచుకుంటారు. ఎంతో క్రమశిక్షణతో ఉదయం నుంచీ రాత్రి వరకూ వీరికి వివిధ అంశాల్లో జరిగిన శిక్షణల్లో.. ఉదయం లేచిన తర్వాత కాలకృత్యాలు, బిపి 6 ఎక్సర్‌సైజులు, టిఫిన్‌, మెడిటేషన్‌, యోగా, ఆ తర్వాత మానసిక వికాసానికి, దేశభక్తి, ఇతర అంశాలపై తరగతులు కొనసాగుతాయి.

చదువుకుంటూనే జీవన నైపుణ్యాలు

ఓవైపు చదువుకుంటూనే మరోవైపు దేశపౌరులుగా, స్నేహభావం, సేవాభావం, క్రమశిక్షణ, ధైర్యసాహస కృత్యాల్లో రాటుదేలుతారు. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కోగల ఆత్మస్థైర్యాన్ని నింపుకుంటారు. అగ్నిప్రమాదం వంటి ఆపదలో ఉన్నవారిని ఎలా కాపాడాలో నైపుణ్యం సంపాదిస్తారు. బాలభట బృందంలోని ‘ప్రథమ, ద్వితీయ, తృతీయ సోపాన్‌’ టెస్టుల్లో ఉత్తీర్ణులైన వారికి రాష్ట్రస్థాయిలో సర్టిఫికెట్లు అందజేస్తారు. తాము చదువుతున్న పాఠశాల ఆవరణలో మొక్కలు నాటడమే కాదు, వాటి సంరక్షణ బాధ్యతను కూడా వీరు తీసుకుంటారు.

విపత్కర సమయంలో…

దేశంలో ఏ ప్రాంతంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా అక్కడి స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ బాధిత ప్రజానీకానికి వివిధ ప్రభుత్వ శాఖలు, పోలీసు శాఖ ద్వారా అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. రాష్ట్రంలో హుద్‌హుద్‌ తుపాను సంభవించినప్పుడు ఉత్తరాంధ్రలో వందలాది మంది బాలభటులు సేవలందించారు. మిఛాంగ్‌ తుపాను సమయంలోనూ కృష్ణా, గోదావరి నదులతోపాటు సముద్ర తీర ప్రాంతాల్లోని ప్రజానీకాన్ని ఒడ్డుకు తీసుకురావటానికి తమవంతుగా సహకారాన్ని అందించారు. ఆయా ప్రాంతాల్లో మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేసినప్పుడు మందులు అందించటం, స్థానికులను క్యాంపుల వద్దకు తీసుకెళ్లటం, ఇంజక్షన్లు చేయించటం, భోజనం ప్యాకెట్లు అందించడం చేశారు. పల్స్‌ పోలియో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహించినప్పుడు వీరు కూడా వాటిల్లో పాల్గొంటారు. తెలంగాణాలో సమ్మక్క-సారక్క జాతర్లు, యాదాద్రిలో ఉత్సవాలు, ఆంధ్రాలో తిరుపతి, శ్రీశైలం, అన్నవరం, పైడితల్లి అమ్మవారి ఆలయాల వద్ద ఉత్సవాలు జరిగినప్పుడు పోలీసుశాఖకు సహకరిస్తారు. వీరు యాత్రికులను క్యూలైన్లలో ఉండేలా చూడటం, మంచినీరు అందించటం, వసతి, ఆరోగ్య కేంద్రాల వివరాలు తెలియజేస్తారు. కరోనా సమయంలో వలస కూలీలకు ఆయా కేంద్రాల వద్ద భోజనాలు అందించటం, ఆరోగ్య కేంద్రాల వద్ద సహకారాన్ని అందించారు. ప్రతిఏటా ఆగస్టు 15, జనవరి 26న జాతీయస్థాయిలో రాష్ట్రపతి, ప్రధానమంత్రి, రాష్ట్రస్థాయిలో గవర్నర్‌, ముఖ్యమంత్రి వీరి నుంచి గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. బాలబాలికలకు జీవన నైపుణ్యాలు (లైఫ్‌ స్కిల్స్‌) ను నేర్పిస్తారు. సమస్యలను ఎదుర్కొనేలా శిక్షణ ఇస్తారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో కొనసాగుతున్నాయి.

  • దోసపాటి నాగేశ్వరరావు, డిస్ట్రిక్ట్‌ ట్రైనింగ్‌ కమిషనర్‌ (డిటిసి), ఎఎల్‌టి (ఎస్‌), భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ విభాగం, ఎన్‌టిఆర్‌ జిల్లా, సెల్‌ : 9963316332

సాహస కృత్యాలు

బాలభట బృందంలో చేరిన తర్వాత ముందుగా వారిలో ఉన్న భయాలను పోగొట్టే ప్రయత్నం చేస్తారు. ఈ క్యాంప్‌లో పాల్గొనడం ద్వారా చెట్లు, గుట్టలు, ఎక్కడం నేర్చుకుంటారు. ధైర్య, సాహసకృత్యాల్లో పాల్గొంటారు. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా అధిగమించగలమనే నమ్మకాన్ని పెంపొందించుకుంటారు. జీవిత సమస్యలను ఎదుర్కొనగలమనే ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. దేశభక్తియుతంగా..బాలభట బృందంలో చేరడం వల్ల సైనికులుగా ఇతరులకు సేవ చేయాలనే ఆలోచనను పెంపొందించుకుంటారు. సమాజసేవలో తమవంతుగా ఎంతో కొంత సాయం చేయగలననే భావనతో ఉంటారు. దేశం, తల్లిదండ్రుల పట్ల మంచి భావాన్ని పెంపొందించుకుంటారు. మానసిక ధైర్యాన్ని, స్థిరత్వాన్ని అలవర్చుకుంటారు. ఆటుపోట్లను సమర్థవంతంగా ఎదుర్కొని, ఆరోగ్యకరమైన మానసిక ప్రవృత్తిని పెంపొందించుకుంటారు. పిల్లలకు ఈ శిక్షణ ఇవ్వటం ద్వారా వారిలో దేశ సమగ్రతకు సంబంధించిన అంశాలపై మంచి అవగాహన వస్తుంది. స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ శిక్షణ ఇచ్చే టీచర్లకు కూడా వివిధ రూపాల్లో శిక్షణలు ఉంటాయి. ముందుగా బేసిక్‌ స్కౌట్‌ మాస్టర్‌ కోర్సు, ఆ తర్వాత అడ్వాన్స్‌, హిమాలయ ఉడ్‌ బ్యాడ్జ్‌ కోర్సు (హెచ్‌డబ్ల్యుబి), ఆ తర్వాత ప్రీఅడల్ట్‌ లీడర్‌ ట్రైనర్‌ (ప్రీ ఎఎల్‌టి), ఎఎల్‌టి, ఆ తర్వాత ఎల్‌టి లీడర్‌ ట్రైనర్‌ శిక్షణలు ఉంటాయి. ఎల్‌టి కోర్సు పూర్తిచేసిన వారు దేశంలో ఎక్కడైనా శిక్షణకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది.

  • బి.ఎన్‌.వి.భాస్కరరావు, అసిస్టెంట్‌ స్టేట్‌ ఆర్గనైజింగ్‌ కమిషనర్‌ (ఎఎస్‌ఒసి)

 

  • – యడవల్లి శ్రీనివాసరావు, 949009214
➡️