ఆశ్రమ పాఠశాలలో తాగునీటి సమస్యపై ఐటిడిఎ ముట్టడి

ప్రజాశక్తి-రంపచోడవరం
తమ ఆశ్రమ పాఠశాలలో నీటి సమస్యను పరిష్కరించాలని కోరతూ స్థానిక ఎపి గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల విద్యార్థినులు సోమవారం మూడు కిలో మీటర్లు కాలినడకన వచ్చి ఐటిడిఎ కార్యాలయాన్ని ముట్టడించారు. ఐటిడిఎ పిఒకు విన్నవించేందుకు సోమవారం ఉదయం విద్యార్థినులందరూ ఖాళీ బకెట్లు, వాటర్‌ బాటిళ్లు చేతపట్టి పాఠశాల నుండి బయలుదేరగా, వారిని పాఠశాల సిబ్బంది అడ్డుకున్నారు. అయినా విద్యార్థినులు వెనక్కి తగ్గకుండా సుమారు మూడు కిలోమీటర్లు మేర రోడ్లపై పరుగులు పెడుతూ ఐటీడీఏ కార్యాలయానికి చేరుకొని అక్కడ నిరసనకు దిగారు. విషయం తెలుసుకున్న ఐటీడీఏ పీవో విద్యార్థినుల వద్దకు వచ్చి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొద్ది రోజులుగా పాఠశాలలో తాగునీరు లేదని, మరుగుదొడ్లలో సైతం నీరు రావడం లేదని, 500 మంది విద్యార్థినులు ఉండగా, కేవలం 3 మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయని, మిగిలినవి మరమ్మతులకు గురికావడంతో ఉపయోగంలో లేవని తెలిపారు. నీటి కోసం సమీపంలో ఉన్న హాస్టల్‌కు వెళ్లి తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. భోజనం కూడా సరిగా పెట్టడం లేదని, రెండు రోజుల క్రితం వండిన వంకాయ కూరలో నత్తలు, పురుగులు ఉన్నాయని చెప్పగా వాటిని పక్కన పడేసి తినాలని తమను బెదిరించారని విద్యార్థినులు వాపోయారు. ఈ సమస్యలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని, అందుకే ఐటీడీఏ పీవో దృష్టికి తీసుకువచ్చేందుకు వచ్చామని చెప్పారు. ప్రస్తుతం ఉన్న హెచ్‌ఎంను బదిలీ చేయాలని, లేకుంటే తాము పాఠశాల నుండి వెళ్లిపోయేందుకు సిద్ధంగా ఉన్నామని విద్యార్థినులు స్పష్టం చేశారు. దీనికి స్పందించిన ఐటీడీఏ పిఓ విద్యార్థినులతో కలిసి బస్సులో పాఠశాలకు వెళ్లి అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులను పరిశీలించారు. కొన్ని సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని, మిగిలిన వాటిని విచారణ చేసి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పిఒ హామీ ఇచ్చారు.
విద్యార్థినులకు సిపిఎం నేతల సంఘీభావం
విద్యార్థినులు ఐటిడిఏ ముట్టడి విషయం తెలుసుకున్న సిపిఎం నాయకులు మట్ల వాణిశ్రీ, సిరిమల్లె రెడ్డి, శాంతిరాజు జగదీష్‌ ఐటీడీఏ వద్దకు వచ్చి విద్యార్థినులకు సంఘీభావం తెలిపారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు అనంతరం ఐటీడీఏ పీవోకు విద్యార్థులు పడుతున్న సమస్యలను వివరించి ఐటిడిఏ పిఓతో పాటు పాఠశలకు వెళ్లి అక్కడ వాళ్ళు చెప్పిన సమస్యలను పరిశీలించారు. విద్యార్థుల సమస్య పరిష్కారం అయ్యేవరకు సిపిఎం అండగా ఉంటుందని విద్యార్థులకు భరోసా ఇచ్చారు.

➡️